ఉండవల్లి, సాయిప్రతాప్ రాజీనామా!
తెలంగాణపై సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని కేంద్రం ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, రాజంపేట ఎంపీ సాయిప్రతాప్ కాంగ్రెస్ పార్టీకి, పదవులకు రాజీనామా చేశారు. టీ నోట్ ఆమోదం పొందిన వెంటనే ఉండవల్లి గురువారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఈ మేరకు తన నిర్ణయం వెల్లడించారు. ఇప్పటికే ఎంపీ పదవికి రాజీనామా చేశానని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికీ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
సీమాంధ్ర ప్రజల మనోభావాలు పట్టించుకోకుండా సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని యథాతథంగా ఆమోదించడానికి నిరసనగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొంటూ అధిష్టానానికి లేఖ పంపానన్నారు. 2014 వరకూ రాష్ట్ర విభజన పూర్తికాదని ఇంకా నమ్ముతున్నానని, ఆ తర్వాతా తెలంగాణ ఏర్పాటును అడ్డుకోవాలంటే కాంగ్రెస్‌పార్టీ సభ్యునిగా ఏమీ చేయలేను కాబట్టి, ప్రజాభిమతానికి అనుగుణంగా రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 35 ఏళ్లుగా కాంగ్రెస్‌ను నమ్ముకుని ఎనలేని సేవలందించినా, సీమాంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా కేబినెట్‌లో టీ.నోట్‌ను పెట్టడంపై సాయిప్రతాప్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
సీమాంధ్ర ప్రజలను దెబ్బతీసే విధంగా వ్యవహరించిన కాంగ్రెస్‌ను వీడడమే మంచిదని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి, పీసీసీ అధ్యక్షుడికి కూడా పంపానన్నారు. ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. నేడు కోట్ల రాజీనామా!: మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టు రైల్వేశాఖ సహాయమంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ప్రకటించారు. కేబినెట్ నిర్ణయానంతరం కర్నూలులో విలేకరులతో మాట్లాడిన మంత్రి శుక్రవారం ఢిల్లీకి వెళ్లి ప్రధానికి రాజీనామా సమర్పిస్తానని చెప్పారు.
కావూరి, పళ్లంరాజులను వారించిన ప్రధాని: మరోవైపు గురువారం నాటి కేంద్ర కేబినెట్ భేటీలో పాల్గొన్న సీమాంధ్ర మంత్రులు కావూరి సాంబశివరావు, పళ్లంరాజులు.. భేటీ తర్వాత ప్రధాని మన్మో„హన్‌సింగ్‌తో సమావేశమయ్యారు. పదవుల్లో కొనసాగలేమని చెప్పారు. అయితే తొందరపడి ఎలాంటి నిర్ణయాలూ తీసుకోవద్దని ప్రధాని నచ్చజెప్పారు. దీంతో రాజీనామాలపై వారెలాంటి నిర్ణయం తీసుకోలేదు. వారు శుక్రవారం నిర్ణయం తీసుకునే అవకాశముంది.