యాతరో యాతర.. పోటా పోటీ జాతర | Congress Leaders Started Padayatra in Telangana | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో ఎవరికి వారే పోటాపోటీ యాత్రలు 

Published Sat, Mar 4 2023 5:27 AM | Last Updated on Sat, Mar 4 2023 8:27 AM

Congress Leaders Started Padayatra in Telangana - Sakshi

రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఎవరికి వారే యమునా తీరే రీతిలో వ్యవహరిస్తున్నారు. ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ నిర్వహించిన భారత్‌ జోడో యాత్రకు కొనసాగింపుగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో చేపడుతున్న హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్రల నిర్వహణలో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు పోటీలు పడుతున్నారు. తొలుత రాష్ట్ర వ్యాప్తంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో యాత్రలు నిర్వహించాలనుకున్నా... కొన్ని అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఆయన తాత్కాలిక షెడ్యూల్‌ రూపొందించుకుని హాథ్‌సే హాథ్‌ జోడో యాత్రలు చేస్తున్నారు. ఇప్పుడు ఆయనకు పోటీగా కొందరు రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు షెడ్యూల్‌ రూపొందించుకుని ఇతర నియోజకవర్గాల్లో యాత్రలకు సిద్ధమవుతుండడం గమనార్హం.

ఎవరి ’దారి’వారిదే.. 
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి పోటీగా శుక్రవారం రాష్ట్రంలో మరో యాత్ర ప్రారంభమయింది. ‘తెలంగాణ కాంగ్రెస్‌ పోరు యాత్ర’పేరుతో మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఈ యాత్రలను ప్రారంభించారు. ఏఐసీసీ అనుమతితో బాసర పుణ్యక్షేత్రం నుంచి హైదరాబాద్‌ వరకు తాను యాత్ర చేస్తానని ఇప్పటికే ప్రకటించిన ఏలేటికి కాంగ్రెస్‌ సీనియర్లు కూడా మద్దతిస్తున్నారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తదితరులు ఈ యాత్రలో పాల్గొనడం రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీలో చర్చకు తావిస్తోంది.

మహేశ్వర్‌రెడ్డి కంటే ముందే సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కూడా యాత్రకు ప్లాన్‌ చేశారు. ఆయన కూడా రేవంత్‌కు సమాంతరంగా బాసర పుణ్యక్షేత్రం నుంచి హైదరాబాద్‌కు యాత్ర చేయాలనుకున్నారు. కానీ, ఇప్పుడు ఏలేటి ఆ యాత్రకు ఉపక్రమించారు. అయితే, భట్టి ఇప్పటికే పీపుల్స్‌ మార్చ్‌ పేరుతో తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న మధిర నియోజకవర్గంలో పాదయాత్ర గతంలోనే పూర్తి చేశారు. హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్రల్లో భాగంగా మళ్లీ ‘పీపుల్స్‌ మార్చ్‌’పేరుతో రాష్ట్రంలోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. 

మాణిక్‌రావ్‌ ఠాక్రే చేతుల మీదుగా.. 
మరోవైపు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్‌ కూడా తనదైన శైలిలో హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్రకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలోని విద్యార్థి లోకం మద్దతు కాంగ్రెస్‌ పారీ్టకి కూడగట్టేందుకు గాను ఆయన విశ్వవిద్యాలయాల్లో ఈ యాత్ర చేయాలనే యోచనలో ఆయన ఉన్నారు. ఇందుకు సంబంధించిన రూట్‌మ్యాప్‌ కూడా తయారవుతోంది. మరోవైపు టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా తనతో పాటు తన సతీమణి ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గాల్లో యాత్రకు ఉపక్రమించారు.

రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే ఈ యాత్రలను ప్రారంభించడం గమనార్హం. ఇక, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో తాను బైక్‌ యాత్ర చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. వాస్తవానికి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఆయా నియోజకవర్గాల నేతలందరూ రెండు నెలల పాటు పాదయాత్ర చేయాల్సి ఉంది. అయితే ఢిల్లీ పెద్దలు చెప్పిన దానికి భిన్నంగా ఈ యాత్రలు జరుగుతుండడం గమనార్హం. 
కరీంనగర్‌లో 9న సభ 
హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్రల్లో భాగంగా ఈనెల 9న కరీంనగర్‌లో భారీ బహిరంగసభ నిర్వహించాలని టీపీసీసీ నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్రా న్ని ఏర్పాటు చేస్తామని అప్పట్లో కరీంనగర్‌లో సభలోనే సోనియాగాంధీ హామీ ఇచ్చి అమలు చేసిన నేపథ్యంలో ఆ సభ జరిగిన ప్రదేశంలోనే భారీ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలైన రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల సీఎంలను కూడా ఆహా్వనించనున్నారు.  

రేవంత్‌కు సీనియర్లు దూరంగా.. 
సీఎల్పీ నేత మల్లు భట్టి, మాజీ ఎంపీ వి.హనుమంతరావులు రేవంత్‌ యాత్రకు హాజరై అందరం కలిసే ఉన్నామని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ, ఆ తర్వాత సీనియర్‌ నేతలు ఆయన యాత్ర వైపు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలు వస్తున్నాయి. మొత్తంమీద ఏఐసీసీ ఉద్దేశానికి భిన్నంగా రాష్ట్రంలో యాత్రలు జరుగుతున్నాయని, రాష్ట్ర కాంగ్రెస్‌ కీలక నేతలంతా కలిసికట్టుగా ఉన్నామన్న భావన ప్రజల్లో కలిగించేందుకు సిద్ధంగా లేరనే చర్చ జరుగుతోంది. ఇక, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి యాత్రపై రేవంత్‌రెడ్డి స్పందిస్తూ హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్రలు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో చేయాలని ఏఐసీసీ చెప్పిందని, చేయకపోతేనే ఏఐసీసీ చర్యలు తీసుకుంటుందని వ్యాఖ్యానించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement