దేశవ్యాప్తంగా 50 లోక్‌సభ స్థానాల్లో జాతీయ సగటు కంటే తక్కువ పోలింగ్
హైదరాబాద్‌లో అత్యల్పంగా 44.84 శాతం ఓటింగ్
అందులో మన రాష్ట్రంలోని నాలుగు నియోజకవర్గాలు
ఆ నాలుగూ గ్రేటర్ హైదరాబాద్‌లోని లోక్‌సభ స్థానాలే..
సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, చేవెళ్లలోనూ తక్కువగానే నమోదు..
పోలింగ్ కేంద్రాలను పెంచకపోవడమూ తక్కువ పోలింగ్‌కు కారణమే
అవగాహన కార్యక్రమాలకే పరిమితమవుతున్న ఈసీ
సాక్షి, హైదరాబాద్: ఎన్నిక ఏదైనా సరే.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పోలింగ్ అతి తక్కువగా నమోదవుతూ వస్తోంది. నిర్లక్ష్యం, ఉదాసీనత కారణాలేమైనా ఇక్కడి ఓటర్లు బద్ధ్దకస్తులేనన్న అభిప్రాయం నెలకొంది. ఎన్నికల సంఘం ఓటరు అవగాహన కార్యక్రమాలు ఎన్ని చేపట్టినా ఫలితం ఉండటం లేదు. 2019 సార్వత్రిక ఎన్నికలలో దేశంలో తక్కువ ఓటింగ్ శాతం నమో దైన 50 లోక్‌సభ నియోజకవర్గాల్లో నాలుగు తెలంగాణలోనే ఉన్నాయి. ఈ నాలుగు హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, చేవెళ్ల సెగ్మెంట్లు గ్రేటర్ హైదరాబాద్‌లోనివే కావడం గమనార్హం.
విస్తీర్ణంలో హైదరాబాద్.. ఓటర్లలో మల్కాజ్‌గిరి..
► 2019 సార్వత్రిక ఎన్నికల్లో జాతీయ సగటు అయిన 67.4 శాతం కంటే తక్కువ పోలింగ్ జరిగిన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ (62.7 శాతంతో) ఏడో స్థానంలో నిలిచింది. విస్తీర్ణంలో హైదరాబాద్.. ఓటర్లలో మల్కాజ్‌గిరి.. దేశవ్యాప్తంగా అత్యల్ప ఓటింగ్ జరిగిన నియోజకవర్గాల్లో హైదరాబాద్ 4వ స్థానంలో నిలిచింది. సికింద్రాబాద్ 7వ, మల్కాజ్‌గిరి
12వ, చేవెళ్ల 25వ స్థానాల్లో నిలిచాయి.
1951–52లో దేశంలో జరిగిన తొలి లోక్‌సభ ఎన్నికల్లో 17.3 కోట్ల మంది ఓటర్లు నమోదుకాగా.. అందులో 17 శాతం ఓటర్లు మాత్రమే పట్టణాల్లో ఉండేవారు. తర్వాత పట్టణాల్లో జనాభా పెరిగిపోయింది. ప్రస్తుతం హైదరాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలో 21.97 లక్షలు, సికింద్రాబాద్‌లో 20.98 లక్షలు, మల్కాజ్‌గిరిలో 37.38 లక్షలు, చేవెళ్లలో 29.06 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. విస్తీర్ణంపరంగా 78.12 చదరపు కిలోమీటర్లతో రాష్ట్రంలోనే అతిచిన్న నియోజకవర్గం హైదరాబాద్ కాగా.. ఎక్కువ మంది ఓటర్లున్న సెగ్మెంట్ మల్కాజ్‌గిరి. ఇక్కడి ఓటర్ల సంఖ్య 37,36,216.
తక్కువ పోలింగ్‌కు కారణాలివే..
► పట్టణ ఓటర్ల సంఖ్య వేగంగా పెరుగుతున్నా.. ఆ స్థాయిలో పోలింగ్ కేంద్రాలను పెంచడం లేదు.
► ఉద్యోగం, చదువు, ఇతర కారణాలతో చాలా మంది ఓటర్లు వేరే నగరం, ఇతర దేశాలలో ఉంటున్నారు.
► పోలింగ్ రోజు సెలవురోజు అయినా రోజువారీ వేతన జీవులు పనికే అధిక ప్రాధాన్యత ఇవ్వడం.
► పోలింగ్ కేంద్రాలలో క్యూలైన్లలో గంటల కొద్దీ నిల్చునే ఓపిక ఓటర్లకు లేకపోవడం.
► రైల్వే క్రాసింగ్‌లు, హైవేలను దాటి పోలింగ్ స్టేషన్లకు వెళ్లాల్సి రావడంతో ఇబ్బంది.
► కొందరు ఓటర్లకు 2 చోట్లా ఓటు ఉండటం వంటివి పోలింగ్ శాతం తగ్గడానికి కారణమవుతున్నాయి.
పోలింగ్ పెంచేందుకు చేపట్టాల్సిన చర్యలివీ..
► అర్బన్ ప్రాంతాల్లో పోలింగ్ స్టేషన్ల సంఖ్యను పెంచాలి.
► హైరైజ్ భవనాలు, గేటెడ్ కమ్యూనిటీలలోనే పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి.
► ఓటు వేసిన వారికి మాత్రమే వేతనంతో కూడిన సెలవు, అలవెన్స్‌లు ఇచ్చేలా యాజమాన్యాలను ఆదేశించాలి.
► పోలింగ్ బూత్‌కు వెళ్లే రూట్ మ్యాప్‌ను ఓటర్లకు వాట్సాప్ ద్వారా పంపించాలి.
► క్యూ లైన్, పోలింగ్ సరళిపై ఓటర్లకు సమాచారమివ్వాలి.
► డబుల్ ఓట్లను గుర్తించి తొలగించాలి.
► యువ ఓటర్లను ఆకర్షించేందుకు మారథాన్లు, వాకథాన్స్, సైకిల్ థాన్స్ వంటివి నిర్వహించాలి.
► ప్రజా రవాణా, పారిశుధ్య వాహనాలపై ఎన్నికల ప్రచారం చేపట్టాలి.
► సామాజిక మాధ్యమాలలో ఓటు చైతన్యంపై ప్రచారం జరగాలి.
Comments
Please login to add a commentAdd a comment