మాట్లాడుతున్న జేఏసీ నాయకులు
ముషీరాబాద్ : ఆర్టీసీ పరిరక్షణ, కార్మికుల వేతన సవరణ తదితర సమస్యల పరిష్కారంపై ప్రభుత్వ, యాజమాన్య వైఖరికి వ్యతిరేకంగా అధికార టిఎంయు ఈ నెల 11 నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునివ్వడాన్ని ఆర్టీసీలోని 8సంఘాలతో కూడిన జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) స్వాగతించింది. మంగళవారం ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ టీఎంయు ఇచ్చిన ఆందోళన కార్యక్రమాన్ని బలపరుస్తూ 7న కార్మికులు ఎర్ర బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతారని, 8, 9, 10తేదీల్లో జేఏసీ నాయకులు రాష్ట్రంలోని అన్ని డిపోల్లో పర్యటించి కార్మికులను సమ్మెకు సమాయత్తం చేస్తారని తెలిపారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకుని సమ్మెను నివారించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
మూడు ప్రధాన డిమాండ్లపై రాజీలేని పోరాటం చేయాలని టీఎంయును కోరారు. సంస్థ పరిరక్షణలో భాగంగా పన్నుల మినహాయింపులతో పాటు డీజిల్‌పై పెరుగుతున్న భారాన్ని ప్రభుత్వం భరించే విధంగా ఒప్పించాలని, రూ.24వేలు కనీస వేతనం ఉండేలా మాస్టర్ స్కేల్ అమలు చేస్తూ ఒప్పందం కుదుర్చుకోవాలని, కండక్టర్, డ్రైవర్ల ఉద్యోగ భద్రతపై, టికెట్ తీసుకునే బాధ్యత ప్రయాణికుల పైనే ఉండేలా రెగ్యులేషన్స్ సవరించాలనే డిమాండ్లను సాధించుకునే విధంగా సమ్మె సాగాలని కోరారు. సమావేశంలో రాజిరెడ్డి (ఈయూ), హన్మంత్ ముదిరాజ్ (టిజేఎంయు), విఎస్ రావు (ఎస్‌డబ్ల్యూఎఫ్), రమేష్ (కెఎస్), అబ్రహం (ఎస్‌డబ్ల్యూయు), యాదగిరి (కెపి) పాల్గొన్నారు.
ఏకపక్ష నిర్ణయాలు తగవు...
సమ్మె తేదీ ప్రకటించక ముందే ఆర్టీసీ జేఏసీలోని ముగ్గురు ప్రతినిధులను మాత్రమే ఆహ్వానించి మిగిలిన ప్రతినిధులను పిలవకపోవడాన్ని జేఏసీ తప్పుపట్టింది. చర్చల్లో భాగంగా నిర్దిష్టమైన ప్రణాళికపై చర్చించకుండా జేఏసీని సంప్రదించకుండా ఏకపక్షంగా సమ్మె తేదీని నిర్ణయించడం దారుణమన్నారు. టిఎంయు వైఖరి కార్మికులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని అభిప్రాయపడింది. గుర్తింపు సంఘంగా అన్ని యూనియన్‌లను ఒకతాటి పైకి తేవడంలో విఫలమయ్యారని ఆరోపించారు. నిరవధిక సమ్మెలోకి వెళ్తే కార్మికులకునష్టం జరగకూడదనే విశాల దృక్పథంతో జేఏసీ కూడా సమ్మెకు మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment