తిరుపతి జేఏసీ కన్వీనర్గా శ్రీకాంత్రెడ్డి
చిత్తూరు: సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం రోజురోజుకు ఉధృతమవుతోంది. ఎపి ఎన్జిఓ సంఘాలే కాకుండా ఇతర ప్రజా సంఘాలు కూడా ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్నాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా తిరుపతి జేఏసీ ఆవిర్భావించింది. 325 ప్రజాసంఘాల కలయికతో దీనిని ఏర్పాటు చేశారు. ప్రొఫెసర్ వి. శ్రీకాంత్ రెడ్డిని జేఏసీ కన్వీనర్గా ఎన్నుకున్నారు. శ్రీకాంత్ రెడ్డి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సైకాలజీ ప్రొఫెసర్గా ఉన్నారు. భవిష్యత్ కార్యాచరణను రేపు నిర్ణయిస్తారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు యుపిఏ భాగస్వామ్య పక్షాలు, సిడబ్ల్యూసి ఆమోదం తెలిపిన రోజు నుంచి చిత్తూరు జిల్లాలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా తిరుపతిలో బంద్లు, రాస్తారోకోలు, దిష్టిబొమ్మలు తగులబెట్టడం, వాహనాలు దగ్ధం చేయడం వంటి సంఘటనలో ఇక్కడ రాష్ట్ర విభజనకు నిరసన తెలుపుతున్నారు. ఈ నేపధ్యంలో సమైక్యాంధ్ర కోసం ఇప్పుడు 325 ప్రజాసంఘాలు కలిసి జాయింట్ యాక్షన్ కమిటీ(జెఎసి)గా ఏర్పడ్డాయి. ఉద్యమాన్ని ఉధృతం చేయాలన్న ఉద్దేశంతో వీరు ముందుకు సాగుతున్నారు.