యూటీ చేయడం అసాధ్యం: కోదండరాం
Published Mon, Sep 9 2013 1:32 AM | Last Updated on Mon, Jul 29 2019 2:51 PM
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ముమ్మాటికీ తెలంగాణలో అంతర్భాగమేనని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం స్పష్టంచేశారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం (యూటీ) చేయడం అసాధ్యమన్నారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలనే డిమాండ్లకు వ్యతిరేకంగా ఆదివారం ఇందిరాపార్కు వద్ద వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ లేని తెలంగాణ, తెలంగాణ లేని హైదరాబాద్ లేదని, 10 జిల్లాలతో కూడిన తెలంగాణ సాధించే వరకూ పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు. భౌగోళికంగా ఏ ప్రాంతంలో కలవడానికి వీలులేని ప్రాంతాన్ని మాత్రమే యూటీగా చేస్తారని, కానీ హైదరాబాద్ 10 జిల్లాల తెలంగాణకు మధ్యలో ఉందని వివరించారు.
భూ దందాల కోసమే హైదరాబాద్‌లో రామోజీ ఫిలింసిటీ, మాదాపూర్‌లో హైటెక్‌సిటీ, శంషాబాద్ ఎయిర్‌పోర్టు వంటి నిర్మాణం జరిగిందని విమర్శించారు. హైదరాబాద్‌లో సీమాంధ్రులకు రక్షణ లేదనే వాదనలు కేవలం అపోహలేనన్నారు. జేఏసీ కో చైర్మన్లు దేవీప్రసాద్, వి.శ్రీనివాస్‌గౌడ్, కత్తి వెంకటస్వామి మాట్లాడుతూ ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ పేరుతో ప్రభుత్వమే సభ జరిపించిందని మండిపడ్డారు. సభకు వచ్చే దగ్గర్నుంచి తిరిగి వెళ్లే వరకూ పోలీసు బందోబస్తు నిర్వహించడం సిగ్గుచేటన్నారు. మూవ్‌మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ అధ్యక్షుడు హమీద్ మహ్మద్ ఖాన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిని తొలగిస్తేనే రాష్ట్రంలో శాంతి నెలకొంటుందన్నారు. కార్యక్రమంలో టీపీఎఫ్ ఉపాధ్యక్షుడు వేదకుమార్, టీఆర్‌ఎస్ నేత శ్రవణ్‌కుమార్ సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నేతలు పాల్గొన్నారు.
Advertisement
Advertisement