విశాలాంధ్ర మహాసభ ఏఐసిసి కార్యాలయ ముట్టడి
న్యూఢిల్లీ: విశాలాంధ్ర మహాసభ సభ్యులు, కార్యకర్తలు ఏఐసిసి కార్యాలయాన్ని ముట్టడించారు. ఇక్కడ వారు పెద్ద ఎత్తు ఆందోళన చేస్తున్నారు. ఇంత భారీస్థాయిలో ఆందోళన కార్యక్రమాలు ఎప్పుడూ ఇక్కడ నిర్వహించలేదని చెబుతున్నారు. కార్యకర్తలు అధిక సంఖ్యలో కార్యాలయం లోపలకు చొచ్చుకుపోవడానికి ప్రయత్నించారు. పోలీసులు వారిని నెట్టివేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు, పో్లీసులకు మధ్య తోపులాట జరిగింది. కార్యకర్తలు కార్యాలయం లోపలకు చెప్పులు విసిరేశారు. పోలీసులు భారీగా మోహరించారు. దాంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
మా తెలుగుతల్లికి మల్లెపూదండ... పాట పాడుతూ, జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి విశాలాంధ్ర మహాసభ ప్రతినిధులు ఇక్కడకు వచ్చి రాష్ట్ర విభజనకు నిరసన తెలుపుతున్నారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో రెండో రోజులుగా ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం జంతర్ మంతర్ వద్ద సమైక్యవాదులు ర్యాలీ నిర్వహించనున్నారు.
శనివారం విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో వేలాదిమంది సమైక్యవాదులు శనివారం ఢిల్లీ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. దీనికి ఏజీపీ, జేడీయూ మద్దతు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్ను సమైక్యంగా ఉంచాలని అసోం గణపరిషత్, జేడీయూ పార్టీలు డిమాండ్ చేశాయి. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ఈ రెండు పార్టీలు వ్యతిరేకించాయి.