హామీలు తక్షణం నెరవేర్చండి: జేడీశీలం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని మన్మోహన్, హోంమంత్రి షిండే చేసిన ప్రకటనల్లోని అంశాలతోపాటు, బిల్లులోని సీమాంధ్రకు న్యాయం చేసే అంశాలన్నింటినీ తక్షణం కార్యరూపంలోకి తేవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్టు కేంద్ర మంత్రి జేడీ శీలం తెలిపారు. దిగ్విజయ్‌సింగ్‌తో భేటీ అనంతరం సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మొత్తం 13 శాఖల పరిధిలోని 39 అంశాలను తక్షణం కార్యరూపంలో పెట్టేందుకు కేంద్రం కార్యాచరణ రూపొందించాలని, ఈమేరకు కేంద్రం, అధిష్టాన పెద్దలకు వివరించామని తెలిపారు. పోలవరం ముంపు మండలాలను కూడా సీమాంధ్రలో కలిపేందుకు త్వరితగతిన ఆర్డినెన్స్ తేవాలని కోరినట్టు చెప్పారు. ఈ మండలాలు వస్తే దిగువ సీలేరు ప్రాజెక్టు కూడా సీమాంధ్ర పరిధిలోకి వస్తుందని, గోదావరి డెల్టా ప్రాంతానికి రబీకి కూడా నీరు లభిస్తుందని తెలిపారు.