kartik reddy
-
‘పాలమూరు’తో సస్యశ్యామలం
సాక్షి, శంషాబాద్: ‘ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎమ్మెల్యే సబితారెడ్డి కలిసినప్పుడు కాళేశ్వరం అద్భుతంగా పూర్తిచేస్తున్నారు.. రంగారెడ్డి జిల్లా ప్రజలకు కూడా త్వరగా సాగునీరందించాలని కోరగా.. మరో రెండేళ్లోనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాకు సాగునీరందుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు’ అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. మాజీ మంత్రి సబితారెడ్డి తనయుడు కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరిన సందర్భంగా మంగళరాత్రి శంషాబాద్ పట్టణంలో జరిగిన బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడారు. జిల్లాలో లక్ష ఎకరాలకు పైగానే సాగునీరందించేందుకు పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయన్నారు. జీవో 111 కూడా పర్యావరణ హితంగా నిర్ణయం తీసుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధంగా ఉన్నారన్నారు. అందుకు అనుగుణంగా జీవో అమలులో ఉన్న గ్రామాల నుంచి తీర్మానాలను తీసుకోవాల్సిందిగా ఇటీవల ముఖ్యమంత్రే స్వయంగా చేవెళ్ల, రాజేంద్రనగర్ ఎమ్మెల్యేలకు సూచించారన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని బుద్వెల్, కిస్మత్పూర్ గ్రామాల మధ్య ఏర్పాటు చేయబోయే ఐటీ క్లస్టర్ శేరిలింగంపల్లిని మించిపోనుందని ఆయన చెప్పారు. ఎమ్మెల్యే సబితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మహేశ్వరం నియోజకవర్గ పరిధిలో కూడా ఫార్మాసిటీతో పాటు ఎలక్ట్రానిక్ పరిశ్రమలతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలున్నాయన్నారు. శంషాబాద్‌లోని కొత్వాల్‌గూడలో నైట్ సఫారీ ఏర్పాటు చేసేందుకు సీఎం యోచిస్తున్నారని కేటీఆర్ వెల్లడించారు. కడుపులో పెట్టుకోవాలే.. కొత్తగా చేరిన వారిని కడుపులో పెట్టుకుని సమన్వయంతో పనిచేయాలని కేటీఆర్ సూచించారు. కార్తీక్‌రెడ్డి రాకతో టీఆర్ఎస్ మరింత బలోపేతంగా మారిందన్నారు. చేవెళ్లలో అభ్యర్థి ఎవరైనా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజల ఆకాంక్ష మేరకే.. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా నేతలు నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని కాంగ్రెస్ నేత కార్తీక్‌రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లాలో ప్రజలు టీఆర్ఎస్కు బ్రహ్మరథం పట్టారని, ప్రజల సంక్షేమం కోసమే టీఆర్ఎస్ పార్టీలో చేరానన్నారు. నాన్న (మాజీ హోంమంత్రి ఇంద్రారెడ్డి) కాంగ్రెస్‌లో చేరిన నాడు ఆ పార్టీ చక్రాలు లేని బండి మాదిరిగా ఉండేదని, అలాంటి పార్టీని అమ్మ (ఎమ్మెల్యే సబితారెడ్డి) తాను కలిసి బలమైన శక్తిగా మార్చామన్నారు. ప్రస్తుత తరుణంలో ప్రజల సంక్షేమం కేవలం టీఆర్ఎస్తోనే సాధ్యమని నిర్ణయించుకున్నామన్నారు. పార్టీలు మారడం హేయమైన చర్యగా మాట్లాడుతున్న ఎంపీ కోండా విశ్వేశ్వర్‌రెడ్డి రాజకీయ గుర్తింపును ఇచ్చిన టీఆర్ఎస్కు ద్రోహం చేసి పార్టీ మారి వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. రెండు స్థానాల్లో అత్యధిక మెజార్టీ మల్కాజ్గిరి, చేవెళ్ల ఎంపీ నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీ సాధించి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహుమతి ఇవాల్సిన అవసరముందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. కాంగ్రెస్ దివాలా తీసిందని, బీజేపీ పువ్వు