చిరంజీవి గైర్హాజరుపై కాంగ్రెస్ క్లారిటీ
విజయవాడ: ఏపీసీసీ సమన్వయ కమిటీ సమావేశానికి రాజ్యసభ సభ్యుడు చిరంజీవి గైర్హాజరుపై కాంగ్రెస్ నేతలు క్లారిటీ ఇచ్చారు. కొన్ని వ్యక్తిగత కారణాలవల్ల చిరంజీవి పార్టీ కార్యక్రమాలకు హాజరుకావడం లేదని, ఆయన ఎప్పటికీ కాంగ్రెస్ తోనే ఉంటారని తెలిపారు. కాగా శనివారం విజయవాడలోని ఆంధ్రరత‍్న భవన్‌లో ఏపీసీసీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఎం.పీ దిగ్విజయ్ సింగ్, కుంతియా, కొప్పుల రాజు, కె.వి.పి., రామచంద్రయ్య, మాజీ కేంద్ర మంత్రులు కిల్లి కృపారాణి, పల్లం రాజు తదితరులు పాల్గొన్నారు.
అంతకు ముందు కేంద్ర మాజీమంత్రి పల్లంరాజు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పటిష్టత, ప్రజాసమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించామన్నారు. పార్టీ ఫిరాయింపులకి కాంగ్రెస్ వ్యతిరేకమని, ఇప్పటికే ఈ విషయమై రాష్ట్రపతికి ఉత్తరం రాశామన్నారు.
అలాగే మాజీ ఎంపీ జేడీ శీలం మాట్లాడుతూ ఫిరాయించిన ఎవరైనా రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని తెలిపారు. ఫిరాయింపులపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ను తప్పుబట్టిన చంద్రబాబు నాయుడు నేడు అదే విధానాన్ని అవలంభించడం దారుణమని విమర్శించారు. తమ పార్టీ నుంచి వెళ్లినవారికి కూడా పదవులు ఇచ్చారన్నారు. ఫిరాయింపుకు పాల్పడివారు ఎవరైనా రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు.