శంషాబాద్ సభలో మాట్లాడుతున్న కేటీఆర్, శంషాబాద్‌లో బహిరంగసభకు హాజరైన ప్రజలు
సాక్షి, శంషాబాద్: ‘ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎమ్మెల్యే సబితారెడ్డి కలిసినప్పుడు కాళేశ్వరం అద్భుతంగా పూర్తిచేస్తున్నారు.. రంగారెడ్డి జిల్లా ప్రజలకు కూడా త్వరగా సాగునీరందించాలని కోరగా.. మరో రెండేళ్లోనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాకు సాగునీరందుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు’ అని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. మాజీ మంత్రి సబితారెడ్డి తనయుడు కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా మంగళరాత్రి శంషాబాద్ పట్టణంలో జరిగిన బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడారు. జిల్లాలో లక్ష ఎకరాలకు పైగానే సాగునీరందించేందుకు పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయన్నారు.
జీవో 111 కూడా పర్యావరణ హితంగా నిర్ణయం తీసుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధంగా ఉన్నారన్నారు. అందుకు అనుగుణంగా జీవో అమలులో ఉన్న గ్రామాల నుంచి తీర్మానాలను తీసుకోవాల్సిందిగా ఇటీవల ముఖ్యమంత్రే స్వయంగా చేవెళ్ల, రాజేంద్రనగర్ ఎమ్మెల్యేలకు సూచించారన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని బుద్వెల్, కిస్మత్‌పూర్ గ్రామాల మధ్య ఏర్పాటు చేయబోయే ఐటీ క్లస్టర్ శేరిలింగంపల్లిని మించిపోనుందని ఆయన చెప్పారు. ఎమ్మెల్యే సబితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మహేశ్వరం నియోజకవర్గ పరిధిలో కూడా ఫార్మాసిటీతో పాటు ఎలక్ట్రానిక్ పరిశ్రమలతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలున్నాయన్నారు. శంషాబాద్‌లోని కొత్వాల్‌గూడలో నైట్ సఫారీ ఏర్పాటు చేసేందుకు సీఎం యోచిస్తున్నారని కేటీఆర్ వెల్లడించారు.
కడుపులో పెట్టుకోవాలే..
కొత్తగా చేరిన వారిని కడుపులో పెట్టుకుని సమన్వయంతో పనిచేయాలని కేటీఆర్ సూచించారు. కార్తీక్‌రెడ్డి రాకతో టీఆర్‌ఎస్ మరింత బలోపేతంగా మారిందన్నారు. చేవెళ్లలో అభ్యర్థి ఎవరైనా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రజల ఆకాంక్ష మేరకే..
ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా నేతలు నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని కాంగ్రెస్ నేత కార్తీక్‌రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లాలో ప్రజలు టీఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం పట్టారని, ప్రజల సంక్షేమం కోసమే టీఆర్‌ఎస్ పార్టీలో చేరానన్నారు. నాన్న (మాజీ హోంమంత్రి ఇంద్రారెడ్డి) కాంగ్రెస్‌లో చేరిన నాడు ఆ పార్టీ చక్రాలు లేని బండి మాదిరిగా ఉండేదని, అలాంటి పార్టీని అమ్మ (ఎమ్మెల్యే సబితారెడ్డి) తాను కలిసి బలమైన శక్తిగా మార్చామన్నారు. ప్రస్తుత తరుణంలో ప్రజల సంక్షేమం కేవలం టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని నిర్ణయించుకున్నామన్నారు. పార్టీలు మారడం హేయమైన చర్యగా మాట్లాడుతున్న ఎంపీ కోండా విశ్వేశ్వర్‌రెడ్డి రాజకీయ గుర్తింపును ఇచ్చిన టీఆర్‌ఎస్‌కు ద్రోహం చేసి పార్టీ మారి వెన్నుపోటు పొడిచారని విమర్శించారు.
రెండు స్థానాల్లో అత్యధిక మెజార్టీ
మల్కాజ్‌గిరి, చేవెళ్ల ఎంపీ నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీ సాధించి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహుమతి ఇవాల్సిన అవసరముందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. కాంగ్రెస్ దివాలా తీసిందని, బీజేపీ పువ్వు పూజకు కూడా పనికిరాకుండా పోయిందని ఎద్దేవా చేశారు. కార్తీక్‌రెడ్డి రాకతో చేవెళ్లలో టీఆర్‌ఎస్ పార్టీ బ్రహ్మాండమైన విజయం సాధిస్తుందని అన్నారు.
బ్రహ్మరథం పడుతున్నారు
టీఆర్‌ఎస్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో టీఆర్‌ఎస్ కీలకంగా మారనుందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు పార్టీకి మంచి ఫలితాలనందించడం ఖాయమని చెప్పారు.
పంచాయతీ పోయింది..
మా గురువు ఇంద్రన్న కుమారుడితో మాటికి ముందు జగడం చేసుకునే పంచాయతీ పోయిందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ అన్నారు. కార్తీక్‌రెడ్డి రాకతో అందరి కన్నా తానే ఎక్కువ సంతోస్తున్నానని, మంచి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో పనిచేస్తున్న సంతృప్తి ఎంతగానో ఉందన్నారు. రాజకీయాల్లో ఓర్పు ఎంతో అవసరమని, సమయం వచ్చినప్పుడు అంతా మంచే జరుగుతుందన్నారు. అప్పట్లో తన గురువు ఇంద్రారెడ్డి నోటి మాటగా నేను ఎమ్మెల్యే అయితనని అన్నడని, అదే జరిగిందన్నారు.
బ్రహ్మాండమైన మెజార్టీ ఖాయం
చేవెళ్ల పార్లమెంట్ స్థానాన్ని టీఆర్‌ఎస్ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవడం ఖాయమని పరిగి ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెలే కాలె యాదయ్య, వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. కార్తీక్‌రెడ్డి రాకతో టీఆర్‌ఎస్ మరింత బలోపేతమైందని వారు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment