తెలంగాణలో మరో రాజకీయ పార్టీ పాదయాత్రకు రంగం సిద్ధం అవుతుందా? వచ్చే ఎన్నికలే టార్గెట్‌గా అన్ని పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. పాదయాత్రలతో అధికారంలోకి వస్తామని భావిస్తున్న ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ మరోసారి పాదయాత్రకు రెడీ అవుతున్నారా? పార్టీ జాతీయ నాయకత్వం రాష్ట్ర అధ్యక్షుడి పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? ఇంతకీ ఏ పార్టీ? ఆ నాయకుడెవరు?
నడుస్తా.. గెలిపిస్తా..!
తెలంగాణలో ప్రస్తుతం పాదయాత్రల సీజన్ నడుస్తోంది. కమలం పార్టీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ విడతల వారీగా ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాష్ట్రమంతటా పాదయాత్ర చేస్తున్నారు. వీరి దారిలోనే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కూడా పాదయాత్ర చేయాలని సంకల్పించారు. ఆయన గతంలో కూడా కొంతమేర పాదయాత్ర నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికలు ఏడాదిలోనే రానున్న తరుణంలో మళ్ళీ రాష్ట్రమంతా పాదయాత్ర చేయాలని రేవంత్ భావిస్తున్నారు. ఏదో ఒక రూపంలో నిత్యం ప్రజల్లో ఉండకపోతే అధికారంలోకి రావడం సాధ్యం కాదని భావిస్తున్న పీసీసీ చీఫ్...ఈ మేరకు పార్టీలోని తన సన్నిహితులకు చెప్పినట్లు సమాచారం.
ఏడాదంతా జనంలోనే.!
తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుండటంతో పీసీసీ చీఫ్ రేవంత్ తన సన్నిహితుల దగ్గర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఎంత కష్టపడ్డా.. రాష్ట్ర ప్రభుత్వ అవినీతికి సంబంధించి ఎన్ని విషయాలు వెలుగులోకి తెస్తున్నా... జనం తనను ఆదరించడం లేదని వాపోతున్నారట. జనరల్ ఎలక్షన్స్ కు కేవలం ఏడాది మాత్రమే ఉండటంతో.. వచ్చే ఏడాది కాలం నిత్యం జనంలోనే ఉండాలని డిసైడ్ అయ్యారట రేవంత్‌రెడ్డి. అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని యోచిస్తున్నారట. పాదయాత్రను డిసెంబర్ 9న సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా స్టార్ట్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అందుకోసం తన ముఖ్య అనుచరులకు ఈ మేరకు సిగ్నల్స్ కూడా అందాయని తెలుస్తోంది. సదరు నేతలు ఇప్పుడు రేవంత్ పాదయాత్ర ఏర్పాట్లలో తలమునకలయినట్లు టాక్ నడుస్తోంది.
హస్తం కేరాఫ్ హస్తిన.!
అయితే కాంగ్రెస్ జాతీయ పార్టీ కావడంతో.. ఏ నిర్ణయం అయినా ఢిల్లీ స్థాయిలోనే జరుగుతుంది. రేవంత్ రెడ్డి పాదయాత్ర ఆలోచనకు పార్టీ హైకమాండ్ ఎంత వరకు ఓప్పుకుంటుందనేది ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. రేవంత్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే మిగతా నేతలు అభ్యంతరం చెప్పే అవకాశం ఉంది. పాదయాత్రలు చేయడానికి చాలా మంది నాయకులు రెడీ అవుతారు. కాంగ్రెస్ అధికారంలో లేకపోయినా.. వస్తుందన్న ఆశ లేకపోయినా... ముఖ్యమంత్రి అభ్యర్థులు డజన్ల మంది ఉంటారు. ఈ నేపథ్యంలో టీ కాంగ్రెస్ లో ముఖ్య నాయకులందరినీ ఒప్పించి రేవంత్ రెడ్డి పాదయాత్రకు రూట్ క్లియర్ చేస్తుందా? లేక ఇతర నేతలు అడ్డు చెప్తున్నారంటూ రేవంత్ రెడ్డి పాదయాత్ర కు రెడ్ సిగ్నల్ చూపిస్తుందా చూడాలి.
చదవండి: మానుకోటలో మహిళా నేతల కోల్డ్‌వార్
ఏమన్నా చేసుకో.. పైసలు మాత్రం అడక్కు.!
కాంగ్రెస్ అధిష్టానం నుంచి రేవంత్ పాదయాత్రకు అనుమతి వస్తుందా రాదా అనేది ఒక ప్రశ్న. దానికి ఢిల్లీ నుంచి మాత్రమే సమాధానం ఇవ్వాలి. కాగా పాదయాత్ర అంటే రాష్ట్రంలోని నేతలు హాడలిపోతున్నారట. ఇప్పటికే మునుగోడు బై పోల్ కు , భారత్ జోడో యాత్రకు ఖర్చు తడిసి మోపెడయిందని, ఇప్పుడు పాదయాత్ర అంటే మళ్ళీ డబ్బు ఎలా సమకూర్చాలనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. పాదయాత్ర అంటే రోజుకు కనీసం 25 నుంచి 50 లక్షలు ఖర్చు అవుతుందని..ఎక్కడి కక్కడ స్థానిక, జిల్లా నాయకులే భరించాల్సి ఉంటుందని అంటున్నారు. రేవంత్ యాత్ర పార్టీ శ్రేణులకు ఉత్సాహాన్నిస్తుందని భావిస్తున్నారు. అయితే పాదయాత్రకు వనరులే ఇబ్బందిగా మారే అవకాశం అంటున్నారు టీ కాంగ్రెస్ నేతలు.
-పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment