సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఓటరన్నకు పండుగొచ్చింది. నాయకులకు చిక్కొచ్చింది. ఒకేసారి తరుముకొచ్చిన ఎన్నికలతో ఓటర్లు ఉబ్బితబ్బిబవుతోండగా.. రాజకీయపక్షాలు మాత్రం ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. సార్వత్రిక పోరుకు సన్నద్ధమవుతున్న తరుణంలో ముంచుకొచ్చిన మున్సి‘పోల్’తో సతమతమవుతున్న వారిని ‘ప్రాదేశిక’ పోరు ఆందోళనకు గురిచేస్తోంది. మండ ల, జిల్లా పరిషత్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసిన నేపథ్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ సమరానికి సోమవారం ముహూర్తం ఖరారు కానుంది.
దీంతో ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించిన అసెంబ్లీ, పార్లమెంటు, మున్సిపాలిటీ ఎన్నికల్లో పైచేయి సాధించేందుకు వ్యూహరచన చేస్తున్న నేతలకు స్థానిక సంస్థల ఎన్నికలు గుదిబండగా మారాయి. గ్రామ స్థాయిలో పట్టు నిలుపుకోవడానికి వీటిని రాజకీయపక్షాలు ప్రతిష్టాత్మకంగా భావిస్తాయి. పంచాయతీ పాలనలో కీలక భూమిక పోషించే మండల, జెడ్పీల్లో పాగా వేసేందుకు సర్వశక్తులొడ్డుతాయి. అయితే, ఇప్పుడు దృష్టి అంతా సాధారణ ఎన్నికలపై కేంద్రీకృతం చేసిన తరుణంలో.. ఈ ఎన్నికలకు తెరలేవడం ఆశావహులకు ఆవేదన కలిగిస్తోంది.
స్థానికం.. ‘సార్వత్రిక’కు కీలకం
స్థానిక సంస్థల్లో వెలువడే తీర్పు సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు సంకేతం కానుంది. ఈ నేపథ్యంలో స్థానిక పోరులో ఆధిక్యతను చాటుకోవడం సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఆశావహులకు అగ్నిపరీక్షగా మారింది. దాదాపు రెండు నెలలపాటు పార్టీ శ్రేణులను సమన్వయ పరచడం ఆర్థికంగా పెనుభారం కానుంది. ఏప్రిల్ 30న జరిగే సాధారణ ఎన్నికల నాటికీ ద్వితీయ శ్రేణి నాయకులను ఏకతాటి మీద నడపడం తలనొప్పిగా మారనుంది. మున్సిపాలిటీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో తలపడే అభ్యర్థుల మధ్య చోటుచేసుకునే వివాదాలు కూడా తమ గె లుపును ప్రభావితం చేసే అవకాశముండడం వారిని కలవరపరుస్తోంది.
అంతేకాకుండా సొంతిం టిని చక్కదిద్దుకోవడం కత్తిమీద సాముగా మారనుంది. గ్రామస్థాయి ఎన్నికలు కావడంతో సొంతపార్టీలోనే పోటీ తీవ్రంగా ఉంటుంది. పలు చోట్ల ఒకే పార్టీకి చెందిన అభ్యర్థులు బరిలో ఉంటారు. వీరిని బుజ్జగించి దారిలోకి తెస్తే సరేసరి. లేనిపక్షంలో ఎమ్మెల్యే ఎన్నికలపై వీరి గ్రూపుల ప్రభావం కనిపించడం ఖాయం. ఇది రాజకీయపక్షాలను ఆందోళన కలిగిస్తోంది. అంతేకాకుండా పొత్తులు ఖరారు కాకపోయినప్పటికీ, భవిష్యత్తులో జతకట్టాలనుకుంటున్న పార్టీలకు స్థానిక సమరం చిరాకును తెప్పిస్తోంది. భావసారూప్యత ఉన్న పార్టీల అభ్యర్థులే ప్రత్యర్థులుగా తలపడితే వచ్చే ఎన్నికల్లో దీని ప్రభావం పార్టీపై ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలావుండగా.. తమ గెలుపోటములను ప్రభావితంచేసే ఈ ఎన్నికలను ఆశావహులు కీల కంగా భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఎంపీటీసీలు మొదలు జెడ్పీటీసీ, కౌన్సిలర్ల, చైర్ పర్సన్లను గెలిపించుకునే దిశలో జేబులు ఖాళీకావడం ఖాయం గా కనిపిస్తోంది. మరోైవె పు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాల్సి రావడం జిల్లా యంత్రాంగానికి కూడా తలకుమించిన భారంగా మారింది. సాధార ణ ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమైన యంత్రాంగం హఠాత్తుగా వచ్చిన పురపోరుతో సతమతవుతుండ గా.. తాజాగా ప్రాదేశిక ఎన్నికలు కూడా తన్నుకొస్తుండడంతో దిక్కుతోచని పరిస్థితిలో పడింది.
ఓట్ల పండుగ!
Published Fri, Mar 7 2014 11:56 PM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement
Advertisement