తెగించి పోరాడకుండా డ్రామాలేంటి? | Seemandhra Union Ministers Cooperate to division, says Vasireddy Padma | Sakshi
Sakshi News home page

తెగించి పోరాడకుండా డ్రామాలేంటి?

Published Fri, Feb 7 2014 1:57 AM | Last Updated on Sat, Sep 2 2017 3:24 AM

తెగించి పోరాడకుండా డ్రామాలేంటి?

తెగించి పోరాడకుండా డ్రామాలేంటి?

* సవరణల పేరుతో విభజనకు అంగీకరిస్తారా?  
* సీమాంధ్ర మంత్రులపై వాసిరెడ్డి పద్మ ధ్వజం
 
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లులో కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) ముందు సవరణలు ప్రతిపాదిస్తూ చివరి నిమిషంలో కూడా రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు విభజనకు సహకరిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విభజన ప్రక్రియను కేంద్రం వేగంగా ముందుకు తీసుకెళుతున్న తరుణంలో తెగించి పోరాడకుండా ఈ డ్రామాలేంటని ఆమె కేంద్ర మంత్రులపై నిప్పులు చెరిగారు.

గురువారం నాడిక్కడ ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘హైదరాబాద్‌ను యూటీ చేయాలని, సీమాంధ్రకు యూనివర్సిటీలు కావాలంటూ సవరణలు కోరుతారా? ఇదేనా మీరు సమైక్యం కోసం చేస్తున్న పోరాటం’’ అని ఆమె మండిపడ్డారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి ఏదో చేస్తామంటూ ఇంతకాలం మాట్లాడి చివరకు విభజనకు సహకరిస్తూ వారంతా చవటలు, దద్దమ్మలుగా మారిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగువారిని చీల్చడానికి వీల్లేదని తమ పదవులను వదులుకోవాల్సిన మంత్రులకు అసలు పౌరుషం ఉందా అని ప్రశ్నించారు.

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఏదేదో చేసేస్తామని చెబుతున్న కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్, టీడీపీ ఎంపీ సుజనాచౌదరి కేంద్రంతో కుమ్మక్కయ్యారని విమర్శించారు. కాంగ్రెస్ అధిష్టానం చెప్పినట్టు ఆడుతున్నందునే లగడపాటికి చెందిన ల్యాంకో ఇన్‌ఫ్రా సంస్థ తీసుకున్న రుణాలు చెల్లించకపోయినా కొత్తగా రూ. 2,300 కోట్ల రుణం మంజూరైందని ఆమె ఆరోపించారు. సుజనాచౌదరి సంస్థలకు కూడా కేంద్రం విరివిగా రుణాలిచ్చిందని ఆమె పేర్కొన్నారు.

చంద్రబాబు డిమాండ్ చేస్తున్నదేమిటి?
‘‘అన్ని పార్టీల నేతల వద్దకూ వెళ్లి లాబీయింగ్ చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు వారిని అడుగుతున్నదేమిటి? అసలు ఆయన డిమాండ్ ఏమిటి?’’ అని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. కొద్ది నెలల క్రితమే తమ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే కచ్చితమైన డిమాండ్‌తో జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలందరినీ కలసి వారి మద్దతు కూడగ ట్టారని, ఇప్పుడు ఎటువంటి డిమాండ్ లేకుండా బాబు చేస్తున్న హడావుడి జగన్ ప్రయత్నాలపై నీళ్లు చల్లే విధంగా ఉందని చెప్పారు.

కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని చివరి వరకూ తలూపిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి సమైక్యం పట్ల చిత్తశుద్ధి ఏమాత్రం లేదని తేలిపోయిందని ఆమె విమర్శించారు. ఆయనకు చిత్తశుద్ధి ఉంటే అందరినీ కలుపుకుని సమైక్యం కోసం పోరాడేవారన్నారు. ఈ తరుణంలో కిరణ్, చంద్రబాబు, ఎంపీలు, కేంద్రమంత్రులంతా సమైక్యం అనాలని ఆమె డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement