సాక్షి, తాడేపల్లి: వైఎస్ కుటుంబంలో చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్‌సీపీ మహిళా నేత వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. చంద్రబాబు ఉచ్చులో, కాంగ్రెస్ పన్నాగంలో షర్మిల చిక్కకున్నారని విమర్శించారు. హంతకుడు అంటూ వైఎస్ అవినాష్‌రెడ్డిపై నిందలు వేస్తున్నారని ధ్వజమెత్తారు. షర్మిలకు కోర్టుల మీద, వ్యవస్థల మీద నమ్మకం లేదా అంటూ ప్రశ్నించారు. వైఎస్ వివేకా హత్యలో జరుగుతున్న రాజకీయాలను కడప ప్రజలు గమనిస్తున్నారన్నారు.
షర్మిల తన బుర్రలో ఏది తోస్తే అది మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు వాసిరెడ్డి పద్మ. చంద్రబాబు తన రాజకీయంలో షర్మిలను పావుగా వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన చట్టంలో ప్రత్యేక హోదాను కాంగ్రెస్ ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. షర్మిల ఎన్ని విషయాల్లో యూటర్న్ తీసుకున్నారో ప్రజలందరికీ తెలుసని అన్నారు. ప్రజలకు ఆమె సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఏపీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి
షర్మిల తీరు చూస్తుంటే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని మండిపడ్డారు. సీఎం జగన్‌ను ఓడించాలని కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు కాంగ్రెస్ పార్టీ దోషిగా మిగిలిందని, ఏపీ ప్రజలకు ఆ పార్టీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యక్తిగత ఎజెండాతో వైఎస్ జగన్‌పై నిందలు వేస్తున్నారన్న వాసిరెడ్డి పద్మ.. తమ ముఖ్యమంత్రిని కాపాడుకోవడానికి ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.
చదవండి: గతంలో చంద్రబాబు కాపులను రౌడీలు అనలేదా?!: పోసాని
షర్మిలవి సానుభూతి రాజకీయాలు
‘కోర్టు పరిధిలో ఉన్న అంశాలను షర్మిల మాట్లాడుతున్నారు. తీర్పు, శిక్ష ఈవిడే వేసేస్తున్నారు. ఇది తీవ్రమైన అంశం. విచారణలో ఉన్న అంశాలపై ఇంత రాజకీయం చేయడం సరికాదు. కడప ప్రజలు అమాయకులు...అజ్ఞానులు కాదు. వైఎస్ కుటుంబాన్ని విడదీయాలని జరుగుతున్న కుట్ర కడప ప్రజలకు కొత్త కాదు. షర్మిల సానుభూతి రాజకీయాలు చేస్తున్నారు. వైఎస్ వివేకానందను ఓడించడానికి చేసిన కుట్రలు మరిచిపోయారా?. ఆ రోజు కుట్రలు చేసిన వారు ఈ రోజు మీ పక్కన ఉండి మాట్లాడుతున్నారు
ఇప్పుడెందుకు యూటర్న్?
ఏం సాధించడానికి మీరు ఈ ఎన్నికల్లో పోటీచేస్తున్నారు .రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించింది కాంగ్రెస్. రాష్ట్రం అన్యాయం అయిపోవడానికి కారణం కాంగ్రెస్ కాదా?. విభజన హామీలు గాలికి వదిలేసింది కాంగ్రెస్ కాదా?. ఏపీకి కాంగ్రెస్ అన్యాయం చేసిందని గతంలో మీరు మాట్లాడలేదా?. ఇప్పుడెందుకు యూటర్న్ తీసుకున్నారు. ప్రజలకు షర్మిల సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది .
చంద్రబాబును మించిన ఊసరవెల్లి
తెలంగాణలో మీరు పార్టీ ఎందుకు పెట్టారు. ఎందుకు మూసేశారు?.ఏపీకి నష్టం జరిగినా తెలంగాణ కోసం ప్రాణాలర్పిస్తామన్నారు. తెలంగాణలో నాయకులను వాడుకుని మోసం చేశారు. ఏపీ ప్రజలకు వ్యతిరేకంగా నిలబడాలని ఆరోజు ఎందుకు అనుకున్నారు?. ఏపీ ప్రజల కోసం ఈరోజు ఎందుకు వస్తున్నారు? చంద్రబాబును మించిన ఊసరవెల్లిలా షర్మిల మారుతున్నారు. చంద్రబాబు కంటే ఎక్కువ యూటర్న్‌లు తీసుకుంటున్నారు. మీ యూటర్న్‌ల వెనుక మీ ఉద్ధేశ్యమేంటి?. ఎన్నికల్లో గెలిస్తే ఏం చేస్తారో కడప ప్రజలకు చెప్పండి. షర్మిల ప్రచారం పూర్తిగా ఎన్నికలకు విరుద్ధం. కచ్చితంగా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తాం’ అని వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment