సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇక తెర వెనుక రాజకీయాలకే పరిమితం కానున్నారు. జిల్లా రాజకీయాల్లో దశాబ్ధకాలంపైగా చక్రం తిప్పిన సబితమ్మ ప్రత్యక్ష రాజకీయాలకు దూరమవుతున్నారు. కుటుంబ సభ్యుల్లో ఒకరికే పార్టీ టికెట్ ఇవ్వాలనే అధిష్టాన నిర్ణయంతో రాజకీయాల నుంచి తాత్కాలికంగా విరామం తీసుకోవాల్సిన పరిస్థితి అనివార్యమైంది. తన రాజకీయ వారసుడిగా తనయుడు కార్తీక్‌రెడ్డిని చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దించాలని నిర్ణయించారు. ఒక కుటుంబంలో ఒకే సీటు కేటాయిస్తామని పార్టీ హైకమాండ్ ఇదివరకే స్పష్టంగా చెప్పినా తనకు రాజేంద్రనగర్ అసెంబ్లీ సీటు, కుమారుడు కార్తీక్‌రెడ్డికి పార్లమెంటు స్థానం కోసం సబిత చివరి క్షణం వరకూ ప్రయత్నించారు. అయినా హైకమాండ్ వెనక్కి తగ్గకపోవడంతో తన స్థానాన్ని త్యాగంచేసి కుమారుడికి పార్లమెంటు సీటు ఇప్పించుకున్నారు.
పుత్రుడి రాజకీయ భవిష్యత్తు కోసం తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు అధిష్టానానికి తెలియజేయడంతో కార్తీక్‌కు పార్టీ టికెట్ కేటాయించి సబిత పేరును జాబితా నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. 2000 సంవత్సరంలో భర్త ఇంద్రారెడ్డి హఠాన్మరణంతో రాజకీయ అరంగ్రేటం చేసిన సబితారెడ్డి విజయవంతమైన ప్రస్థానం సాగించారు. ఓటమెరుగని నేతగా గుర్తింపు పొందడమేకాకుండా స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆత్మీయ సోదరిగా మెలిగారు. ఆయన మంత్రివర్గంలో కీలక శాఖలు చేపట్టిన ఆమె.. దేశంలోనే తొలి మహిళా హోంమంత్రిగా రికార్డుకెక్కారు. ఇదిలా ఉంటే సబిత ప్రాతినిధ్యం వహిస్తున్న మహేశ్వరం స్థానం పొత్తులో భాగంగా సీపీఐ ఖాతాలో పడింది. ఇది ఆమె రాజకీయ భవితవ్యంపై ప్రభావం చూపుతోంది.
సబితమ్మకు విరామం!
Published Wed, Apr 9 2014 12:25 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement