రాజకీయప్రయోజనం ఆశించే విభజన నిర్ణయం: ఉండవల్లి
హైదరాబాద్: రాజకీయ ప్రయోజనం ఆశించే కాంగ్రెస్ విభజన నిర్ణయం తీసుకుందని రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పష్టం చేశారు. మాదాపూర్ దసపల్లా హోటల్లో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం ఆదివారం నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో ఆయన మాట్లాడారు. 2014 లోపు పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందడం అనుమానమేనన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు రాదని చెప్పారు. ముసాయిదా బిల్లును శాసనసభ తిరస్కరిస్తే, పార్టీ అధిష్టానం పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టకపోవచ్చునన్నా అభిప్రాయం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ను ఖాళీచేసి వెళ్లాలన్న వ్యాఖ్యల వల్లే సీమాంధ్రుల ఆత్మాభిమానం దెబ్బతిందన్నారు. అందుకే సమైక్య ఉద్యమం తలెత్తిందని చెప్పారు. ఈ నెల 23న సాయంత్రం 6 గంటలకు 40 మంది సీమాంధ్ర నేతలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అపాయింట్ మెంట్ ఇచ్చారని తెలిపారు. ఆలోచించి విభజనపై నిర్ణయం తీసుకోవాలన్నది రాష్ట్రపతి అభిప్రాయం అని ఉండవల్లి తెలిపారు. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు కాంగ్రెస్, బీజేపీ అనుకూలం అయినందువల్ల విభజన ఆగే ప్రసక్తే లేదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.