బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించే 'శక్తి' పథకాన్ని పునఃసమీక్షించే ఆలోచన ప్రస్తుతానికి లేదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. అయితే.. ఈ పథకంపై చర్చ జరగవచ్చని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇటీవల వ్యాఖ్యలుచేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలోనే గురువారం స్వయంగా సీఎం సిద్ధరామయ్య స్పష్టత ఇచ్చారు.
‘‘ప్రభుత్వం ముందు అలాంటి ప్రతిపాదన లేదు. డీప్యూటీ సీఎం డీ.కే.శివకుమార్ కొంతమంది మహిళలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను మాత్రమే వెల్లడించారు. ఆయన వ్యాఖ్యలు చేసిన సమయంలో నేను లేను’అని అన్నారు.
ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో.. ఉచిత బస్సు ప్రయాణాన్ని పొందుతున్న మహిళలు తమ ప్రయాణానికి డబ్బు చెల్లించడానికి సుముఖత వ్యక్తం చేస్తూ తనను సంప్రదించారని శివకుమార్ పేర్కొన్నారు. ‘‘ చూద్దాం, మేం దీనిపై కూర్చుని చర్చిస్తాం. మరికొంతమంది మహిళలు.. కొంత చార్జీని చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు. రవాణా మంత్రి రామలింగారెడ్డి, నేను ఈ అంశంపై పరిశీలన చేస్తాం’అని అన్నారు.
కొందరు మహిళలు టికెట్ డబ్బులు చెల్లిస్తామని ట్వీట్లు, మెయిళ్లు పెడుతున్నారని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఉచిత బస్సు పథకాన్ని రద్దు చేస్తారంటూ ఊహాగానాలు వచ్చాయి. ఇక.. ఐదు గ్యారంటీల్లో భాగంగా గతేడాది నుంచి కర్ణాటకలో ‘శక్తి’ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment