సాక్షి, హైదరాబాద్: అంతర్‌రాష్ట్ర నదీ జలాల వివాదాలను త్వరితగతిన పరిష్కరించడం, అవి వెలువరించిన తీర్పులను పక్కాగా అమలు చేసే దిశగా కేంద్రం తెస్తున్న ‘వన్ నేషన్–వన్ ట్రిబ్యునల్’పై ఇంకా అనిశ్చితి వీడటం లేదు. అంతర్‌రాష్ట్ర నదీజల వివాదాలను విచారించడానికి ప్రస్తుతమున్న వివిధ ట్రిబ్యునళ్లను రద్దు చేసి, ఒకే శాశ్వత ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసే బిల్లు ఇప్పటికే లోక్‌సభలో ఆమోదం పొందినా రాజ్యసభలో ఎప్పటిలోగా ఆమోదం దక్కుతుందనే సందిగ్ధత వీడటం లేదు. ప్రస్తుతం మొదలుకానున్న బడ్జెట్ సమావేశాల్లో అయినా దీనికి ఆమోదం దక్కుతుందా? అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
మూడేళ్లలో తీర్పులు..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కృష్ణా, కావేరి, వంశధార, మహదాయి, రావి నదీ వివాదాలు సహా మొత్తంగా 8 ట్రిబ్యునళ్లు పనిచేస్తున్నాయి. అంతర్‌రాష్ట్ర జల వివాదాల చట్టం–1956 ప్రకారం ఏదైనా రాష్ట్రం వివాదాలపై చేసిన వినతిపై సంతృప్తి చెందినప్పుడు కేంద్ర ప్రభుత్వం ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేస్తూ వస్తోంది. అలాగే ఏర్పాటు చేసిన కృష్ణా ట్రిబ్యునల్ విచారణలు పదేళ్లుగా సాగుతూనే ఉన్నాయి. అయినా వివాదాలకు పరిష్కారం దొరకడం లేదు. దీన్ని దృష్ట్యా రాష్ట్రాల ఫిర్యాదులను వేగంగా పరిష్కరించే దిశగా ఒకే ట్రిబ్యునల్ అంశాన్ని తెరపైకి తెచ్చింది.
ఇందుకోసం ప్రస్తుతం ఉన్న చట్టాలను సవరించనుంది. ప్రతిపాదిత శాశ్వత ట్రిబ్యునల్‌కు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి చైర్‌పర్సన్‌గా ఉండనున్నారు. ఈ ట్రిబ్యునల్ రెండేళ్లలో తన తీర్పును వెలువరించాల్సి ఉంటుంది. ఈ బిల్లును 2017లోనే లోక్‌సభ ముందుకు తెచ్చినా, 2019 ఆగస్టులో సభ ఆమోదం పొందింది. ప్రస్తుతం కృష్ణా జలాల వివాదాన్ని చూస్తున్న బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌లో తెలంగాణకు న్యాయం జరిగే అవకాశం లేకపోవడంతో శాశ్వత ట్రిబ్యునల్ ఏర్పాటును తెలంగాణ గట్టిగా సమ్మతించింది. రాజ్యసభలో మాత్రం ఈ బిల్లు ఇంకా ఆమోదం పొందలేదు. దీంతో వన్ ట్రిబ్యునల్ ఇంకా అమల్లోకి రాలేదు. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో అయినా దీనికి ఆమోదం దక్కుతుందా? అని వేచి చూడాలి.
ఆర్నెల్లుగా జరగని బ్రిజేశ్ ట్రిబ్యునల్ విచారణ..
ప్రస్తుతం కృష్ణానదీ జలాలను విచారిస్తున్న జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ విచారణ ఆర్నెల్లుగా పూర్తిగా నిలిచిపోయింది. ఇప్పటికే కృష్ణా వివాదాలపై పదేళ్లుగా విచారిస్తున్నా ఇంతవరకూ తుది తీర్పును ఇవ్వని ట్రిబ్యునల్.. ఆర్నెల్లుగా అయితే ఒక్క భేటీ నిర్వహించలేదు. ట్రిబ్యునల్‌లోని ఒక సభ్యుడు రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని కేంద్రం ఇంతవరకు భర్తీ చేయకపోవడంతో విచారణ వాయిదా పడుతూ వస్తోంది. ఫిబ్రవరి 23న మళ్లీ భేటీ నిర్వహించాల్సి ఉన్నా అది జరిగేది అనుమానంగానే ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం తెస్తున్న వన్ ట్రిబ్యునల్ బిల్లుతోనే వివాదాలకు పరిష్కారం దొరుకుతుందనే అభిప్రాయంతో తెలంగాణ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment