నిరుద్యోగ ర్యాలీ: ఎక్కడికక్కడ అరెస్టులు
Published Wed, Feb 22 2017 12:11 PM | Last Updated on Fri, Nov 9 2018 4:10 PM
హైదరాబాద్: టీజేఏసీ నిర్వహించ తలపెట్టిన నిరుద్యోగుల ర్యాలీని పోలీసులు ఉక్కుపాదంతో అణిచివేస్తున్నారు. ఎక్కడికక్కడ విద్యార్థులను అరెస్టు చేస్తున్నారు. నిరుద్యోగ ర్యాలీకి అనుమతిలేదంటున్న పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ నిరసనకారులను నిర్బంధంలోకి తీసుకుంటున్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ర్యాలీగా బయలు దేరాడానికి యత్నించిన యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర వైస్ చైర్మన్ విమలక్కను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు ఉన్న మరో ఆరుగురిని అదుపులోకి తీసుకొని సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఎల్బీ నగర్ చౌరస్తాలో ఉద్రిక్తత
మరోవైపు ఎల్బీ నగర్ చౌరస్తా వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిరుద్యోగుల ర్యాలీలో పాల్గొనడానికి వస్తున్న నాయకులను పోలీసులు అరెస్ట్ చేస్తున్న క్రమంలో ఓ ఎస్సైకి గాయాలయ్యాయి. జేఏసీ ర్యాలీకి మద్దతుగా టీఎస్‌ఎఫ్(తెలంగాణ స్టూడెంట్ ఫెడరేషన్) నాయకులు ఆందోళన చేస్తుండగా.. పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారిని డీసీఎం వాహనంలో అక్కడి నుంచి తరలిస్తుండగా.. ఒక్కసారిగా తోపులాట జరిగింది. ఈ గందరగోళంలో ఎల్బీ నగర్ ఎస్సైగా పని చేస్తున్న నరేందర్ డీసీఎం పై నుంచి కిందపడ్డారు. దీంతో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి.
Advertisement