కాకినాడ, న్యూస్‌లైన్ :
రాష్ట్ర విభజనతో సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి.. ‘మామిడి పండు తిన్న నోటితోనే మేడిపండును చవి చూడాల్సి వచ్చినట్టు’ అయింది. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచేందుకు పీసీసీ కొత్త సారథి రఘువీరారెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర ప్రచార బాధ్యతలు చేపట్టిన కేంద్రమంత్రి చిరంజీవి తలపెట్టిన బస్సుయాత్ర శనివారం తూర్పుగోదావరి జిల్లాలో పేలవంగా సాగింది.
తునిలో ప్రారంభమై అన్నవరం, కత్తిపూడి, గొల్లప్రోలు, పిఠాపురంల మీదుగా జిల్లా కేంద్రం కాకినాడకు చేరుకున్న యాత్రకు ఆశించిన స్పందన కానరాక పోగా పిఠాపురంలో చిరంజీవికి చేదు అనుభవం ఎదురైంది. తునిలో పార్టీ శ్రేణులు స్వాగత సన్నాహాలు చేసినా అక్కడి నుంచి జరిగిన పర్యటనలో ప్రజా స్పందన అంతంత మాత్రంగానే కనిపించింది. ముఖ్యంగా పిఠాపురం వద్ద కె.బాబ్జి అనే ఓ కార్యకర్త ‘ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో కలిపేసి నట్టేట ముంచేశావు’ అంటూ బస్సుయాత్ర వద్ద ఒకప్పటి పీఆర్‌పీ కరపత్రాలను నేలకేసి కొట్టి నిరసన తెలియజేశాడు.
చిరు అభిమానుల సందడే..
కాకినాడ సూర్యకళామందిరంలో జరిగిన డీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో చిరంజీవి అభిమానులు ఆయనకు అనుకూలంగా నినాదాలు చేస్తూ కేరింతలు కొట్టారే తప్ప నిజమైన పారీశ్రేణులు లేక సభ వెలవెలపోయింది. రఘువీరా, చిరంజీవిలతో పాటు కేంద్రమంత్రులు పళ్లంరాజు, జేడీ శీలం, పనబాక లక్ష్మి, కిల్లి కృపారాణి, ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు, పంతం గాంధీమోహన్, వంగా గీత మాత్రమే హాజరయ్యారు. రఘువీరా తొలిసారిగా హాజరైన డీసీసీ సమావేశానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాపాక వరప్రసాద్, పొన్నాడ సతీష్, ఎన్.శేషారెడ్డి, రాజా అశోక్‌బాబు, పాముల రాజేశ్వరీదేవి రాలేదు. రంపచోడవరం ఎమ్మెల్యే కోసూరి కాశీ విశ్వనాథ్ మాత్రం హాజరయ్యారు.
విభజనకు కారణమైన పార్టీలు కాంగ్రెస్‌ను నిందిస్తున్న తీరుపై ప్రతి కార్యకర్తా మరో ముగ్గురికి, ఆ ముగ్గురు మరో ముగ్గురికి.. అలా ప్రచారం చేయాలంటూ చిరంజీవి తాను నటించిన ఁస్టాలిన్* సినిమాలోని చైన్‌లింక్ విధానాన్ని ఊదరగొట్టారు. కిరణ్ సమైక్య చాంపియన్ కావాలని చేసిన రాజకీయంలో ఆయన హీరోగా, తాము జీరోలుగా ప్రజల్లో చులకన కావాల్సి వచ్చిందన్నారు. రాష్ట్ర విభజన జరిగాక కూడా చివరి బంతి మిగిలే ఉందంటున్న కిరణ్‌కుమార్‌రెడ్డి మానసిక పరిస్థితిపై సందేహం కలుగుతోందన్నారు. కిరణ్ నిర్వాకమే ప్రస్తుత పరిస్థితులకు కారణమని ధ్వజమెత్తారు.
చంద్రబాబుది అధికార దాహం..
ఒక ఓటు, రెండు రాష్ట్రాల నినాదంతో 18 ఏళ్ల క్రితం కాకినాడ సమావేశంలో రాష్ట్ర విభజనకు బీజం వేసిన మతతత్వ బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో టీడీపీ అధినేత చంద్రబాబు అధికార దాహం తేటతెల్లమవుతోందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడు రఘువీరారెడ్డి, రాష్ట్ర ప్రచార కమిటీ సారథి, కేంద్రమంత్రి చిరంజీవి ధ్వజమెత్తారు. శనివారం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మేటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన స్థానిక సూర్యకళామందిరంలో డీసీసీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. నాయకులు మాట్లాడుతూ అనేక పార్టీలు విభజనను కోరుకున్నాక కాంగ్రెస్ చివరిపార్టీగా నిర్ణయం తీసుకుందన్నారు.
పార్టీ శ్రేణులు స్తబ్దతను వీడి వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించడం ద్వారా కాంగ్రెస్‌కు పూర్వ వైభవం వచ్చేలా కృషి చేయాలని కోరారు. కేంద్రమంత్రి జేడీ శీలం మాట్లాడుతూ ప్రజారంజక పాలన కాంగ్రెస్‌కే సాధ్యమన్నారు. కేంద్రమంత్రి కృపారాణి మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమాలకు కృషి చేసింది కాంగ్రెసేనన్నారు. కేంద్రమంత్రి పనబాక లక్ష్మి మాట్లాడుతూ టీడీపీ, బీజేపీలకు బుద్ధి చెప్పాలన్నారు. కేంద్రమంత్రి ఎంఎం పళ్లంరాజు మాట్లాడుతూ కాంగ్రెస్‌ను మళ్లీ గెలిపించాలని కోరారు.
ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు, వంగా గీత, పంతం గాంధీమోహన్, ఎమ్మెల్సీలు రత్నాబాయి, లక్ష్మీశివకుమారి, మండలిలో విప్ రుద్రరాజు పద్మరాజు, మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు, మాజీ మంత్రి కొండ్రు మురళి, నాయకులు బుచ్చి మహేశ్వరరావు, కొప్పన మోహనరావు, పి.వి.రాఘవులు, పంతం నానాజీ, మాజీ కార్పొరేటర్ బసవా చంద్రమౌళి, జిల్లా ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడు ఫణీశ్వరరావు పాల్గొన్నారు.
‘తుస్సు’మన్న బస్సుయాత్ర
Published Sun, Mar 23 2014 1:28 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement