Parliamentary elections
-
జపాన్‌లో హంగ్
టోక్యో: జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా నేతృత్వంలోని అధికార కూటమి ఆదివారం జరిగిన కీలకమైన పార్లమెంటరీ ఎన్నికల్లో మెజారిటీని కోల్పోయింది. 465 స్థానాలున్న దిగువ సభలో కూటమి బలం 279 స్థానాల నుంచి 215కు పడిపోయింది. మెజారిటీకి కనీసం 233 స్థానాలు అవసరం. కూటమి సారథి లిబరల్ డెమొక్రటిక్ పార్టీ (ఎల్డీపీ)కి 2009 తర్వాత అత్యంత దారుణమైన ఫలితాలివే. జపాన్ను దాదాపుగా 1955 నుంచీ ఎల్డీపీయే పాలిస్తూ వస్తోంది. ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడంతో అనిశ్చితి దెబ్బకు జపాన్ కరెన్సీ యెన్ మూడు నెలల కనిష్టానికి పడిపోయింది. ఫలితాలు తమకు ప్రతికూలంగా వచ్చాయని ఇషిబా సోమవారం అంగీకరించారు. ‘‘ప్రజా తీర్పును అంగీకరిస్తున్నా. అయితే ప్రధానిగా నేనే కొనసాగుతాం’’ అని స్పష్టం చేశారు. ‘‘అధికార కూటమికి మా ఎల్డీపీయే సారథ్యం వహిస్తుంది. కీలక విధానాలతో ప్రణాళికాబద్ధమైన బడ్జెట్‌ను రూపొందిస్తాం. రాజకీయ సంస్కరణలు కొనసాగిస్తాం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటే ప్రతిపక్షాలకు సహకరించడానికి మా పార్టీ సిద్ధం’’ అన్నారు. డిసెంబర్ నెలాఖరులో కీలకమైన బడ్జెట్ ప్రణాళికలను పాలకవర్గం ఆమోదించేదాకా ఇషిబా కొనసాగే అవకాశముంది. ఫ్యూమియో కిషిడా నుంచి ఇషిబా అక్టోబర్ 1న పదవీ బాధ్యతలు స్వీకరించడం తెలిసిందే. ఆ వెంటనే సాధారణ ఎన్నికలకు వెళ్లారు.చిన్న పార్టీలే కీలకంసెంట్రిస్ట్ నేత యోషిహికో నోడా నేతృత్వంలోని ప్రధాన ప్రతిపక్షం కాన్స్టిట్యూషనల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ జపాన్ (సీడీపీజే) 148 స్థానాలు గెలుచుకుంది. ఇది గతంలో కంటే 50 స్థానాలు అధికం. ‘‘అధికార కూటమికి మెజారిటీ రాకుండా చూడాలన్న లక్ష్యాన్ని సాధించాం. ఇది గొప్ప విజయం’’ అని నోడా అన్నారు. ఇతర ప్రతిపక్షాలతో కలిసి సంకీర్ణానికి నాయకత్వం వహించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుకు 30 రోజుల సమయముంది. ఎక్కవ సీట్లు సాధించిన చిన్న పార్టీల పాత్ర కీలకంగా మారనుంది. ఇషిబాతో చేయి కలిపేందుకు డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ది పీపుల్, కన్జర్వేటివ్ జపాన్ ఇన్నోవేషన్ పార్టీ సిద్ధంగా ఉన్నాయి. పాక్షిక పొత్తుకు సిద్ధమని డీపీపీ అధినేత యుచిరో తమాకీ కూడా తెలిపారు. -
సిక్కుల ఓట్ల కోసమే చిచ్చు!
ప్రజా వ్యతిరేకతను, సొంత పార్టీ లో తిరుగుబాటును అధిగమించి వచ్చే ఏడాది జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో నెగ్గడానికి కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతున్నారా? కెనడాలో గణనీయ సంఖ్యలో ఉన్న సిక్కు ఓటర్లను ప్రసన్నం చేసుకొని, ఎన్నికల్లో లబ్ధి పొందడానికి తహతహలాడుతున్నారా? కేవలం అధికారం కోసం ఓటు బ్యాంకు రాజకీయాలతో భారత్– కెనడా సంబంధాలను బలి పెట్టడానికి సైతం వెనుకాడడం లేదా? రాజకీయ విశ్లేషకులు, నిపుణులు అవుననే చెబుతున్నారు. ఖలిస్తాన్ ఉగ్రవాది హరిదీప్‌సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉందని జస్టిన్ ట్రూడో పదేపదే ఆరోపిస్తున్నారు.అంతేకాదు ఈ హత్యలో భారత హైకమిషనర్ సంజయ్ కమార్ వర్మను ట్రూడో ప్రభుత్వం అనుమానితుడిగా చేర్చింది. ఈ పరిణామంతో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలహీనపడ్డాయి. ట్రూడో పదవీ కాంక్ష వల్ల భారత్, కెనడా ప్రజలు నష్టపోయే పరిస్థితి కనిపిస్తోంది. వచ్చే ఏడాది నవంబర్‌లో కెనడా పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్నాయి. మరో ఏడాది సమయమే మిగిలి ఉంది. మరోవైపు జస్టిన్ ట్రూడో పాలనల పై ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. సొంత పార్టీ లో సైతం నిరసన గళాలు బలం పుంజుకుంటున్నాయి. ట్రూడో నాయకత్వాన్ని, పరిపాలనా సామర్థ్యాన్ని అధికార ‘లిబరల్ పార్టీ ఆఫ్ కెనడా’ నాయకులు ప్రశి్నస్తున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల దృష్టిని మళ్లించడానికి నిజ్జర్ హత్యను ట్రూడో తెలివిగా తనకు అనుకూలంగా వాడుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజ్జర్ వ్యవహారంలో భారత్‌ను ఇరుకునపెట్టడం ద్వారా సిక్కుల ఓట్లపై ఆయన వల విసురుతున్నట్లు ప్రచారం సాగుతోంది. 2021 నాటి గణాంకాల ప్రకారం కెనడాలో 7.70 లక్షల మంది సిక్కులున్నారు. అంటే జనాభాలో 2.1 శాతం మంది సిక్కులే. భారత్‌కు వెలుపల అత్యధిక సంఖ్యలో సిక్కులు ఉన్న దేశం కెనడా. ఆర్థికంగా బలమైన స్థితిలో ఉండి రాజకీయ ప్రాబల్యం కలిగిన సిక్కులను మచ్చిక చేసుకోవడానికి కెనడా రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తుంటాయి. భారత వ్యతిరేక ఖలిస్తానీ శక్తులను ప్రోత్సహిస్తుంటాయి.భారత్‌లో సిక్కుల కోసం ప్రత్యేక దేశం ఏర్పాటు చేయాలన్న నినాదంతో పుట్టుకొచి్చన ఖలిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు కెనడా అడ్డాగా మారిపోయింది. వరల్డ్ సిక్కు ఆర్గనైజేషన్, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్, సిక్స్ ఫర్ జస్టిస్, బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ తదితర సంస్థలు కెనడా నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నాయి. రాజకీయ పార్టీ లు వీటికి మద్దతిస్తున్న సంగతి బహిరంగ రహస్యమే. కనీసం 9 ఖలిస్తానీ టెర్రర్ గ్రూప్‌లకు కెనడాయే ప్రధాన స్థావరం. ఇవన్నీ భారత సార్వబౌమత్వం, ప్రాదేశిక సమగ్రతపై ప్రత్యక్ష యుద్ధమే చేస్తున్నాయి. తమ దేశంలో నేరాలకు పాల్పడిన ఖలిస్తాన్ ఉగ్రవాదులను తమకు అప్పగించాలని భారత ప్రభుత్వం కోరుతున్నప్పటికీ కెనడా లెక్కచేయడం లేదు. కనీసం చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నా తిరస్కరిస్తోంది. భారత వ్యతిరేక శక్తులకు కెనడా స్వర్గధామం అనడంలో అతిశయోక్తి లేదు. మరోవైపు ఖలిస్తానీలకు పాకిస్తాన్ నిఘా సంస్థ ‘ఐఎస్ఐ’ పూర్తిస్థాయిలో అండదండలు అందిస్తోంది. ట్రూడో పాలనలో కెనడా దేశం భారత్‌కు మరో పాకిస్తాన్‌గా మారిందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. విద్యార్థి వీసాలపై పిడుగు! కెనడా–భారత్ మధ్య విభేదాలు ముదురుతుండడంతో ఇరు దేశాల ప్రజలు నష్టపోయే ప్రమాదం పొంచి ఉంది. ప్రధానంగా వీసా సేవలు నిలిచిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం కెనడాలో 1.78 లక్షల మంది ప్రవాస భారతీయులు(ఎన్ఆర్ఐలు), 15.10 లక్షల మంది భారత సంతతి ప్రజలు నివసిస్తున్నారు. 2.80 లక్షల మందికిపైగా భారత విద్యార్థులు ఉన్నారు. కెనడాలోని మొత్తం విదేశీ విద్యార్థుల్లో 41 శాతం మంది భారతీయులే.ఈ ఏడాది ప్రారంభంలో ఇంటర్నేషనల్ స్టూడెంట్ వీసాలను ప్రభుత్వం 3.60 లక్షలకే పరిమితం చేసింది. 2022 నాటితో పోలిస్తే విద్యార్థి వీసాల సంఖ్యను 35 శాతం తగ్గించింది. దీనివల్ల భారతీయ విద్యార్థులు నష్టపోయారు. ప్రస్తుతం భారత ప్రభుత్వంతో విభేదిస్తున్న నేపథ్యంలో విద్యార్థి వీసాలను మరింత తగ్గించే అవకాశం కనిపిస్తోంది. భారతీయ ఉద్యోగులను ఇప్పటికప్పుడు వెనక్కి పంపించే పరిస్థితి లేకున్నా, సమీప భవిష్యత్తులో ఏదైనా జరగొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
French elections 2024: ఫ్రాన్స్ రెండో దశలో... రికార్డు పోలింగ్
పారిస్: ఫ్రాన్స్ పార్లమెంటు ఎన్నికల్లో ఆదివారం కీలకమైన రెండో దశలో రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం ఐదుగంటలకు 59.7 శాతం పోలింగ్ నమోదైనట్లు ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది. 1981 తర్వాత ఇంతటి పోలింగ్ నమోదవడం ఇదే తొలిసారి. జూన్ 30వ తేదీన జరిగిన తొలి రౌండ్లో 67 శాతం పోలింగ్ జరిగింది. ఐరోపా ఎన్నికల్లో మధ్యేవాదుల పరాజయం తర్వాత అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ జూన్ 9న పార్లమెంట్‌ను రద్దు చేసి ఎన్నికలకు పిలుపునిచ్చారు. ఫ్రాన్స్‌లో అధ్యక్ష ఎన్నికలైనా, పార్లమెంటు ఎన్నికలైనా రెండు దశల్లో జరుగుతాయి. ఆదివారం జరిగిన రెండో దశ కీలకమైనది. మాక్రాన్ అధ్యక్ష పదవీ కాలం ఇంకా మూడేళ్లు ఉంది. ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల ఫలితాల వల్ల ఆయన పదవికి తక్షణ ప్రమాదం ఏమీ లేకున్నా, చట్టాలు చేసేటప్పుడు పార్లమెంటులో అడుగడుగునా పరీక్ష ఎదురయ్యే అవకాశం ఉంది. ముందస్తు ఎన్నికలకు వెళ్లిన ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్‌కు తొలిరౌండ్లో చేదు అనుభవం ఎదురైన విషయం తెల్సిందే. మేక్రాన్‌కు చెందిన మితవాద సెంట్రిస్ట్ ఎన్‌సింబల్ కూటమి మూడో స్థానంలో సరిపెట్టుకుంది. తొలి రౌండ్లో అతివాద నేషనల్ ర్యాలీ కూటమి 33.14 శాతం ఓట్లను ఒడిసిపట్టి విజయం సాధించింది. విపక్షాలకు చెందిన న్యూ పాపులర్ ఫ్రంట్ కూటమి 27.99 శాతం ఓట్లను సాధించింది. మేక్రాన్ పార్టీ కేవలం 20.04 శాతం ఓట్లతో సరిపెట్టుకుంది. ఇటీవల యురోపియన్ పార్లమెంట్ ఎన్నికల్లో నాయకురాలు మెరీన్ లీ పెన్కు చెందిన నేషనల్ ర్యాలీ పార్టీ విజయం సాధించింది. ఆలస్యం చేస్తే విపక్షాలు మరింత పుంజుకుంటాయన్న భయంతో మేక్రాన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లిన విషయం విదితమే. -
ఫ్రాన్స్ ఎన్నికలు: మెక్రాన్‌కు ఎగ్జిట్‌పోల్స్ గుబులు
పారిస్: ఉత్కంఠ రేకెత్తిస్తున్న ఫ్రాన్స్ పార్లమెంటరీ ఎన్నికల్లో.. అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌కు ఘోర పరాభవం తప్పదా?. ఇప్పటికప్పుడు అంచనాకి రాలేకపోయినప్పటికీ.. తొలి రౌండ్ పోలింగ్ అనంతరం వెలువడ్డ ఎగ్జిట్ పోల్స్ మాత్రం మెక్రాన్ నేతృత్వంలోని సెంట్రిస్ట్ కూటమికి గుబులు పుట్టిస్తున్నాయి. ఆ ఎగ్జిట్‌పోల్స్‌లో ఆ కూటమి స్థానానికే పరిమితమవుతుందని సర్వే సంస్థలు అంచనా వేశాయి.ఆదివారం ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికలకు తొలి రౌండ్ పోలింగ్ ముగిసింది. అనంతరం వెలువడ్డ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మెరైన్ లే పెన్కు చెందిన నేషనల్ ర్యాలీ(RN)కు అనుకూలంగా వచ్చాయి. ఆర్ఎన్ పార్టీకి 34 శాతం ఓటింగ్‌తో.. గెలుపు దిశగా దూసుకెళ్తోందని సర్వే సంస్థలు వెల్లడించాయి. మెక్రాన్ నేతృత్వంలోని సెంట్రిస్ట్ కూటమికి 20.5-23 శాతం ఓటింగ్ రావొచ్చని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. న్యూ పాపులర్ ఫ్రంట్(NFP) కూటమికి 29 శాతం ఓట్లు పడ్డాయని వెల్లడించాయి. అయితే ఈ నెల ఏడున మలి విడత పోలింగ్ జరగనుంది. ఆ తర్వాతే పూర్తి స్థాయి ఫలితంపై ఒక అంచనా వచ్చే అవకాశం ఉంది. ఐరోపా పార్లమెంటు ఎన్నికల్లో అతి మితవాదులు(RN Party) ఘన విజయం సాధించడంతో మెక్రాన్ పార్లమెంటుకు ముందస్తు ఎన్నికలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఫ్రాన్స్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య 4.95 కోట్లు. మొత్తం 577 మందిని ఎన్నుకోనున్నారు అక్కడి ఓటర్లు. త్రిముఖ కూటమి మధ్య పోరు హోరాహోరీగా జరగొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
ఫ్రాన్స్ పార్లమెంట్ రద్దు
పారిస్: యూరోపియన్ యూనియన్ (ఈయూ) పార్లమెంటరీ ఎన్నికలు పరోక్షంగా ఫ్రాన్స్ పార్లమెంట్ ముందస్తు ఎన్నికలను మోసుకొచ్చాయి. యూరోపియన్ యూనియన్‌లో మొత్తం 720 సీట్లు ఉండగా 81 సభ్యులను ఫ్రాన్స్ ఎన్నుకోనుంది. ఇందుకోసం జరిగిన ఎన్నికల్లో ఫ్రాన్స్ విపక్ష నేషనల్ర్యాలీ పార్టీకి 32 శాతం ఓట్లు పడొచ్చని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్‌కు చెందిన రనీసాన్స్ పారీ్టకి కేవలం 15 శాతం ఓట్లు పడతాయని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. నిజంగానే ఈ ధోరణి ఇలాగే కొనసాగితే మూడేళ్ల తర్వాత అంటే 2027లో జరగబోయే ఫ్రాన్స్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ విపక్ష పార్టీ విజయం సాధించే ప్రమాదముందని దేశాధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ భావించారు. ఇందుకు బలం చేకూరుస్తూ ఆయన పార్లమెంట్‌ను రద్దుచేస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. దీంతో వచ్చే 20 రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 30న తొలి దశ, జూలై ఏడో తేదీన రెండో దశ పోలింగ్ జరగనుంది. మూడేళ్ల తర్వాత నిర్వహిస్తే ఓడిపోతామని, ప్రజాదరణ తగ్గేలోపు ఇప్పుడే నిర్వహిస్తే తమ రనీసాన్స్ పారీ్టయే గెలుస్తుందన్న అంచనాతో ఆయన ఈ అనూహ్య నిర్ణయం తీసుకున్నారని వార్తలొచ్చాయి. సరైన నిర్ణయం తీసుకున్నా: మేక్రాన్ పార్లమెంట్ రద్దు నిర్ణయాన్ని మేక్రాన్ సమరి్థంచుకున్నారు. ‘‘ దేశం కోసం సరైన నిర్ణయం తీసుకున్నా. ఈయూ ఎన్నికల ద్వారా ప్రజలు మా ప్రభుత్వానికి ఏం చెప్పదల్చుకున్నారో అర్థమైంది. ప్రజల సమస్యలకు పరిష్కారాలు చూపకుండా వదిలేయలేను’ అని చెప్పారు. -
ప్రజాస్వామ్యం లేని గెలుపు?
ఆమె గెలవడం ఇది అయిదోసారి. అందులోనూ ఇది వరుసగా నాలుగో గెలుపు. మామూలుగా అయితే ఇది అసాధారణం. అయితే, బంగ్లాదేశ్‌లో కాదు. ఆ దేశంలో ఆదివారం పార్లమెంటరీ ఎన్నికలు జరిగిన తీరు కానీ, ప్రధాని షేక్ హసీనా సారథ్యంలోని అవామీ లీగ్ (ఏఎల్) ఘన విజయం కానీ అనూహ్యమేమీ కాదు. మునుపటి ప్రధాని ఖలీదా జియా నేతృత్వంలోని ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, దాని మిత్రపక్షాలు... అన్నీ కలిపి 15 పార్టీలు ప్రజాతీర్పుకు దూరంగా ఉన్నప్పుడు పాలక పక్షానిదే గెలుపు కాక మరేమవుతుంది! ఎన్నికలను బహిష్కరించాలంటూ ప్రతిపక్షాలు ప్రజలకు పిలుపునివ్వడంతో సహజంగానే ఓటింగ్ శాతం గణనీయంగా తగ్గింది. 2018 నాటి 80 శాతం సగానికి పడిపోయి, 40 చిల్లర వద్ద తచ్చాడింది. ఫలితాలూ ఊహించినట్టే వచ్చాయి. మొత్తం 300 స్థానాల్లో 299 స్థానాలకు ఎన్నికలు జరగగా, పాలక పక్షానికి 223 వచ్చాయి. విచి త్రమేమంటే, ఆ తర్వాత అత్యధిక స్థానాలు గెలిచింది స్వతంత్రులే. ఇలా ఇండిపెండెంట్లుగా గెలిచిన 62 మందిలో కూడా అత్యధికులు పాలక అవామీ లీగ్ టికెట్లు ఇవ్వడానికి నిరాకరిస్తూ, పార్టీ అధికా రిక అభ్యర్థిపై పోటీ చేసి గెలవమన్న వాళ్ళే! అలా గెలిచినవాళ్ళే! ఇప్పుడు బంగ్లాదేశ్ పార్లమెంట్లో రెండో అతి పెద్ద వర్గం ఈ ఇండిపెండెంట్లదే! ‘జాతీయ పార్టీ’ 11 సీట్లు, మరో మూడు విపక్ష పార్టీలు 3 సీట్లతో ఆ తర్వాతి స్థానాల్లో నామావశిష్టంగా నిలిచాయి. ఇప్పుడిక ఎవరిని పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షంగా ప్రకటిస్తారో చూడాలి. అధికారిక ప్రకటనలెలా ఉన్నా, ఆచరణలో వాస్తవికంగా బంగ్లా ఇప్పుడు ఒక రకంగా ప్రతిపక్షమే లేని పార్లమెంట్ అయింది. షేక్ హసీనా తన తాజా విజయంతో అటు ప్రతిపక్షాలనే కాదు... ఇటు ప్రజాస్వామ్యాన్ని సైతం ఓడించారని విశ్లేషకులంటున్నది అందుకే! ప్రపంచంలో దీర్ఘకాల మహిళా ప్రభుత్వాధినేత అనే కిరీటం హసీనాదే. 2009 నుంచి హసీనా తాలూకు పార్టీదే అధికారం. అప్పటి నుంచి ఇన్నేళ్ళలో మంచీ చెడులు రెంటిలోనూ హసీనా ఉక్కుమహిళే! అటు ఆర్థికాభివృద్ధి కార్యక్రమాలతో దేశాన్ని దుర్భర దారిద్య్రం నుంచి బయటకు తెచ్చి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన కీర్తి, ఇటు మానవ హక్కుల ఉల్లంఘనలు, ప్రతిపక్షాలను ఉక్కుపాదంతో తొక్కేసిన అపకీర్తి... రెండూ ఆమెవే. దేశ ఆర్థిక పురోగతి, సామాజిక అభివృద్ధిలో అవిస్మరణీయ పాత్ర ఈసారి కూడా ఆమెకు విజయం అందించి ఉండవచ్చు. అంతమాత్రాన మిగతా తప్పులన్నీ ఒప్పులై పోవు. అసలు ఈ ఎన్నికల ప్రక్రియ నిష్పాక్షికతపై అంతర్జాతీయ పరిశీలకులు, మానవ హక్కుల సంఘాల వారు అనుమానాలు, ఆందోళనలు వ్యక్తం చేశారు. కీలక సంస్థలు, వ్యవస్థల పైన, అసమ్మతి వినిపించకుండా చివరకు మీడియా పైన కూడా హసీనా సర్కార్ నియంత్రణపై విమర్శలూ వచ్చాయి. 17 కోట్లకు పైగా జనాభా ఉన్న బంగ్లాదేశ్ తరుణ ప్రజాస్వామ్యానికి ఇది వన్నె తీసుకురాదు. బలమైన ప్రతిపక్షం లేకుంటే ప్రజాస్వామ్య వ్యవస్థే లేదు. హసీనా మరోసారి ఎన్నికవడం భారత్‌కు మాత్రం ఒక రకంగా శుభవార్తే! ఎందుకంటే, హసీనా హయాంలో భారత – బంగ్లాదేశ్ బంధాలు బలపడ్డాయి. వాణిజ్యం పెరిగింది. మెరుగైన రోడ్డు, రైలు రవాణా సదుపాయాలు ఏర్పడ్డాయి. అంతకన్నా ముఖ్యంగా దక్షిణాసియా ప్రాంతానికి తీవ్ర వాదం పెనుముప్పుగా పరిణమించిందని ఏకాభిప్రాయంతో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మునుపటి షేక్ హసీనా హయాం మరో పర్యాయం కొనసాగడం ఢిల్లీ దృష్టి నుంచి చూస్తే మంచిదే! బంగ్లాదేశ్‌లో రాజకీయ సుస్థిరత, విదేశాంగ విధానాల కొనసాగింపు మనకు లాభించే విషయాలు. పైగా, అంతర్యుద్ధంలో కూరుకుపోయిన ఉమ్మడి పొరుగుదేశమైన మయన్మార్ నుంచి శరణార్థుల సమస్య పెరుగుతూ, తీవ్రవాదులకు ఆయుధాలు సులభంగా అందివచ్చే పరిస్థితులున్న సమయంలో బంగ్లా దేశ్‌లో స్నేహశీల సర్కార్ ఉండడం భారత్‌కు ఒకింత సాంత్వన. నిజానికి, రాగల కొద్దినెలలు దక్షిణాసియా ప్రాంతానికి కీలకం. ఎందుకంటే, ఈ ప్రాంతంలోని పలు దేశాల్లో ఈ ఏడాదే ఎన్నికలున్నాయి. ఈ ఫిబ్రవరి 8న పాకిస్తాన్లో ఎన్నికలు జరగనుంటే, ఆ తరువాత కొద్దినెలలకే శ్రీలంకలో అధ్యక్ష పదవికి ఎన్నిక. ఇక, ఏప్రిల్ – మే నెలల్లో భారత్‌లో లోక్‌సభ ఎన్నికలు సరేసరి. వివిధ దేశాల ఎన్నికల ఫలితాలు, కొలువు దీరే కొత్త ప్రభుత్వాలు, వాటి వైఖరిలో మార్పులను బట్టి భారత ఉపఖండంలో అనేక మార్పులు రావడం సహజం. ఇప్పటికే నిరుడు సెప్టెంబర్‌లో మాల్దీవుల్లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో భారత వ్యతిరేక వైఖరిని అస్త్రంగా చేసుకొని, మహమ్మద్ మొయిజు గద్దెనెక్కారు. భారత్‌కు దీర్ఘకాలిక మిత్రదేశమైన మాల్దీవులు అప్పటి నుంచి ఢిల్లీ కన్నా బీజింగ్ వైపు మొగ్గుతూ ఉండడం చూస్తూనే ఉన్నాం. తాజా లక్షద్వీప్ వర్సెస్ మాల్దీవ్స్ ఘటనలోనూ అదే కనపడింది. వీటన్నిటి దృష్టితో చూసినప్పుడూ బంగ్లాదేశ్‌లో మరోసారి భారత అనుకూల హసీనా సర్కార్ ఏర్పాటవడం భారత్‌కు ప్రయోజనకరమే! ఇటు భారత్‌తో వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలు, అటు చైనా సైనిక ఆలంబన – రెండూ కొనసాగిస్తూ హసీనా చేస్తున్న సమతూకం అందరికీ చేతకావు. అలాంటి ఆమె విజయాలు ప్రశంసా ర్హమే అయినా, సాగిస్తున్న రాజకీయ అణచివేతను విస్మరించలేం. ఆన్లైన్లో విమర్శించినా అరదండాలే అన్న డిజిటల్ భద్రతా చట్టం లాంటివి పౌరస్వేచ్ఛకు ప్రతిబంధకాలు. ప్రజాస్వామ్య వాతావర ణమే లేకుంటే, చివరకు అమెరికా సహా ఇతర అభివృద్ధి చెందిన దేశాలు వాణిజ్య షరతులు విధిస్తాయి. అదే అదనుగా బంగ్లాదేశ్ పక్షాన చైనా బరిలోకి దిగుతుంది. అది భారత్‌కూ అభిలషణీయం కాదు. అందుకే, ప్రతిపక్షాలను ఊపిరి పీల్చుకొనిచ్చేలా, వ్యవస్థల స్వతంత్రతను కాపాడేలా హసీనా సర్కార్‌కు భారత్ నచ్చజెప్పాలి. బంగ్లాకూ, భారత్‌కూ దీర్ఘకాలంలో అదే శ్రేయస్కరం. -
తెలంగాణలో అసెంబ్లీతోపాటు లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ పక్కా ప్లాన్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంతో పాటు 2024 లోక్‌సభ ఎన్నికల్లో దేశంలో, రాష్ట్రంలో మెజారిటీ ఎంపీ స్థానాలు గెలుచుకునేందుకు బీజేపీ భారీ ప్రణాళికను రూపొందించింది. జాతీయ కార్యవర్గ సమావేశాలకు ముందు పార్టీ స్థితిగతులను అంచనా వేసేందుకు కేంద్ర మంత్రులు సహా కీలక నేతలను తెలంగాణలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు పంపిన కమలం పార్టీ.. ఈసారి లోక్‌సభ నియోజకవర్గాల వారీగా రంగంలోకి దిగుతోంది. కేంద్ర మంత్రుల్ని పార్టీ బలహీనంగా ఉన్న పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటింప జేయడం (పార్లమెంట్ ప్రవాసీ యోజన) ద్వారా బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాలను, మోదీ సర్కారు సాధించిన విజయాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా వ్యూహరచన చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 144 పార్లమెంట్ నియోజకవర్గాల్లోప్రభుత్వ పథకాల ప్రచారానికి శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా తెలంగాణలోని సికింద్రాబాద్, నిజామాబాద్, కరీంనగర్ మినహా 14 లోక్‌సభ స్థానాలను నాలుగు క్లస్టర్లుగా విభజించింది. నలుగురు కేంద్ర మంత్రులకు వీటి బాధ్యతలు అప్పగించింది. వీరికి తోడుగా ఇతర కేంద్ర మంత్రులు కూడా నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. ఇతర రాష్ట్రాలకు చెందిన కేంద్ర మంత్రులకు బాధ్యతలు అప్పగించడం, క్షేత్రస్థాయిలో పార్టీకి మరింత ఊపు వచ్చేలా చూడటం ద్వారా లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలుచుకోవాలనే ప్రధాన లక్ష్యంతో ఈ ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసింది. తెలంగాణతో పాటు 2024 లోక్‌సభ ఎన్నికల్లోగా జరగనున్న గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఖాయం చేసుకునేందుకు పథకాల విస్తృత ప్రచారం దోహదపడుతుందని భావిస్తోంది. విస్తృత ఏర్పాట్లు..: తెలంగాణలోని 4 క్లస్టర్లలో కేంద్ర పథకాల ప్రచారాన్ని కిందిస్థాయి వరకు తీసుకువెళతారు. ఈనెల 8 నుంచే కేంద్ర మంత్రులు క్లస్టర్లలో పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. 8న కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా హైదరాబాద్ లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఆ తర్వాత మిగతా కేంద్రమంత్రులు వరసగా రాష్ట్రంలో తమకు కేటాయించిన క్లస్టర్లలోని ఎంపీ స్థానాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం వివిధ కేంద్ర పథకాలను తన పథకాలుగా ప్రచారం చేసుకుంటోందని ఆరోపిస్తున్న బీజేపీ నేతలు.. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగట్టడంతో పాటు, మోదీ ప్రభుత్వం చేకూరుస్తున్న ప్రయోజనాలను అన్ని వర్గాలకు వివరించనున్నారు. వీరికి సహకరించేందుకు పార్లమెంట్ ప్రవాసీ కన్వీనర్ పేరిట రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని బీజేపీ నియమించింది. కో కన్వీనర్లుగా కార్యదర్శులు ఉమారాణి, జయశ్రీ,, సంగారెడ్డి సహ ఇన్‌చార్జి్జ అట్లూరి రామకృష్ణ నియమితులయ్యారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షుల సమావేశంలో పార్లమెంట్ ప్రవాసీ యోజనకు చేయాల్సిన ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ యోజన లక్ష్యమని ప్రేమేందర్‌రెడ్డి తెలిపారు. మొత్తం 10 మంది కేంద్ర మంత్రులు రాష్ట్రంలోని 14 లోక్‌సభ నియోజకవర్గాలను నాలుగు క్లస్టర్లుగా విభజించగా.. ఒక్కొక్కటి నాలుగు ఎంపీ స్థానాల చొప్పున రెండు క్లస్టర్లు, మూడు స్థానాల చొప్పున మరో రెండు క్లస్టర్లు ఏర్పాటు చేశారు. తొలిదశలో ఈ 14 లోక్‌సభా నియోజకవర్గాల్లో మొత్తం 10 మంది కేంద్ర మంత్రులు పర్యటిస్తారు. వీరు వచ్చే ఎన్నికల దాకా పలుదఫాలుగా ఆయా నియోజకవర్గాలకు వెళ్లనున్నారు. ప్రతిసారీ 2–3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. ప్రస్తుతం సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల్లో పార్టీ బలంగానే ఉందని, కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచారం బాగానే సాగుతోందని జాతీయ నాయకత్వం అంచనా వేసింది. అయితే తర్వాతి దశలో ఈ 3 నియోజకవర్గాల్లోనూ కేంద్ర మంత్రులు పర్యటిస్తారు. -
అయిదేళ్ళ అగ్నిపరీక్ష!
వ్యక్తిగతంగా చరిత్రాత్మక విజయం సాధించినా, ఒక్కోసారి అది వ్యవస్థను నడపడానికి చాలక పోవచ్చు. గెలిచామన్న ఆనందం కళ్ళ ముందు కొద్ది రోజులకే ఆవిరి అయిపోనూ వచ్చు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ పరిస్థితి ఇప్పుడు అదే! రెండునెలల క్రితం ఏప్రిల్‌లో దేశానికి వరుసగా రెండో సారి అధ్యక్షుడై చరిత్ర సృష్టించిన ఆయన తీరా తాజా పార్లమెంట్ దిగువ సభ ఎన్నికల్లో తమ పార్టీ కూటమికి 289 సీట్ల మెజారిటీని కూడగట్టుకోలేకపోయారు. అనుమానిస్తున్నట్టే ఆదివారం నాటి ఫ్రాన్స్ నేషనల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మెక్రాన్‌కు చేదు అనుభవమయ్యాయి. 577 సీట్ల సభలో ఆయన కూటమి 245 స్థానాలకే పరిమితమైంది. మునుపటి 350 స్థానాల స్థాయి నుంచి ఏకంగా 100కు పైగా సీట్లను తమ కూటమి కోల్పోవడంతో మెక్రాన్‌కు నిద్ర లేని రాత్రులు మొదలయ్యాయి. ఎగువ సభ ‘సెనేట్’, దిగువ సభ ‘నేషనల్ అసెంబ్లీ’ – ఇలా సభాద్వయ విధానమున్న ఫ్రాన్స్ పార్లమెంటరీ వ్యవస్థలో ఈ ఫలితాలు పలురకాలుగా దిగ్భ్రాంతి కలిగించాయి. అనేక సంక్షోభా లున్న వేళ పార్లమెంట్లో తమ కూటమికి స్పష్టమైన మెజారిటీ ఇవ్వకుంటే, ఫ్రాన్స్‌లో, తద్వారా ప్రపంచంలో అస్తవ్యస్తత తప్పదంటూ మెక్రాన్ ఈ ఎన్నికల వేళ ఓటర్లను అభ్యర్థించారు. కానీ, ఓటర్లు ఆ మాటను నిర్ద్వంద్వంగా తిరస్కరించారన్నది స్పష్టం. కూటమిలోని హేమాహేమీలు ఎన్నికల్లో ఓడిపోవడం గమనార్హం. పార్లమెంట్లో ప్రధాన బలం ఇప్పటికీ మెక్రాన్ సారథ్యంలోని మధ్యేవాద ‘ఎన్సెంబుల్’ కూటమిదే. కానీ సభలో మెజారిటీయే దక్కలేదు. 1988 తర్వాత అధ్యక్షు డిగా గెలిచినా, ఫ్రాన్స్ పార్లమెంట్లో మెజారిటీ సాధించలేకపోయిన తొలి ప్రెసిడెంట్ మెక్రానే. అతి తక్కువగా 46.23 శాతమే ఓటింగ్ నమోదైన ఈ పార్లమెంటరీ ఎన్నికల్లో ఫ్రాన్స్ ఛాందస మితవాద పార్టీలు మునుపెన్నడూ లేనంతటి విజయం సాధించడం మరో విశేషం. రెండు నెలల క్రితమే అధ్యక్ష ఎన్నికల్లో మెక్రాన్ చేతిలో ఓడిపోయిన మహిళా నేత మెరైన్ లీ పెన్ సారథ్యంలోని ఆ కూటమి 8 నుంచి 89 స్థానాలకు ఎగబాకింది. అలాగే, ఫ్రాన్స్‌లో చీలికలు పేలికలుగా ఉన్న లెఫ్ట్ పార్టీలు ఈసారి అగ్గిబరాటా లాంటి సీనియర్ వామపక్షీయుడు జీన్ లుచ్ మెలెన్ఛాన్ నేతృత్వంలో ‘న్యూప్స్’ పేరిట కొత్త కూటమిగా ఏర్పడి, సత్తా చాటాయి. 2017లో ఈ పార్టీలన్నీ విడివిడిగా గెలి చినవాటికి రెట్టింపు పైనే సీట్లు సాధించి, 131 స్థానాలతో ప్రధాన ప్రతిపక్షం కావడం అనూహ్యం. తాజా ఎన్నికల ఓటమిలో మెక్రాన్ పక్షం తప్పులూ చాలా ఉన్నాయి. ఏప్రిల్‌లో అధ్యక్ష ఎన్నికల విజయంతో వచ్చిన ఉత్సాహం మీదే ప్రధానంగా ఆ కూటమి ఆధారపడింది. ఈసారీ గెలుస్తాం లెమ్మనే అర్థంపర్థం లేని భరోసా పెట్టుకుంది. నిస్తేజంగా ప్రచారం నడిపింది. దాని పర్యవసానమే తాజా ఫలితాలు. అలాగే, ఒక్కతాటి మీదకు వచ్చిన వామపక్షాలను పెద్ద బూచిగా చూపిస్తూ, మెక్రాన్ తెలివితక్కువగా వ్యవహరించారు. అది సంప్రదాయవాదుల పట్ల వ్యతిరేకతకు గండికొట్టింది. చివరకు అటుపోయి, ఇటుపోయి సంప్రదాయవాద కూటమికే కలిసొచ్చింది. సభలో మెజారిటీ మెక్రాన్‌కు అందని మ్రానిపండయింది. ఈ రెండోసారి అధ్యక్ష పదవీకాలంలో ఆయన మునుపటి కన్నా భిన్నంగా వ్యవహరించక తప్పని పరిస్థితి వచ్చిపడింది. 2017లో తొలిసారి ఫ్రాన్స్ అధ్యక్ష పీఠమెక్కిన మెక్రాన్ కొన్నిసార్లు సర్వం సహాధిపతిలా వ్యవహరించారు. రాజకీయంగా అంతా తానే అన్నట్టు ప్రవర్తించారు. ఫలితంగా, ఆయనకు దూరమైన ఓటర్లు తాజా పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన రెక్కలు కత్తిరించారనుకోవాలి. ఇప్పుడిక రానున్న అయిదేళ్ళ అధ్యక్ష పదవీ కాలంలో మెక్రాన్ తాను అనుకున్నట్టు పాలన సాగించాలంటే, కొత్త మిత్రపక్షాలను కూడదీసుకోక తప్పదు. ఆ క్రమంగా అనేక అంశాలపై రాజీలూ పడక తప్పదు. పదవీ విరమణ వయస్సును పెంచడం, సంక్షేమ సంస్కరణల్ని ప్రవేశపెట్టడం లాంటి మెక్రాన్ ఆలోచనలు ఏమవుతాయో ఇప్పుడే చెప్పలేం. ఆ ప్రతిపాదనలకు ఇతర పార్టీల సభ్యుల మద్దతును ఏ మేరకు ఆకర్షించగలుగుతారన్నది చూడాలి. నిన్నటి దాకా రబ్బరు స్టాంపు అనుకున్న నేషనల్ అసెంబ్లీ రాత్రికి రాత్రి కీలకంగా మారడం ఫ్రెంచ్ ప్రజాస్వామ్యానికి మంచిదే. అయితే, ఉక్రెయిన్‌లో యుద్ధం, పర్యావరణ ఆత్యయిక పరిస్థితుల లాంటి అనేక సవాళ్ళపై తక్షణం చర్యలు చేపట్టాల్సిన తరుణంలో పార్లమెంటులో మెజారిటీ లేక పాలన కుంటుపడితే కష్టమే. మొత్తానికి, నేషనల్ అసెంబ్లీ ఫలితాలతో ఫ్రాన్స్‌లో కొత్త కథ మొదలైంది. మరో వారంలో కొత్త పార్లమెంట్ తొలిసారి కొలువు తీరగానే జీవన వ్యయానికి సంబంధించిన బిల్లుతో ఆట ఆరంభమవు తుంది. పార్లమెంట్లో అవసరమైన మెజారిటీ కన్నా కనీసం 44 సీట్లు తక్కువున్న మెక్రాన్ సర్కార్ ఏ బిల్లుకు ఆమోదముద్ర వేయించాలన్నా ప్రతిపక్షాలపై ఆధారపడక తప్పదు. ఇలా పార్లమెంట్లో ఆయనకు ప్రతిరోజూ అగ్నిపరీక్షే! ఫ్రాన్స్‌లో విదేశాంగ విధానమంతా అధ్యక్షుడి వ్యవహారమే కానీ, ఖండాంతర దౌత్యవేత్తగా పేరు తెచ్చుకున్న మెక్రాన్ ప్రస్తుత పరిస్థితుల్లో విదేశాంగ విధానం పక్కనబెట్టి, తన పదవీ కాలమంతా దేశీయ అజెండా పైనే దృష్టి సారించక తప్పదు. అంతర్జాతీయ స్థాయిలోనే కాదు, కనీసం ఐరోపా స్థాయిలోనూ ఆయన మునుపటిలా రాజకీయ విన్యాసాలు చేయలేకపోవచ్చు. ఇదంతా ఐరోపా రాజకీయ వ్యవహారాలపై ప్రభావం చూపవచ్చు. వెరసి, ఇటు మెక్రాన్‌కూ, అటు ఫ్రాన్స్ పార్లమెంట్‌కూ గతుకుల బాటలో పయనం తప్పదు. అయితే, జాతీయ ప్రయోజనాలే ధ్యేయంగా ఆ ప్రయాణం సాగితే ప్రజాస్వామ్యానికి మంచిది. -
అధికారం మళ్లీ కిషిడా కైవసం !
టోక్కో: జపాన్‌లో పార్లమెంట్ ఎన్నికల్లో అధికార లిబరల్ డెమొక్రటిక్ పార్టీ కూటమి మెజారిటీ సీట్లను గెలుచుకుంది. 465 సీట్లున్న పార్లమెంట్ దిగువసభలో లిబరల్ డెమొక్రటిక్ పార్టీ, దాని కూటమి పార్టీ కొమియిటో కలిపి సంయుక్తంగా 293 పైగా సీట్లను సాధించాయని వార్తలొచ్చాయి. దిగువసభలో కనీస మెజారిటీ సాధించాలంటే 233 సీట్లు అవసరంకాగా ఈ కూటమి అంతకుమించిన సీట్లను కైవసం చేసుకోవడం విశేషం. అయితే, అధికారికంగా ఇంకా తుది ఫలితాలు వెల్లడికాలేదు. ఎన్నికలకు ముందునాటి మంత్రివర్గాన్నే ఇకపైనా కొనసాగిస్తానని కిషిడా చెప్పారు. కోవిడ్ కట్టడి, కీలకమైన ఆర్థిక సంస్కరణలే ప్రధానాంశాలుగా ఈసారి ఎన్నికలు జరిగాయి. యొషిమిడి సుగా తర్వాత ప్రధానిగా అధికార పగ్గాలు చేపట్టిన కిషిడా 10 రోజుల్లోనే దిగువ సభను రద్దుచేశారు. అధికార పార్టీ నాయకత్వం కోసం నిర్వహించిన ‘అంతర్గత ఎన్నిక’ల్లో విజయం సాధించారు. ఆ తర్వాత పార్లమెంటరీ ఎన్నికలకు వెళ్లారు. ఆదివారం ముగిసిన ఎన్నికల్లోనూ తమ కూటమిని విజయతీరాలకు చేర్చారు. -
న్యూజిలాండ్‌లో లేబర్ పార్టీ గెలుపు
ఆక్లాండ్: న్యూజిలాండ్ పార్లమెంట్ ఎన్నికల్లో అధికార లిబరల్ లేబర్ పార్టీ ఘనవిజయం సాధించింది. లెక్కించిన ఓట్లలో లేబర్ పార్టీకి దాదాపు 49 శాతం ఓట్లు లభించగా, ప్రధాన ప్రతిపక్షం నేషనల్ పార్టీకి 27 శాతం ఓట్లు వచ్చాయి. దీంతో ప్రస్తుత ప్రధాని జెసిండా అర్డెర్న్ మళ్లీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. న్యూజిలాండ్ ఎన్నికల్లో ఒక పార్టీకి ఇంతలా ఘనవిజయం దక్కడం దాదాపు ఐదు దశాబ్దాల్లో ఇదే తొలిసారని జెసిండా వ్యాఖ్యానించారు. ఆ దేశంలో ప్రపోర్షనల్ ఓటింగ్ విధానం ఉంది. ఈ విధానం ప్రవేశపెట్టిన తర్వాత ఒక పార్టీకే పూర్తి మెజార్టీ రావడం ఇదే తొలిసారి. ఎన్నికల ఫలితాలు అస్థిరతను తొలగించేలా ఉన్నాయని జెసిండా అన్నారు. న్యూజిలాండ్‌లో ఎన్నికల ప్రచారం ఆరంభమైన్పటినుంచే జెసిండా హవా పూర్తిగా కొనసాగుతూ వచ్చింది. ఆమె ఎక్కడ ప్రచారానికి వెళ్లినా జననీరాజనాలు కనిపించాయి. ముఖ్యంగా దేశాన్ని కరోనా రహితంగా మార్చడంలో ఆమె కృషికి ప్రజల నుంచి మంచి మద్దతు లభించింది. 2017లో సంకీర్ణ ప్రభుత్వానికి సారధిగా జెసిండా బాధ్యతలు స్వీకరించారు. దేశంలో గతేడాది జరిగిన మసీదులపై దాడుల వేళ ఆమె సమర్ధవంతంగా వ్యవహరించి అందరి మన్ననలు పొందారు. అలాగే దేశంలో సెమీ ఆటోమేటిక్ ఆయుధాల్లో ప్రమాదకర రకాలను నిషేధించారు. -
కాంగ్రెస్ కూటమిలోకి కమల్ పార్టీ?
సాక్షి, చెన్నై: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమిలో చేరేందుకు మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్ సానుకూల సంకేతాలు ఇచ్చారని తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ తెలిపారు. సోమవారం చెన్నైలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే డీఎంకే, కాంగ్రెస్ పొత్తు ఖరారు కాగా టీటీవీ దినకరన్ నేతృత్వంలోని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం, రాందాసు నేతృత్వంలోని పీఎంకే, తిరుమావళవన్ నేతృత్వంలోని వీసీకే తమతో కలిసి వచ్చేందుకు సిద్ధంకాగా, కమల్ మొగ్గు చూపుతున్నారని వెల్లడించారు. -
ఎన్నికలను బహిష్కరించాలి
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పార్లమెంటరీ ఎన్నికలను బహిష్కరించి నూతన ప్రజాస్వామిక విప్లవ రాజకీయాల్లో ప్రజలను సమీకరణం చేయాలని విరసం నేత వరవరరావు పిలుపునిచ్చారు. పార్లమెంటరీ ఎన్నికల ద్వారా అణగారిన వర్గాలకు ఒనగూరేదేమీలేదని చెప్పారు. 2019 ఎన్నికలు ఫాసిజానికి పరిష్కారం చూపుతాయని పేర్కొన్నారు. ఆదివారం రాత్రి మహబూబ్‌నగర్‌లో విరసం రాష్ట్ర మహాసభల ముగింపుసభలో ఆయన మాట్లాడారు. ప్రపంచంలో ఎక్కడ కూడా పార్లమెంటరీ ఎన్నికల వల్ల విధ్వంసంతో కూడిన దోపిడే తప్ప పేదలకు ఒనగూరిందేమీ లేదన్నారు. దేశంలో నరేంద్రమోదీతో మొదలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరకు అందరిదీ ఒకే విధానమని చెప్పారు. పార్లమెంటరీ ఎన్నికల ద్వారా ప్రజలను కులం పేరుతో చీల్చి, మతం పేరుతో కలుపుతున్నారని పేర్కొన్నారు. బ్రాహ్మణ భావజాలం దేశానికి ఎంత శత్రువో.. పార్లమెంటరీ రాజకీయాలూ అంతే శత్రువులన్నారు. పార్లమెంటరీ పద్ధతిలో ఎన్నికైన నెహ్రూతో మొదలుకుని ఇందిరాగాంధీ, రాజీవ్ తదితరులంతా చేసిందేమిటని ప్రశ్నించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో భాగంగా 3 వేల మంది కమ్యూనిస్టులను పొట్టన బెట్టుకున్నారని, అదే సమయంలో రజాకార్ల పేరుతో 40 వేల మంది ముస్లింలను ఊచకోత కోశారని పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ రాజకీయాలకు నక్సల్బరీ ఒక్కటే మార్గం కాదని వరవరరావు పేర్కొన్నారు. 1930లో మార్క్సిజం ఎలాగైతే ఫాసిజాన్ని ఓడించిందో అలాంటి సమీక్ష జరగాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. గొప్ప విప్లవం దేశంలో మళ్లీ వస్తుందని ఆయన ఆకాంక్షించారు. ప్రస్తుతం నల్లమలలో విప్లవకారులు లేకపోవచ్చు.. ఖాళీ అయిన నల్లమల విప్లవం భవిష్యత్‌లో వస్తోందన్నారు. విరసం అంటరానితనం అయ్యిందని, ఎన్కౌంటర్ల పేరుతో రాజ్యహింసకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ముంబైలో ఏడుగురిని బందీ చేశారని, వారిపై మావోయి స్టు ముద్రవేసి హతం చేసేందుకు రాజ్యం కుట్ర చేస్తోందని వరవరరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఇకనైనా వారి అరెస్టును వెంటనే ప్రకటించాలని, వారి ప్రాణాలకు హాని తలపెట్టవద్దని ఆయన కోరారు. పాలకులు భయపడుతున్నారు: ప్రొఫెసర్ హరగోపాల్ సభలు, సమావేశాలు జరుపుతామంటే పాలకులు భయపడుతూనే ప్రజలను భయపెట్టిస్తున్నారని ప్రొఫెసర్ హరగోపాల్ వ్యాఖ్యానించారు. దేశం మొత్తంలో పాలక, ప్రతిపక్షాలన్నీ కూడా భయంతో సతమతమవుతున్నాయని చెప్పారు. ఈడీ, సీబీఐ, సిట్ ఇలా తమ మీద ఎలాంటి ఆరోపణలు వస్తాయో.. ఎప్పుడు జైలుకు వెళ్తామోననే ఆందోళనలో ఉన్నారని వ్యాఖ్యానించారు. 60 ఏళ్ల తెలంగాణ రాష్ట్రం కల నెరవేరిన మరుసటి రోజు నుంచే సభలపై ఉక్కుపాదం మోపుతుందన్నారు. భయానక పరిస్థితుల్లో కూడా మాట్లాడగలిగే సాహసం చేసేది ఒక్క విరసం మాత్రమేనన్నది గుర్తుం చుకోవాలన్నారు. ప్రస్తుతం దేశభక్తి అంటే రామభక్తిగా మారిందని.. రాముడిని కొలవకపోతే దేశద్రోహం చేసినట్లుగా చిత్రీకరిస్తున్నారని విరసం నేత కల్యాణ రావు దుయ్యబట్టారు. దేశంలో బ్రాహ్మణీయ ఫాసిజం పెరుగుతుందని, దీనికి వ్యతిరేకంగా అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉందని నాగపూర్‌కు చెందిన వీరసాథెదార్ అన్నారు. విరసం రాష్ట్ర కార్యదర్శిగా పాణి విరసం రాష్ట్ర కార్యదర్శిగా పాణిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర మహాసభల్లో ముగింపు సందర్భంగా ఆదివారం ఈ ప్రకటన చేశారు. విరసం సభ్యులు వరలక్ష్మి, కాశీం, రాంకి, అరసవెల్లి కృష్ణ, జగన్, చిన్నయ్య, బాసిత్, రివేరా, క్రాంతి, వెంకన్న, రాము, గీతాంజలి, ఉదయబాను, ఉజ్వల్, కిరణ్ తదితరులు ఏకగ్రీవంగా పాణిని ఎన్నుకున్నారు. -
నిజమేనా?
♦ వచ్చేనెలలో రజనీకాంత్ పార్టీ ♦ పేరు, పతాకం, చిహ్నం, మేనిఫెస్టోలకు కసరత్తు ♦ చెన్నైలో భారీ మహానాడు... ♦ ఓ అభిమాని వెల్లడి ‘ఇదిగో వస్తున్నాడు.. అదిగో వస్తున్నాడు.. పార్టీని ప్రకటించేస్తున్నాడు..’ తమిళనాడు సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై రెండు దశాబ్దాలకాలంగా రాష్ట్రంలో ఇదే ప్రచారం. వచ్చే నెలలో అభిమానులు ఏర్పాటుచేసే భారీ మహానాడులో రజనీకాంత్ పార్టీని ప్రకటిస్తారని ఆయన అభిమాని తాజాగా మరో సమాచారం మీడియా చెవినవేశాడు. సాక్షి ప్రతినిధి, చెన్నై: రాజకీయ ప్రవేశం ఖాయమన్నట్లుగా ఈ ఏడాది మేలో మూడు రోజులపాటూ అభిమానులతో నిర్వహించిన సమావేశంలో రజనీ సంకేతాలు ఇచ్చారు. ఇది రాష్ట్రంలో భారీస్థాయిలో చర్చకు దారితీసింది. కొందరు వ్యతిరేకించగా, మరికొందరు అనుకూలంగా మాట్లాడారు. రజనీకాంత్ రాజకీయాలు మాట్లాడడం కొత్తేమీ కాదు. సుమారు 20 ఏళ్ల క్రితం అసెంబ్లీ ఎన్నికల సమయంలో డీఎంకేకి అనుకూలంగా మాట్లాడి భారీ విజయానికి కారకుడైనారు. అయితే ఆనాటి వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో దుమారం రేగడంతో కొంతకాలం మిన్నకుండిపోయారు. అయినా, అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు వచ్చినపుడల్లా రజనీ కోసం పార్టీలు పట్టుబట్టడం, సున్నితంగా ఆయన తిరస్కరించడం పరిపాటిగా మారింది. రజనీ అభిమాని ప్రకటన తాజాగా రజనీ అభిమాని ఒకరు వచ్చేనెలలోనే రజనీ రాజకీయ ప్రకటన అంటూ మీడియా ముందుకు వచ్చారు. ఆయన వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. ‘‘ప్రస్తుతం రజనీ చేతుల్లో 2ఓ, కాలా అనే రెండు సినిమాలు ఉన్నాయి. 2 ఓ పూర్తయింది, కాలా షూటింగ్ ఈనెలాఖరులో ముగుస్తుంది. వీటి నుంచి బయటపడగానే వచ్చే నెలలో పార్టీ పనులపై రజనీ దృష్టి సారిస్తారు. రజనీకి అత్యంత సన్నిహితులు పార్టీ పేరు, పతాకం, చిహ్నం, మేనిఫెస్టో తయారు చేసే పనుల్లో తలమునకలై ఉన్నారు. వచ్చే నెలలో చెన్నైలో అభిమానులు నిర్వహించే భారీ మహానాడులో పార్టీ గురించి రజనీకాంత్ ప్రకటిస్తారు. పార్టీ పేరును, పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ఒకవేళ వచ్చే నెలలో సాధ్యం కాని పక్షంలో అభిమానులతో మరోసారి సమావేశం అవుతారు. డిసెంబరు 12వ తేదీన జన్మదిన వేడుకలు లేదా జనవరిలో 2ఓ సినిమా విడుదల తరువాత పార్టీని ప్రకటించడం ఖాయం’’అని ఆయన అన్నారు. రజనీ రాజకీయాలపై మరో అపప్రద కూడా ఉంది. రజనీ ఇక రాజకీయాల్లోకి వెళ్లిపోతున్నాడు, ఇదే చివరి చిత్రం అనే తీరులో తన చిత్రాల విడుదలకు ముందు భారీ పబ్లిసిటీ కోసం ఇలాంటి ప్రచారానికి రజనీ పూనుకుంటాడని వ్యాఖ్యానాలు కూడా ఉన్నాయి. అభిమాని చెప్పిన మాటలు నిజమేనా అనేందుకు మరికొంతకాలం వేచిచూడక తప్పదు. జయ మరణం తరువాత.. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తరువాత రజనీ ధోరణిలో మార్పు వచ్చింది. రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ శూన్యతను పూడ్చాలనే భావన పెరిగింది. అందుకే అభిమానులతో ‘ట్రయల్’ సమావేశాలు నిర్వహించి రాష్ట్ర ప్రజల, పార్టీల స్పందనను తెలుసుకున్నారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చేనా అనే సందేహం ఉన్నా, దాదాపు ఖాయమనే ప్రచారమే గట్టిగా వినిపిస్తోంది. రజనీకాంత్ ఈ విషయంపై నోరు మెదపకున్నా ఆయన స్నేహితుడు రాజ్‌బహదూర్, సోదరుడు సత్యనారాయణ, గాంధేయ మక్కల్ ఇయక్కం అధ్యక్షులు తమిళరువి మణియన్ ఎవరికివారు రాజకీయ అరంగేట్రం ఖాయమని అనేకసార్లు మీడియా వద్ద ప్రకటించారు. ఈ ఏడాది డిసెంబరు 12వ తేదీన రజనీ జన్మదినం.. అదే రోజున పార్టీ ఆవిర్భావ ప్రకటన ఉంటుందని వారు ప్రకటించేశారు. -
ఓట్ల పండుగ!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఓటరన్నకు పండుగొచ్చింది. నాయకులకు చిక్కొచ్చింది. ఒకేసారి తరుముకొచ్చిన ఎన్నికలతో ఓటర్లు ఉబ్బితబ్బిబవుతోండగా.. రాజకీయపక్షాలు మాత్రం ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. సార్వత్రిక పోరుకు సన్నద్ధమవుతున్న తరుణంలో ముంచుకొచ్చిన మున్సి‘పోల్’తో సతమతమవుతున్న వారిని ‘ప్రాదేశిక’ పోరు ఆందోళనకు గురిచేస్తోంది. మండ ల, జిల్లా పరిషత్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసిన నేపథ్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ సమరానికి సోమవారం ముహూర్తం ఖరారు కానుంది. దీంతో ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించిన అసెంబ్లీ, పార్లమెంటు, మున్సిపాలిటీ ఎన్నికల్లో పైచేయి సాధించేందుకు వ్యూహరచన చేస్తున్న నేతలకు స్థానిక సంస్థల ఎన్నికలు గుదిబండగా మారాయి. గ్రామ స్థాయిలో పట్టు నిలుపుకోవడానికి వీటిని రాజకీయపక్షాలు ప్రతిష్టాత్మకంగా భావిస్తాయి. పంచాయతీ పాలనలో కీలక భూమిక పోషించే మండల, జెడ్పీల్లో పాగా వేసేందుకు సర్వశక్తులొడ్డుతాయి. అయితే, ఇప్పుడు దృష్టి అంతా సాధారణ ఎన్నికలపై కేంద్రీకృతం చేసిన తరుణంలో.. ఈ ఎన్నికలకు తెరలేవడం ఆశావహులకు ఆవేదన కలిగిస్తోంది. స్థానికం.. ‘సార్వత్రిక’కు కీలకం స్థానిక సంస్థల్లో వెలువడే తీర్పు సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు సంకేతం కానుంది. ఈ నేపథ్యంలో స్థానిక పోరులో ఆధిక్యతను చాటుకోవడం సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఆశావహులకు అగ్నిపరీక్షగా మారింది. దాదాపు రెండు నెలలపాటు పార్టీ శ్రేణులను సమన్వయ పరచడం ఆర్థికంగా పెనుభారం కానుంది. ఏప్రిల్ 30న జరిగే సాధారణ ఎన్నికల నాటికీ ద్వితీయ శ్రేణి నాయకులను ఏకతాటి మీద నడపడం తలనొప్పిగా మారనుంది. మున్సిపాలిటీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో తలపడే అభ్యర్థుల మధ్య చోటుచేసుకునే వివాదాలు కూడా తమ గె లుపును ప్రభావితం చేసే అవకాశముండడం వారిని కలవరపరుస్తోంది. అంతేకాకుండా సొంతిం టిని చక్కదిద్దుకోవడం కత్తిమీద సాముగా మారనుంది. గ్రామస్థాయి ఎన్నికలు కావడంతో సొంతపార్టీలోనే పోటీ తీవ్రంగా ఉంటుంది. పలు చోట్ల ఒకే పార్టీకి చెందిన అభ్యర్థులు బరిలో ఉంటారు. వీరిని బుజ్జగించి దారిలోకి తెస్తే సరేసరి. లేనిపక్షంలో ఎమ్మెల్యే ఎన్నికలపై వీరి గ్రూపుల ప్రభావం కనిపించడం ఖాయం. ఇది రాజకీయపక్షాలను ఆందోళన కలిగిస్తోంది. అంతేకాకుండా పొత్తులు ఖరారు కాకపోయినప్పటికీ, భవిష్యత్తులో జతకట్టాలనుకుంటున్న పార్టీలకు స్థానిక సమరం చిరాకును తెప్పిస్తోంది. భావసారూప్యత ఉన్న పార్టీల అభ్యర్థులే ప్రత్యర్థులుగా తలపడితే వచ్చే ఎన్నికల్లో దీని ప్రభావం పార్టీపై ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలావుండగా.. తమ గెలుపోటములను ప్రభావితంచేసే ఈ ఎన్నికలను ఆశావహులు కీల కంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీటీసీలు మొదలు జెడ్పీటీసీ, కౌన్సిలర్ల, చైర్ పర్సన్లను గెలిపించుకునే దిశలో జేబులు ఖాళీకావడం ఖాయం గా కనిపిస్తోంది. మరోైవె పు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాల్సి రావడం జిల్లా యంత్రాంగానికి కూడా తలకుమించిన భారంగా మారింది. సాధార ణ ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమైన యంత్రాంగం హఠాత్తుగా వచ్చిన పురపోరుతో సతమతవుతుండ గా.. తాజాగా ప్రాదేశిక ఎన్నికలు కూడా తన్నుకొస్తుండడంతో దిక్కుతోచని పరిస్థితిలో పడింది.