సాక్షి, సిటీబ్యూరో: ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మెకుమద్దతుగా ప్రధాన రాజకీయ పార్టీలు, కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, ప్రజాసంఘాలు శనివారం నిర్వహించ తలపెట్టిన ‘తెలంగాణ బంద్’ కారణంగా నగరంలో ప్రజారవాణా స్తంభించే పరిస్థితులు నెలకొన్నాయి. బంద్‌ను విజయవంతం చేసేందుకు కార్మిక సంఘాలు విస్తృత ఏర్పాట్లు చేశాయి. ఇప్పటి వరకు ప్రైవేట్ సిబ్బంది సహాయంతోఅరకొరగా నడుస్తున్న సిటీ బస్సులూ నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే బంద్‌కు పిలుపునిచ్చిన తెలంగాణ స్టేట్ ట్యాక్సీ, డ్రైవర్స్ జేఏసీ ‘తెలంగాణ బంద్’కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. దీంతో ఆటోలు, క్యాబ్‌లు కూడా నిలిచిపోనున్నాయి. తెలంగాణ ఆటోడ్రైవర్ల సంక్షేమ సంఘం, ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ తదితర సంఘాలన్నీ ఆర్టీసీ మద్దతు తెలిపాయి. 14 రోజులుగా నిరవధికంగా కొనసాగుతున్న సమ్మె, తెలంగాణ బంద్, సమస్యలు పరిష్కరించే వరకూ సమ్మె కొనసాగుతుందన్న ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ప్రకటన, ఈ నెల 21 నుంచి విద్యాసంస్థలు తిరిగి ప్రారంభమవడం తదితర పరిణామాలను దృష్టిలో ఉంచుకొని రవాణా అధికారులు బస్సుల నిర్వహణపై సీరియస్‌గా దృష్టిసారించారు. ‘ప్రైవేట్ డ్రైవర్లు, కండక్టర్ల తాత్కాలిక నియామకాలను ముమ్మరం చేశాం. చర్చలు సఫలమై కార్మికులు విధుల్లో చేరితే మంచిదే.. లేని పక్షంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నాం’ అని రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
ప్రయాణం కష్టమే...
గ్రేటర్‌లో సాధారణ రోజుల్లో నిత్యం సుమారు 3,750 బస్సులు 32 లక్షల మంది ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. సమ్మె కారణంగా 14 రోజులుగా 1200–1400 బస్సులు మాత్రమే రోడ్డెక్కుతున్నాయి. ఈ బస్సులను సైతం కేవలం పగటిపూట మాత్రమే నడుపుతున్నారు. శనివారం నిర్వహించనున్న బంద్ దృష్ట్యా ఇవి కూడా నిలిచిపోయే అవకాశం ఉంది. దీంతో సుమారు 8 లక్షల మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురికానున్నారు. మరోవైపు నగరం నుంచి తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే బస్సులు కూడా ఆగిపోయే అవకాశం ఉంది. దూరప్రాంతాల బస్సులు నిలిచిపోతే మరో లక్ష మంది వరకు ప్రయాణికులకు ఇబ్బందులు తప్పవు. నగరంలో నివాసం ఉంటూ గ్రామీణ ప్రాంతాల్లో, మండల, జిల్లా కేంద్రాల్లో పనిచేసే వేలాది మంది ఉద్యోగులు విధులకు హాజరుకావడం కష్టమే.
బీజేపీ, ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం కూకట్‌పల్లిలో నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్న నాయకులు, కార్మికులు
ఆటోలకు బ్రేక్...
గ్రేటర్‌లో సుమారు 1.4 లక్షల ఆటోలు ఉన్నాయి. 5 లక్షల మందికి పైగా ఆటోరిక్షాల్లో రాకపోకలు సాగిస్తున్నారు. బంద్ వల్ల వీటికీ బ్రేక్ పడనుంది.ఆటో డ్రైవర్లు బంద్‌లో పెద్ద ఎత్తున పాల్గొనాలని తెలంగాణ ఆటోడ్రైవర్ల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి ఎ.సత్తిరెడ్డి పిలుపునిచ్చారు. దీంతో ప్రత్యేకించి అత్యవసర పనులపై బయటకు వెళ్లాల్సినవారు, ఆసుపత్రులకు వెళ్లే రోగులు, వారి బంధువులు తదితరులకు తిప్పలు తప్పవు. ఇప్పటికే సమ్మె కారణంగా సిటీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రధాన ఆసుపత్రులకు వచ్చే బయటి రోగుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. బంద్ కారణంగా తప్పనిసరిగా ఆసుపత్రులకు వెళ్లాల్సిన రోగులకు అసౌకర్యం కలగనుంది. అలాగే పాలు, కూరగాయలు తదితర నిత్యావసర వస్తువుల రవాణాకు కూడా తీవ్ర అంతరాయం కలగనుంది.
క్యాబ్‌లు బంద్...
నగరంలో 50వేలకు పైగా ఉబర్, ఓలా తదితర క్యాబ్‌లు బంద్‌లో పాల్గొనున్న నేపథ్యంలో మరో 5 లక్షల మందికి పైగా ప్రయాణికులకు రవాణా సదుపాయం స్తంభించనుంది. ముఖ్యంగా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే 5వేలకు పైగా క్యాబ్‌లు కూడా నిలిచిపోనుండడంతో డోమెస్టిక్, ఇంటర్నేషనల్ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడనున్నారు.
వైద్య సేవలు యథాతథం
బంద్ నేపథ్యంలో శనివారం వైద్యసేవలకు ఎలాంటి విఘాతం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. 108 అత్యవసర సర్వీసులతో పాటు ఉస్మానియా, గాంధీ, నిమ్స్, నిలోఫర్ సహా నగరంలోని అన్ని ప్రధాన ఆస్పత్రుల్లో ఓపీ, ఐపీ సేవలు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొంది.
రైళ్లు.. రయ్ రయ్
బంద్ నేపథ్యంలో మెట్రో రైళ్లను ప్రతి 3నిమిషాలకు ఒకటి చొప్పున నడపనున్నట్లు అధికారులు తెలిపారు. నాగోల్–అమీర్‌పేట్–హైటెక్‌సిటీ, ఎల్‌బీనగర్–అమీర్‌పేట్–మియాపూర్ మార్గాల్లో సుమారు 4లక్షల మంది మెట్రో సేవలు వినియోగించుకునే అవకాశముంది. అలాగే ఫలక్‌నుమా–సికింద్రాబాద్–లింగంపల్లి, ఫలక్‌నుమా–నాంపల్లి–లింగంపల్లి మార్గాల్లో 121ఎంఎటీఎస్ సర్వీసులు యథావిధిగానడుస్తాయి. 1.5 లక్షల మంది ఈ సేవలను వినియోగించుకోనున్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్–బొల్లారం మధ్య నడిచే డెమూ రైలునుశనివారం మేడ్చల్ వరకు నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్ ఓప్రకటనలో పేర్కొన్నారు. అలాగే కాచిగూడ–నిజామాబాద్, కాచిగూడ–కర్నూల్ సిటీ మధ్య మరో రెండు జన సాధారణ రైళ్లుఅదనంగా నడవనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment