
బెంగళూరు: మైసూర్ అర్బన్ డెవెలప్‌మెంట్ అథారిటీ (MUDA) కుంభకోణం కేసు కర్ణాటకలో రాజకీయంగా సంచలనం సృష్టించింది. అయితే.. తాజాగా ముఖ్యమంత్రి సిద్దరామయ్యను లోకాయుక్త పోలీసులు విచారణకు పిలిచారు.అందులో భాగంగా ఆయనకు లోకాయుక్త పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇక..బుధవారం (నవంబర్ 6) ఉదయం సీఎం సిద్ధరామయ్య తమ ముందు హాజరు కావాల్సిందిగా నోటీసుల్లో కోరినట్లు లోకాయుక్త సీనియర్ అధికారి తెలిపారు. మరోవైపు.. ఈ విషయంపై సీఎం సిద్ధరామయ్య స్పందించారు.
‘‘ముడాకు సంబంధించి మైసూర్ లోకాయుక్త పోలీసులు నోటీసు జారీ చేశారు. నవంబర్ 6న మైసూర్ లోకాయుక్తకు వెళ్లుతా’ అని అన్నారు. ఇక.. ఇదే కేసులో ఇటీవల సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతి లోకాయుక్త ప్రశ్నించిన విషయం తెలిసిందే.సిద్ధరామయ్య భార్య పార్వతి సోదరులు మల్లికార్జున స్వామి, దేవరాజు స్వామి కొంత భూమి కొనుగోలు చేసి ఆమెకు బహుమతిగా ఇచ్చారు. ఈ భూమి వివాదంలో ఉండటంతో మైసూరులోని లోకాయుక్త పోలీసులు సెప్టెంబర్ 27న ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
Haveri: Karnataka CM Siddaramaiah says, "Yes, Mysore Lokayukta has issued a notice regarding MUDA. I will go to Mysore Lokayukta on 6th November." pic.twitter.com/cWNydSusOR
— ANI (@ANI) November 4, 2024
ఏమిటీ ముడా భూవివాదం?
సిటీ ఇంప్రూవ్‌మెంట్ ట్రస్ట్ బోర్డ్‌గా 1904లో ఏర్పాటై తదనంతరకాలంలో మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(ముడా)గా అవతరించిన సంస్థ ఇప్పుడు భూకేటాయింపుల వివాదంలో కేంద్రబిందువుగా నిలిచింది. కెసెరె గ్రామంలో సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతికి 3 ఎకరాల 16 గుంటల భూమి ఉంది.
ఈ గ్రామంలో దేవనార్ 3ఫేజ్ లేఅవుట్ కోసం ముడా ఈ భూమిని సేకరించింది. నష్టపరిహారంగా 2021లో మైసూర్‌లోని విజయనగర మూడో, నాలుగో ఫేజ్ లేఅవుట్లలో 38,284 చదరపు అడుగుల విస్తీర్ణంలో 14 ప్లాట్లను కేటాయించింది. అయితే పార్వతి నుంచి తీసుకున్న భూముల కంటే కేటాయించిన ప్లాట్ల విలువ రూ.45 కోట్లు ఎక్కువ అని ఆర్టీఐ కార్యకర్త అబ్రహాం లోకాయుక్త పోలీసులకు ఫిర్యాదుచేయడంతో కేటాయింపుల అంశం వార్తల్లోకెక్కింది.
కెసెరె భూమిని పార్వతికి ఆమె సోదరుడు మల్లిఖార్జున స్వామి 2010 అక్టోబర్‌లో బహుమతిగా ఇచ్చాడు. ప్రభుత్వం సేకరించాక 2014 జూన్‌లో నష్టపరిహారం కోసం పార్వతి దరఖాస్తు చేసుకున్నారు. ప్లాట్ల కేటాయింపుపై సిద్ధూ గతంలోనే స్పష్టతనిచ్చారు.
‘‘2014లో నేను సీఎంగా ఉన్నపుడు పరిహారం కోసం దరఖాస్తు చేసుకుంటే సీఎంగా ఉన్నంతకాలం ఆ పరిహారం ఇవ్వడం కష్టమని అధికారులు చెప్పారు. బీజేపీ అధికారంలో ఉన్నపుడు 2021లో మళ్లీ దరఖాస్తు చేసుకుంటే ఈ ప్లాట్లను కేటాయించారు’’ అని సిద్దూ అన్నారు.
అయితే గతంలో ముడా 50: 50 పేరిట ఒక పథకాన్ని అమలుచేసింది. నిరుపయోగ భూమి తీసుకుంటే వేరే చోట ‘అభివృద్ధి చేసిన’ స్థలాన్ని కేటాయిస్తారు. ప్రతీ కేటాయింపు ముడా బోర్డు దృష్టికి తేవాలి. అయితే కొందరు ముడా అధికారులతో చేతులు కలిపి, బోర్డు దృష్టికి రాకుండా, పథకంలోని లోపాలను వాడుకుని సిద్ధరామయ్య కుటుంబం ఎక్కువ ప్లాట్లను రాయించుకుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. లోపాలున్న పథకాన్ని 2023 అక్టోబర్‌లో రద్దుచేశారు.
అయితే తన భూమికి ఎక్కువ విలువ ఉంటుందని రూ.62 కోట్ల నష్టపరిహారం కావాలని సిద్ధరామయ్య ఈఏడాది జూలై నాలుగున డిమాండ్ చేయడం విశేషం. అయితే అసలు ఈ భూమి పార్వతి సోదరుడు మల్లికార్జున స్వామిది కాదని, అక్రమంగా ఫోర్జరీ పత్రాలు సృష్టించి 2004లో తన పేరిట రాయించుకున్నాడని ఆరోపణలున్నాయి.