
నేను సమైక్యవాదిని కాదు: జేడీ శీలం
బెంగళూరు, న్యూస్‌లైన్: తాను సమైక్యవాదిని కాదని.. సమస్యలవాదిని మాత్రమేనని కేంద్ర మంత్రి జేడీ శీలం అన్నారు. ఆదివారమిక్కడ నిర్వహించిన ప్రభుత్వరంగ తెలుగు ఉద్యోగుల సమన్వయ సమితి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ వస్తుందో రాదో అనేది ఇప్పటికీ యూపీఏలో స్పష్టమైన అవగాహన లేదని చెప్పారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన తరువాత పాస్ అవుతుందో లేదో తెలియదన్నారు. నిత్యం కొట్లాడుకొనే కంటే విడిపోవడం చాలా ఉత్తమమన్నారు. సీఎం కిరణ్ రాజీనామా ఎప్పుడు? కొత్త పార్టీ పెడతారా? అన్న ప్రశ్నలకు.. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు పూర్తి కావాలి కదా.. అంతవరకు వేచిఉండాలని ఆయన బదులిచ్చారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ఎప్పటికీ కాంగ్రెస్‌లోనే ఉంటారని, ఆయన కాంగ్రెస్‌వాది అని శీలం అన్నారు.