లోక్సభ రేపటికి వాయిదా పడింది. జమ్ము కాశ్మీర్లోని పూంచ్ సెక్టార్ వద్ద ఐదుగురు భారత సైనికులను పాకిస్థానీ సైన్యం హతమార్చిన ఘటనపై ప్రభుత్వం చేష్టలుడిగి కూర్చుందంటూ ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇస్తున్న సమాజ్వాదీ పార్టీ సహా విపక్షాలన్నీ ఒంటికాలిపై లేవడం, సభ కార్యకలాపాలు సజావుగా సాగకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో స్పీకర్ మీరాకుమార్ సభను రేపటికి వాయిదా వేశారు. అంతకుముందు వర్షాకాల సమావేశాలు వరుసగా రెండోరోజు కూడా సమైక్యాంధ్ర నినాదాలతో దద్దరిల్లాయి. లోక్సభను ఎలాగోలా నడిపించేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో స్పీకర్ మీరా కుమార్ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. మంగళవారం సభ ప్రారంభం కాగానే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలు జై సమైక్యాంధ్ర నినాదాలు మొదలుపెట్టారు. సమైక్యాంధ్ర వర్థిల్లాలి అంటూ నినదించారు. రాష్ట్రాన్ని విభజించేందుకు ససేమిరా వీల్లేదంటూ గట్టిగా పట్టుబట్టారు. తెలంగాణ ఎంపీలు కూడా తమ స్థానాల్లోంచి లేచి నిల్చున్నారు. లోక్సభలో స్పీకర్ మీరాకుమార్ పదే పదే వారించినా, వెల్ లోంచి సభ్యులు వెళ్లలేదు.
తిరిగి 12 గంటల ప్రాంతంలో ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. అప్పటికీ నినాదాలు ఆగలేదు. రాజ్యసభలో 'మాకు న్యాయం చేయాలి, ఆంధ్రప్రదేశ్ను కాపాడండి' అంటూ నినాదాలు చేస్తూనే ఉన్నారు. పార్లమెంటు ఉభయ సభలలోనూ సీమాంధ్ర ఎంపీలు వెల్ లోకి దూసుకెళ్లి సమైక్యాంధ్ర నినాదాలు కొనసాగించారు. ఇదే సమయంలో పాకిస్థాన్ దుశ్చర్యపై రాజ్యసభలో బీజేపీ సభ్యులు వెంకయ్య నాయుడు, రవిశంకర్ ప్రసాద్ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వం ఈ అంశంపై ఓ ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు. మధ్యాహ్నం 3.30 గంటలకు దీనిపై చర్చిద్దామని అధ్యక్ష స్థానంలో ఉన్న పీజే కురియన్ సూచించినా వెంకయ్యనాయుడు తన వాదనను కొనసాగించారు.
రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ రాజ్యసభలో టీడీపీ సభ్యులు గట్టిగా పట్టుబట్టారు. ఎంపీలు సీఎం రమేశ్, సుజనా చౌదరి ప్లకార్డులు పట్టుకుని వెల్ లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. కేంద్ర మంత్రి జేడీ శీలం, తెలంగాణ ప్రాంతానికి చెందిన సీనియర్ నాయకుడు పాల్వాయి గోవర్ధనరెడ్డి మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. సీమాంధ్రులంతా తెలంగాణ నుంచి వెళ్లిపోవాలని పాల్వాయి వ్యాఖ్యానించడంతో సీమాంధ్ర సభ్యులు తీవ్రంగా స్పందించారు. ఆయన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని కేంద్రమంత్రి జేడీ శీలం స్పందించారు. ఆయనకు రేణుకా చౌదరి కూడా మద్దతు పలికారు. అధికార పక్షానికి చెందిన పలువురు సభ్యులు వారిద్దరికీ సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. గొడవ పడొద్దని సీనియర్ సభ్యురాలు అంబికా సోనీ కూడా జేడీ శీలానికి సూచించారు. ఇంతలో టీడీపీ సభ్యులు రాష్ట్రాన్ని రక్షించాలంటూ నినాదాలు చేయడంతో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ వారిని హెచ్చరించారు. సభా కార్యకాలపాలకు అడ్డు తగలడం మానకపోతే చర్య తీసుకుంటామన్నారు. దీని గురించి చర్చ వచ్చినప్పుడు ముందుగా మాట్లాడే అవకాశం వారికే ఇస్తానని చెప్పారు. ఇలాగే గొడవ చేస్తే సస్పెండ్ చేయాల్సి ఉంటుందని, అలా చేసేలా తనను బలవంత పెట్టొద్దని చెప్పారు. అయినా ఎంపీలు మాత్రం తమ పట్టు వీడలేదు. నినాదాలు కొనసాగించారు. ఈ పరిస్థితి అంతటికీ ప్రభుత్వమే కారణమని రాజ్యసభలో విపక్షనేత అరుణ్ జైట్లీ ఆరోపించారు. రాష్ట్రంలో అంతర్యుద్ధం లాంటి పరిస్థితి నెలకొందని ఆయన తెలిపారు. ఏకాభిప్రాయం లేకుండా నిర్ణయం తీసుకోవడం వల్లే ఇలా జరిగిందన్నారు. దీనిపై చివరకు అధికార పార్టీయే ఒక్క మాటమీద లేదని, మంత్రికి - ఎంపీ పాల్వాయికి మధ్య జరిగిన వివాదమే ఇందుకు సాక్ష్యమని ఆయన అన్నారు.
రాజ్యసభలో శీలం - పాల్వాయి వాగ్వాదం; లోక్సభ రేపటికి వాయిదా
Published Tue, Aug 6 2013 3:44 PM | Last Updated on Fri, Mar 22 2019 6:13 PM
Advertisement