సమస్యలు త్వరలో సమసిపోతాయి
Published Mon, Jan 6 2014 3:27 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
కామవరపుకోట, న్యూస్‌లైన్ :కాంగ్రెస్ పార్టీ నాయకులపై ప్రజలకు కోపం ఉందని, అయితే త్వరలోనే సర్దుకుంటుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జేడీ శీలం అన్నారు. కామవరపుకోట మండలంలో ఆదివారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమాల్లో కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కామవరపుకోట చౌత్‌నా సెంటర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి శీలం మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో సమస్యలున్నాయని అవన్నీ త్వరలోనే సమసిపోతాయని ఆశిస్తున్నట్టు చెప్పారు. మంత్రి కావూరు సాంబశివరావు సమర్థవంతమైన నాయకుడన్నారు. ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, రైతులు, రైతు కూలీలు అందరూ సుఖ సంతోషాలతో, శాంతి సౌభాగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. కేంద్ర జౌళిశాఖ మంత్రి కావూరు సాంబశివరావు మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలు ఎన్ని పెట్టుబడులు పెట్టినా అభివృద్ధి అంతగా ఉండదని, రైతాంగం అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు.
డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో పదవులు పొందే నాయకులున్న ఈ రోజుల్లో కనీసం 20- 30 శాతం మంచి ప్రజాప్రతినిధులున్నా దేశం బాగుపడుతుందన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి శక్తిమేరకు కృషి చేస్తానని కావూరు సాంబశివరావు పేర్కొన్నారు. వ్యవసాయ శాఖమంత్రి కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 2004 నుంచి ఇప్పటి వరకు రైతులు, రైతు కూలీల సంక్షేమానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఐడీసీ చైర్మన్ ఘంటా మురళీ రామకృష్ణ మాట్లాడుతూ కామవరపుకోటలో మూడు కిలోమీటర్లు సీసీరోడ్ల నిర్మాణానికి రూ.3 కోట్లు, కామవరపుకోట - ద్వారకాతిరుమల మెయిన్ రోడ్డు నిర్మాణానికి రూ.7 కోట్లు మంజూరు చేయాల్సిందిగా రోడ్లు భవనాల శాఖ మంత్రి పితాని సత్యనారాయణను కోరగా అందుకు ఆయన అంగీకరించారని తెలిపారు. అంతకుముందు తడికలపూడిలో రూ.22 లక్షలతో నిర్మించే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అదనపు భవనం,
ఆడమిల్లిలో రూ.7 కోట్ల ఎస్సీ, ఎస్టీ గ్రాంట్‌తో నిర్మించే రెసిడెన్షియల్ పాఠశాల భవనానికి, ఆదర్శ డిగ్రీ కళాశాలకు, కామవరపుకోటలో రూ.50 లక్షలతో నిర్మించే మార్కెట్‌యార్డు గోడౌన్‌కు, రావికంపాడులో రూ.24 లక్షలతో నిర్మించే పాఠశాల అదనపు తరగతి గదుల భవనాలకు మంత్రులు శంకుస్థాపన చేశారు. రూ.6.30 కోట్లతో కామవరపుకోటలో ఏర్పాటు చేసే సీపీడబ్ల్యూ పథకానికి శంకుస్థాపన చేశారు. నరసాపురం ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు, డీసీసీబీ చైర్మన్ ముత్యాల వెంకటరత్నం నాయుడు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బీవీ నాగచంద్రారెడ్డి, ఏఎంసీ చైర్మన్ తూతా లక్ష్మణరావు. కలెక్టర్ సిద్ధార్థ జైన్, సీఈవో నాగార్జున సాగర్, వ్యవసాయ శాఖ జేడీ వీడీవీ కృపాదాస్, ఏలూరు ఆర్డీవో శ్రీనివాసరావు, ఆర్‌డబ్లూఎస్ ఈఈ జి.జయచంద్రరావు, పీఆర్ డీఈ డి.సత్యనారాయణ , తహసిల్దార్ జె.మదనగోపాలరావు, ఎంపీడీవో కె.శిల్ప తదితరులు పాల్గొన్నారు.
ప్రొటోకాల్ పాటించలేదు:
తడికలపూడి సర్పంచ్ ఆరోపణ
తమ పంచాయతీ పరిధిలో పాఠశాల అదనపు తరగతుల నిర్మాణానికి ఆదివారం మంత్రులు శంకుస్థాపన చేశారని, అయితే సర్పంచ్ అయిన తనకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని తడికలపూడి సర్పంచ్ కడిమి దివ్యభారతి ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన సర్పంచ్ అవడం వల్ల తనకు సమాచారం ఇవ్వకుండా అవమానపర్చారని ఆమె పేర్కొన్నారు. ఫ్రొటోకాల్ పాటించని వారిపై చర్య తీసుకోవాలని ఆమె కోరారు.
Advertisement
Advertisement