పూజకు కూడా పనికిరాకుండా పోయిందని ఎద్దేవా చేశారు. కార్తీక్‌రెడ్డి రాకతో చేవెళ్లలో టీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండమైన విజయం సాధిస్తుందని అన్నారు. బ్రహ్మరథం పడుతున్నారు టీఆర్ఎస్కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో టీఆర్ఎస్ కీలకంగా మారనుందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు పార్టీకి మంచి ఫలితాలనందించడం ఖాయమని చెప్పారు. పంచాయతీ పోయింది.. మా గురువు ఇంద్రన్న కుమారుడితో మాటికి ముందు జగడం చేసుకునే పంచాయతీ పోయిందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ అన్నారు. కార్తీక్‌రెడ్డి రాకతో అందరి కన్నా తానే ఎక్కువ సంతోస్తున్నానని, మంచి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో పనిచేస్తున్న సంతృప్తి ఎంతగానో ఉందన్నారు. రాజకీయాల్లో ఓర్పు ఎంతో అవసరమని, సమయం వచ్చినప్పుడు అంతా మంచే జరుగుతుందన్నారు. అప్పట్లో తన గురువు ఇంద్రారెడ్డి నోటి మాటగా నేను ఎమ్మెల్యే అయితనని అన్నడని, అదే జరిగిందన్నారు. బ్రహ్మాండమైన మెజార్టీ ఖాయం చేవెళ్ల పార్లమెంట్ స్థానాన్ని టీఆర్ఎస్ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవడం ఖాయమని పరిగి ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెలే కాలె యాదయ్య, వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. కార్తీక్‌రెడ్డి రాకతో టీఆర్ఎస్ మరింత బలోపేతమైందని వారు చెప్పారు. -
ప్రపంచ సుడోకు పోటీలకు కార్తీక్ రెడ్డి ఎంపిక
మెదక్(జహీరాబాద్):మెదక్ జిల్లా జహీరాబాద్‌కు చెందిన డీసీసీబీ మాజీ చైర్మన్ ఎం.జైపాల్‌రెడ్డి తనయుడు ఎం.కార్తీక్‌రెడ్డి ప్రపంచ సుడోకు పోటీలకు ఎంపికయ్యాడు. అండర్ -15 కేటగిరిలో ఈ మేరకు కార్తీక్‌రెడ్డి స్థానం పొందాడు. ఈనెల 24, 25వ తేదీల్లో చైనాలోని బీజింగ్‌లో ప్రపంచ పజిల్ ఫెడరేషన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగనున్న పోటీల్లో పాల్గొననున్నారు. కార్తీక్‌రెడ్డికి సుడోకు ఆడే విధానంపై జైపాల్‌రెడ్డి అవగాహన కల్పించారు. మూడు సంవత్సరాలుగా కార్తీక్‌రెడ్డి ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో జరిగే సుడోకు పోటీల్లో పాల్గొంటూ అనుభవం గడించాడు. 2014నవంబర్‌లో 6 ప్రధాన నగరాలలో నిర్వహించిన ప్రపంచ సుడోకు పోటీలలో జాతీయ స్థాయిలో కార్తీక్‌రెడ్డి టాప్-2లో నిలిచాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని మాదాపూర్‌లోని గ్లోబల్ ఎడ్జ్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. జైపాల్‌రెడ్డి సైతం ప్రపంచస్థాయి సుడోకు పోటీల్లో పాల్గొని తన ప్రతిభను చాటుకున్నాడు. 2008, 2010, 2013, 2014సంవత్సరాల్లో నిర్వహించిన ప్రపంచస్థాయి సుడోకు పోటీల్లో జైపాల్‌రెడ్డి పాల్గొన్నారు. కార్తీక్‌రెడ్డి సైతం ఆయన బాటలోనే నడుస్తూ ప్రతిభను చాటుకుంటున్నాడు. -
తేలనున్న మాజీ హోం తనయుల భవితవ్యం
హైదరాబాద్ : పోటాపోటీగా జరిగిన ఈ సార్వత్రిక ఎన్నికల్లో హేమాహేమీలతోపాటు రంగారెడ్డి జిల్లాలో ఇద్దరు మాజీ హోం మంత్రుల తనయుల భవితవ్యం కూడా తేలనుంది. చేవెళ్ల నుంచి మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్ రెడ్డి కాంగ్రెస్ తరపున బరిలో ఉండగా, టీడీపీ నుంచి మాజీ హోంమంత్రి దేవేందర్ గౌడ్ కొడుకు వీరేంద్ర గౌడ్ పోటీలో ఉన్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొండా రాఘవరెడ్డి, టీఆర్ఎస్ నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇక కౌంటింగ్ కేంద్రాలు ఇక్కడే... కౌంటింగ్ కేంద్రం ........... నియోజకవర్గాలు డీఆర్కే ఇంజినీరింగ్ కాలేజీ, ........... మేడ్చల్, మల్కాజిగిరి, బౌరాంపేట్, కుత్బుల్లాపూర్ ......... కుత్బుల్లాపూర్, కూకట్పల్లి సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం ....... ఉప్పల్, ఎల్బీనగర్ శ్రీ ఇందు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ......... ఇబ్రహీంపట్నం అండ్ టెక్నాలజీ, శేరిగూడ వీఎం హోం, సరూర్‌నగర్ ......... మహేశ్వరం జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియం, గచ్చిబౌలి ..... రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల, చేవెళ్ల .......... చేవెళ్ల మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ ........ వికారాబాద్, తాండూర్ -
అగ్రనేతలొస్తున్నారు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: చేవెళ్లకు సోనియా స్టార్ క్యాంపెయినర్లు లేక డీలాపడిన కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్తేజం నింపేందుకు 27న పార్టీ అధినేత్రి సోనియాగాంధీ చేవెళ్లకు రానున్నారు. ఒక రోజు పర్యటనలో భాగంగా రాష్ట్రానికి వస్తున్న ఆమె మెదక్ జిల్లా అందోల్‌లో జరిగే సభలో పాల్గొంటారు. అంతకుముందుగానీ ఆ తర్వాతగానీ చేవెళ్లలో ఏర్పాటుచేసే బహిరంగసభలో పాల్గొనేలా షెడ్యూల్‌ను ఖరారు చేసేందుకు టీపీసీసీ కసరత్తు చేస్తోంది. టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యతో భేటీ అయిన చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కార్తీక్‌రెడ్డి చేవెళ్లలో మేడమ్ పర్యటన ఉండాలని పట్టుబట్టారు. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట వ్యవహారాల ఇన్చార్జ దిగ్విజయ్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పొన్నాల చెప్పి నట్లు తెలుస్తోంది. సాధ్యమైనంత వరకు మేడమ్ పర్యటన ఉండేలా చూస్తామని, ఏర్పాట్లు చేసుకోవాలని పొన్నాల సూచించినట్లు కార్తీక్‌రెడ్డి ‘సాక్షి’ తెలిపారు. దీంతో చేవెళ్లలో జరిగే ఎన్నికల ప్రచారసభకు హాజరయ్యేలా షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ముగింపు వేళ అధినేత్రి చేసే మార్గనిర్దేశం పార్టీ శ్రేణులకు టానిక్‌లా పనిచేస్తుందని అధికార పార్టీ భావిస్తోంది. ఏడు చోట్ల కేసీఆర్ ‘షో’లు ఇదివరకే చేవెళ్ల, మల్కాజిగిరిలో పర్యటించిన టీఆర్ఎస్ సారథి కేసీఆర్ ఈ నెల 27న రెండో విడ త ఎన్నికల ప్రచారానికి జిల్లాకు రానున్నారు. హెలికాప్టర్ ద్వారా వివిధ ప్రాంతాలకు చేరుకునే కేసీఆర్.. ఆ రోజు జిల్లాలో ఏడు చోట్ల జరిగే రోడ్‌షోలలో పాల్గొంటున్నారు. తాండూరు, పరిగి, వికారాబాద్, మేడ్చల్, ఎల్బీ నగర్, ఉప్పల్, కుత్బుల్లాపూర్‌లో నిర్వహించే రోడ్‌షో/బహిరంగసభల లో కేసీఆర్ మాట్లాడనున్నారు. మంచి ఊపు మీదు గులాబీ బాస్ జిల్లాపై గంపెడాశ పెట్టుకున్నారు. తెలంగాణలో తొలి ప్రభుత్వం మాదేనని ఆశలపల్లకీలో ఉన్న కేసీఆర్.. టీడీపీ, కాంగ్రెస్ బలంగా ఉన్న రంగారెడ్డి జిల్లాపై గురి పెట్టారు.ఈ నేపథ్యంలోనే జిల్లాలో ముమ్మరంగా ప్రచారం సాగించేందుకు ప్రణాళిక ఖరారు చేశారు. బాబు ప్రచారం ఇక్కడి నుంచే.. సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని చంద్రబాబు జిల్లా నుంచే శ్రీకారం చుట్టారు. మల్కాజిగిరి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఈనెల 13న ప్రచారాన్ని ప్రారంభించిన ఆయన మరుసటి రోజు చేవెళ్ల లోక్‌సభ స్థానం పరిధిలో ఎన్నికల భేరీని మోగించారు. ఇప్పటి కే మహేశ్వరం, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, మేడ్చల్ తదితర నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించారు. మరో ఐదు రోజుల్లో ప్రచారపర్వానికి తెరపడనున్న నేపథ్యంలో కార్యకర్తల్లో జోష్ నింపేందుకు ఈ నెల 27న జిల్లా పర్యటనకు వస్తున్నారు. చేవెళ్ల, కందుకూరు (మహేశ్వరం), శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ సెగ్మెంట్లలో ఆయన ఎన్నికల ప్రచారం చేయనున్నారు. -
‘వారసుల’ పోరు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులంతా రాజకీయాల్లో కొత్త వ్యక్తులు కావడం.. రాజకీయ ఉద్దండులుగా పేరొందిన నేతల వారసులు కావడంతో పోటీ రసకందాయంలో పడింది. తెలుగుదేశం నుంచి ఆ పార్టీ సీనియర్ నేత దేవేందర్ గౌడ్ తనయుడు టి.వీరేందర్ బరిలోకి దిగారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి దివంగత ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్‌రెడ్డి పోటీ పడుతున్నారు. అటు తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున కొండా వెంకటరంగారెడ్డి వారసుడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి బరిలో నిలిచారు. రాజకీయాల్లో ఈ ముగ్గురివీ కొత్త ము ఖాలే. పోటీ చేస్తున్న ఈముగ్గురు అభ్యర్థుల నే పథ్యాన్ని ఒకసారి పరిశీలిస్తే పలు ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. వారిరువురూ అన్నాతమ్ముళ్లు.. వైఎస్సార్ కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన కొండా రాఘవరెడ్డి, టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఇరువురూ ఒకే మాజీ హోంమంత్రుల సుపుత్రులు.. తరగతిలో దోస్తులు.. తూళ్ల వీరేందర్‌గౌడ్ తండ్రి టి.దేవేందర్‌గౌడ్ మాజీ హోంమంత్రిగా పనిచేసి రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. అటు కార్తీక్‌రెడ్డి తల్లితండ్రులిద్దరూ హోంమంత్రులుగా పదవులు ఏలినవారే. అంతేకాక.. వీరేందర్, కార్తీక్‌లిద్దరూ చిన్ననాటి స్నేహితులు. ఆబిడ్స్ లిటిల్‌ఫ్లవర్ స్కూల్లో ఇద్దరిదీ ఒకే తరగతి కావడం విశేషం. తాజాగా ఈ ఇరువురూ ఒకే పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగడం విశేషం. -
సబితమ్మకు విరామం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇక తెర వెనుక రాజకీయాలకే పరిమితం కానున్నారు. జిల్లా రాజకీయాల్లో దశాబ్ధకాలంపైగా చక్రం తిప్పిన సబితమ్మ ప్రత్యక్ష రాజకీయాలకు దూరమవుతున్నారు. కుటుంబ సభ్యుల్లో ఒకరికే పార్టీ టికెట్ ఇవ్వాలనే అధిష్టాన నిర్ణయంతో రాజకీయాల నుంచి తాత్కాలికంగా విరామం తీసుకోవాల్సిన పరిస్థితి అనివార్యమైంది. తన రాజకీయ వారసుడిగా తనయుడు కార్తీక్‌రెడ్డిని చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దించాలని నిర్ణయించారు. ఒక కుటుంబంలో ఒకే సీటు కేటాయిస్తామని పార్టీ హైకమాండ్ ఇదివరకే స్పష్టంగా చెప్పినా తనకు రాజేంద్రనగర్ అసెంబ్లీ సీటు, కుమారుడు కార్తీక్‌రెడ్డికి పార్లమెంటు స్థానం కోసం సబిత చివరి క్షణం వరకూ ప్రయత్నించారు. అయినా హైకమాండ్ వెనక్కి తగ్గకపోవడంతో తన స్థానాన్ని త్యాగంచేసి కుమారుడికి పార్లమెంటు సీటు ఇప్పించుకున్నారు. పుత్రుడి రాజకీయ భవిష్యత్తు కోసం తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు అధిష్టానానికి తెలియజేయడంతో కార్తీక్‌కు పార్టీ టికెట్ కేటాయించి సబిత పేరును జాబితా నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. 2000 సంవత్సరంలో భర్త ఇంద్రారెడ్డి హఠాన్మరణంతో రాజకీయ అరంగ్రేటం చేసిన సబితారెడ్డి విజయవంతమైన ప్రస్థానం సాగించారు. ఓటమెరుగని నేతగా గుర్తింపు పొందడమేకాకుండా స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆత్మీయ సోదరిగా మెలిగారు. ఆయన మంత్రివర్గంలో కీలక శాఖలు చేపట్టిన ఆమె.. దేశంలోనే తొలి మహిళా హోంమంత్రిగా రికార్డుకెక్కారు. ఇదిలా ఉంటే సబిత ప్రాతినిధ్యం వహిస్తున్న మహేశ్వరం స్థానం పొత్తులో భాగంగా సీపీఐ ఖాతాలో పడింది. ఇది ఆమె రాజకీయ భవితవ్యంపై ప్రభావం చూపుతోంది. -
'చేవెళ్ల ఎంపీ, మహేశ్వరం ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి'
చేవెళ్ల ఎంపీ స్థానాన్ని తన కుమారుడు కార్తీక్ రెడ్డికి, మహేశ్వరం ఎమ్మెల్యే సీటును తనకు ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ ను మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి విజ్క్షప్తి చేశారు. లోకసభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే ల జాబితాపై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ వార్ రూమ్ లో కసరత్తు చేస్తోంది. సిట్టింగ్ ఎంపీలందరికి టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తున్నందున్న చేవెళ్ల ఎంపీ స్థానానికి తన కుమారుడికి టికెట్ కోసం సబితా ఇంద్రారెడ్డి తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలోని వార్ రూమ్ లో కాంగ్రెస్ పెద్దలను కలిశారు. సామాజిక న్యాయం, గెలిచే సత్తా, ప్రత్యర్థుల బలాబలాలను బట్టి అభ్యర్థుల ఎంపిక కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు చేపట్టారు. అభ్యర్థుల ఎంపికపై వార్ రూమ్ లో తెలంగాణ కాంగ్రెస్ స్ర్కీనింగ్ కమిటీ భేటి అయ్యింది. మరో నాలుగు రోజుల్లో తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
తంతు ముగిసింది!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: అభిప్రాయ సేకరణకు తెరపడింది. అభ్యర్థుల ఖరారుపై మూడు రోజులుగా కాంగ్రెస్ హైకమాండ్ దూత నిర్వహించిన కసరత్తు మంగళవారం ముగిసింది. ఆశావహుల బలప్రదర్శన.. అనుచరుల హంగామా నడుమ ఏఐసీసీ పరిశీలకుడు కోలివాడ్ అభిప్రాయ సేకరణను పూర్తి చేశారు. చివరి రోజు చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గం సహా పరిగి అసెంబ్లీ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న నేతలు.. దూత ముందు బారులు తీరారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గాంధీభవన్‌లో ప్రత్యేకంగా పరిశీలకుడితో భేటీ కాగా, మరో మాజీ మంత్రి కమతం రాంరెడ్డి పరిగి స్థానానికి తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరారు. పార్లమెంటు సీటును సిట్టింగ్ ఎంపీ జైపాల్‌రెడ్డికే ఇవ్వాలని సూచించారు. టికెట్ తనకు ఇవ్వని పక్షంలో కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి పేరును పరిగణనలోకి తీసుకోవాలని విన్నవించారు. 2009లో చివరి నిమిషంలో టికెట్ లభించకపోవడంతో రెబల్‌గా బరిలో దిగి స్వల్ప ఓట్లతో ఓడిపోయిన టి.రామ్మోహన్‌రెడ్డి కూడా పరిశీలకుడిని కలిసి తన అంతరంగాన్ని వెలిబుచ్చారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనకు మహేశ్వరం లేదా రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్నట్లు పరిశీలకుడి దృష్టికి తె చ్చారు. తనయుడు కార్తీక్‌కు చేవెళ్ల పార్లమెంటరీ సీటును కేటాయించాలని నివేదించారు. కొసమెరుపు.. ఆశావహులు కొందరు తమ సీటుకు సీనియర్లు ఎసరు పెట్టకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఎంపీ సీటు విషయానికి వచ్చే సరికి కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి పేరును సిఫార్సు చేస్తూ పరిశీలకుడికి దరఖాస్తులు సమర్పించారు. జాతీయ విపత్తు నిర్వహణ వైస్ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి కుమారుడు, పీసీసీ కార్యద ర్శి ఆదిత్య పరిశీలకుడితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఒకరిద్దరు సీనియర్ నేతలతో హోటల్లో పరిశీలకుడిని కలుసుకున్న ఆయన.. చేవెళ్ల లోక్‌సభ సీటుకు తన ను ఖరారు చేయాలని విన్నవించారు. పరిగి అసెంబ్లీ సెగ్మెంట్‌కు టికెట్ ఆశిస్తున్న రామ్మోహన్‌రెడ్డి అనుచరులు మాజీ మంత్రి కమతం రాంరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిశీలకుడిని కలిసేందుకు డీసీసీ కార్యాలయానికి వెళ్తున్న రాంరెడ్డిని చూసిన వైరివర్గం.. కమతం డౌన్ డౌన్ అంటూ నినదించింది. ఈ నియోజకవర్గం నుంచి తమ పేర్లను పరిశీలించాలని పీసీసీ కార్యదర్శి సుభాష్‌రెడ్డి, సీనియర్ నాయకులు కంకల్ వెంకటేశ్, మాజీ ఎంపీపీ భగవన్‌దాస్ ఏఐసీసీ వేగుకు విజ్ఞాపనలు సమర్పించారు. సబిత తనయుడు కార్తీక్‌రెడ్డి భారీగా మద్దతుదారులతో తరలివచ్చారు. చేవెళ్ల పార్లమెంటు స్థానానికి తన పేరును పరిశీలించాలని కోరారు. ఇటీవల తాను చేపట్టిన పాదయాత్ర వివరాలను పరిశీలకుడి దృష్టికి తెచ్చారు. -
సోనియాకు కృతజ్ఞతలు తెలిపేందుకే పాదయాత్ర
ఆలంపల్లి, న్యూస్‌లైన్: తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలిపేందుకే కార్తీక్‌రెడ్డి పాదయాత్ర చేపట్టారని.. ప్రత్యేక రాష్ట్రంలో దళిత ముఖ్యమంత్రి మాజీ మంత్రి ఎ.చంద్రశేఖరేనని ఎమ్మెల్సీ ఎం.రంగారెడ్డి అన్నారు. శనివారం కార్తీక్‌రెడ్డి తలపెట్టిన తెలంగాణ నవ నిర్మాణ పాదయాత్ర కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రంగారెడ్డి మాట్లాడుతూ.. సోనియా గాంధీ ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని.. ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఆమెకు కృతజ్ఞతలు తెలిపేందుకే కార్తీక్‌రెడ్డి పాదయాత్రను చేపట్టారని ఆయన తెలిపారు. తెలంగాణ కోసం మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ మర్రి చెన్నారెడ్డి, మాజీ హోంమంత్రి స్వర్గీయ ఇంద్రారెడ్డి, డా.ఎ.చంద్రశేఖర్‌లు తమ పదవులను త్యాగం చేసి ఉద్యమించారని గుర్తు చేశారు. ఇంద్రారెడ్డి ఆశయాల సాధనకు కార్తీక్‌రెడ్డి పూనుకోవడం ఎంతో అభినందనీయమన్నారు. కార్తీక్‌రెడ్డి జిల్లాలో మంచి నాయకునిగా ఎదగేందుకు ప్రజలు ఆశీర్వదించాని ఆయన కోరారు. మాజీ మంత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. కొన్ని రాజకీయ పార్టీలు పాదయాత్ర పట్ల మతిభ్రమించిన వ్యాఖ్యలు చేస్తున్నాయన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేశారు. అధికారంలో ఉండి కూడా 60 ఏళ్ల తెలంగాణ ప్రజల చిరకాల కోరిక అయిన ప్రత్యేక రాష్ట్రాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చిన సోనియాగాంధీకి రుణపడి ఉండాలని పిలుపు నిచ్చారు. దాహం వేపసినప్పుడు గ్లాసు నీరు ఇస్తేనే కృతజ్ఞతలు తెలుపుతాం.. అలాంటిది తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు సోనియమ్మ కాళ్లు మొక్కినా తప్పులేదన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన వెంటనే 111జీఓను ఎత్తివేస్తామని అన్నారు. ఇక్కడి ప్రజల చిరకాల కోరిక వికారాబాద్ జిల్లా కేంద్రంగా ప్రకటించడమేనని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా తెచ్చామో.. వికారాబాద్ జిల్లాను కూడా అలాగే తెస్తామని తెలిపారు. ఈ సందర్భంగా వికారాబాద్ నాయకులు కార్తీక్‌రెడ్డి, రంగారెడ్డి, చంద్రశేఖర్‌లను గజమాలతో సన్మానించారు. కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి టి.రామ్మోహన్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం.డి. హఫీజ్, మాజీ చైర్మన్ గుడిసె లక్ష్మణ్, జిల్లా లీగల్‌సెల్ మాజీ అధ్యక్షుడు గోవర్ధన్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ ైచె ర్మన్ రాంచంద్రారెడ్డి, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ చెక్కల ఎల్లయ్య, సీనియర్ నాయకులు చెట్టెపు మల్లారెడ్డి, పోలీస్ రాంరెడ్డి, తరిగోపుల సంగమేశ్వర్, ఏనుగు మురళిధర్‌రెడ్డి, ఆర్.నర్సింలు, రవీందర్‌రెడ్డి, చేవెళ్ల మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశం గుప్తా, రవికాంత్‌రెడ్డి, బల్వంత్‌రెడ్డి, నర్సింలు పాల్గొన్నారు. వికారాబాద్‌ను జిల్లా కేంద్రంగా చేస్తాం: కార్తీక్‌రెడ్డి వికారాబాద్‌ను జిల్లా కేంద్రంగా చేసేందుకు పాటుపడతానని యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు, మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి అన్నారు. కార్తీక్‌రెడ్డి చేపట్టిన తెలంగాణ నవ నిర్మాణ పాదయాత్రలో భాగంగా శనివారం మధ్యాహ్నం వికారాబాద్‌లో ప్రవేశించింది. ఈ సంద ర్భంగా యాత్ర కొత్రెపల్లి, శివారెడ్డిపేట, ఎన్నెపల్లి, సాకేత్‌నగర్ వికారాబాద్ రైల్వే బ్రిడ్జిల మీదుగా భారీగా పట్టణంలోని బీజేఆర్ చౌరస్తాలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కార్తీక్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ కోసం ఎంతో మంది యువకులు అమరులయ్యారని, వారి కుటుంబాలకు న్యాయం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. తెలంగాణ ఇచ్చిన తమ పార్టీ అధినాయకురాలు సోనియాగాంధీకి కృతజ్ఞత తెలిపేందుకే పాదయాత్ర చేపట్టినట్లు ఆయన తెలిపారు. వికారాబాద్‌ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడానికి తన వంతు కృషి చేస్తానని ప్రకటించారు. పార్టీ అంగీకరిస్తే ఎంపీగా పోటీ చేస్తా పూడూరు: కాంగ్రెస్ పార్టీ అంగీకరిస్తే ఎంపీగా పోటీ చేస్తానని కార్తీక్‌రెడ్డి స్పష్టంచేశారు. పాదయాత్ర సందర్భంగా శనివారం మండల పరిధిలోని ఎన్కెపల్లి హిట్స్ కళాశాలలో బస చేసిన కార్తీక్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ నవ నిర్మాణం పేరుతో చేపట్టిన పాదయాత్ర కేవలం ప్రజల కోసమేనని రాజకీయ లబ్ధి కోసం కాదన్నారు. కొందరు గిట్టనివారు దీన్ని రాజకీయం చేయడాన్ని ఆయన కొట్టిపారేశారు. తెలంగాణ కోసం కలలు కన్న తన నాన్న ఇంద్రారెడ్డి ఆశయం నెరవేరిందని, ప్రజల ముఖంలో సంతోషాలను చూడాలనే ఉద్దేశంతో పాదయాత్ర చేపట్టానన్నారు. అంతేకాకుండా ‘మా నాన్న ఎంపీని కావాలనుకునేవారు. ఆ కల నెరవేర్చేందుకు పార్టీ అంగీకరిస్తే చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నా’నన్నారు. పార్టీ టికెట్టు ఇచ్చినా ఇవ్వకున్నా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ పటిష్టతకు కృషి చేస్తానని తెలియజేశారు. సమావేశంలో పీసీసీ కార్యదర్శి టి.రామ్మోన్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు సుభానయ్య,సురేందర్‌గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, ఎన్కెపల్లి సర్పంచ్ దయాకర్, షకీల్, అబ్బాస్‌ఖాన్ పాల్గొన్నారు.