సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంతో పాటు 2024 లోక్‌సభ ఎన్నికల్లో దేశంలో, రాష్ట్రంలో మెజారిటీ ఎంపీ స్థానాలు గెలుచుకునేందుకు బీజేపీ భారీ ప్రణాళికను రూపొందించింది. జాతీయ కార్యవర్గ సమావేశాలకు ముందు పార్టీ స్థితిగతులను అంచనా వేసేందుకు కేంద్ర మంత్రులు సహా కీలక నేతలను తెలంగాణలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు పంపిన కమలం పార్టీ.. ఈసారి లోక్‌సభ నియోజకవర్గాల వారీగా రంగంలోకి దిగుతోంది. కేంద్ర మంత్రుల్ని పార్టీ బలహీనంగా ఉన్న పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటింప జేయడం (పార్లమెంట్ ప్రవాసీ యోజన) ద్వారా బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాలను, మోదీ సర్కారు సాధించిన విజయాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా వ్యూహరచన చేసింది.
దేశవ్యాప్తంగా మొత్తం 144 పార్లమెంట్ నియోజకవర్గాల్లోప్రభుత్వ పథకాల ప్రచారానికి శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా తెలంగాణలోని సికింద్రాబాద్, నిజామాబాద్, కరీంనగర్ మినహా 14 లోక్‌సభ స్థానాలను నాలుగు క్లస్టర్లుగా విభజించింది. నలుగురు కేంద్ర మంత్రులకు వీటి బాధ్యతలు అప్పగించింది. వీరికి తోడుగా ఇతర కేంద్ర మంత్రులు కూడా నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. ఇతర రాష్ట్రాలకు చెందిన కేంద్ర మంత్రులకు బాధ్యతలు అప్పగించడం, క్షేత్రస్థాయిలో పార్టీకి మరింత ఊపు వచ్చేలా చూడటం ద్వారా లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలుచుకోవాలనే ప్రధాన లక్ష్యంతో ఈ ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసింది. తెలంగాణతో పాటు 2024 లోక్‌సభ ఎన్నికల్లోగా జరగనున్న గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఖాయం చేసుకునేందుకు పథకాల విస్తృత ప్రచారం దోహదపడుతుందని భావిస్తోంది.
విస్తృత ఏర్పాట్లు..:
తెలంగాణలోని 4 క్లస్టర్లలో కేంద్ర పథకాల ప్రచారాన్ని కిందిస్థాయి వరకు తీసుకువెళతారు. ఈనెల 8 నుంచే కేంద్ర మంత్రులు క్లస్టర్లలో పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. 8న కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా హైదరాబాద్ లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఆ తర్వాత మిగతా కేంద్రమంత్రులు వరసగా రాష్ట్రంలో తమకు కేటాయించిన క్లస్టర్లలోని ఎంపీ స్థానాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. రాష్ట్రంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం వివిధ కేంద్ర పథకాలను తన పథకాలుగా ప్రచారం చేసుకుంటోందని ఆరోపిస్తున్న బీజేపీ నేతలు.. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగట్టడంతో పాటు, మోదీ ప్రభుత్వం చేకూరుస్తున్న ప్రయోజనాలను అన్ని వర్గాలకు వివరించనున్నారు.
వీరికి సహకరించేందుకు పార్లమెంట్ ప్రవాసీ కన్వీనర్ పేరిట రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని బీజేపీ నియమించింది. కో కన్వీనర్లుగా కార్యదర్శులు ఉమారాణి, జయశ్రీ,, సంగారెడ్డి సహ ఇన్‌చార్జి్జ అట్లూరి రామకృష్ణ నియమితులయ్యారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షుల సమావేశంలో పార్లమెంట్ ప్రవాసీ యోజనకు చేయాల్సిన ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ యోజన లక్ష్యమని ప్రేమేందర్‌రెడ్డి తెలిపారు.
మొత్తం 10 మంది కేంద్ర మంత్రులు
రాష్ట్రంలోని 14 లోక్‌సభ నియోజకవర్గాలను నాలుగు క్లస్టర్లుగా విభజించగా.. ఒక్కొక్కటి నాలుగు ఎంపీ స్థానాల చొప్పున రెండు క్లస్టర్లు, మూడు స్థానాల చొప్పున మరో రెండు క్లస్టర్లు ఏర్పాటు చేశారు. తొలిదశలో ఈ 14 లోక్‌సభా నియోజకవర్గాల్లో మొత్తం 10 మంది కేంద్ర మంత్రులు పర్యటిస్తారు. వీరు వచ్చే ఎన్నికల దాకా పలుదఫాలుగా ఆయా నియోజకవర్గాలకు వెళ్లనున్నారు. ప్రతిసారీ 2–3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. ప్రస్తుతం సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల్లో పార్టీ బలంగానే ఉందని, కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచారం బాగానే సాగుతోందని జాతీయ నాయకత్వం అంచనా వేసింది. అయితే తర్వాతి దశలో ఈ 3 నియోజకవర్గాల్లోనూ కేంద్ర మంత్రులు పర్యటిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment