సాక్షి, సిటీబ్యూరో: ఆర్టీసీ సమ్మె ప్రభావంతో మెట్రో రైళ్లు కిటకిటలాడుతున్నాయి. ఎల్బీనగర్–మియాపూర్, నాగోల్–హైటెక్‌సిటీ మార్గాల్లో ఆదివారం 3.50 లక్షల మంది రాకపోకలు సాగించినట్లు హెచ్‌ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. సాధారణ రోజుల్లో రద్దీ 3 లక్షలుండగా, నిత్యం 50 వేల మంది అధికంగా ప్రయాణం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా ప్రతి 3–5 నిమిషాలకో రైలు నడిపినట్లు చెప్పారు. ప్రయాణికుల రద్దీతో ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, ఎంజీబీఎస్, అమీర్‌పేట్, కూకట్‌పల్లి, మియాపూర్ స్టేషన్లు కిటకిటలాడాయి. ఆయా స్టేషన్ల ఆవరణలో ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశాల్లోనూ స్థలం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.
అమీర్‌పేట్ స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ
ఇక నాగోల్–హైటెక్‌సిటీ రూట్‌లో నాగోలు, ఉప్పల్, తార్నాక, సికింద్రాబాద్, బేగంపేట్, మాదాపూర్, హైటెక్‌సిటీ స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిశాయి. రద్దీ పెరగడంతో హెచ్‌ఎంఆర్ అధికారులు అప్రమత్తమయ్యారు. స్టేషన్లలో అదనపు టికెట్ కౌంటర్లు, సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత మరింత పెంచినట్లు తెలిపారు. సోమవారం సుమారు 4లక్షల మంది ప్రయాణించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామన్నారు. రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మెట్రో రైళ్లు, స్టేషన్ల భద్రతపై కొందరు సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టులతో ప్రయాణికులు ఆందోళన చెందవద్దన్నారు. నగరంలోని మెట్రో రైళ్లు, స్టేషన్లు అత్యంత సురక్షితమైనవని ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు. స్టేషన్లు, రైళ్లలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ‘స్వచ్ఛ నగరం.. విశ్వనగరం’ దిశగా మెట్రో అడుగులు వేస్తున్నామన్నారు.
రైల్..రష్
Published Mon, Oct 21 2019 8:35 AM | Last Updated on Thu, Oct 24 2019 1:23 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment