trs party meeting
-
పీకే సర్వే.. పనితీరే గీటురాయి..
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ముందస్తు ఎన్నికల హడావుడి.. జాతీయ రాజకీయాల దిశగా టీఆర్ఎస్ అడుగుల నేప థ్యంలో అన్ని జిల్లాల్లో పార్టీ నేతల మధ్య ఉన్న పొరపొచ్చా లపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్టీలోని విభేదాలపై ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పోటీ చేసి ఓడిపోయిన నేతలు, జెడ్పీ చైర్మన్లతో ప్రత్యేకంగా చర్చించారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ‘ఎమ్మెల్యేలు, నేతల పనితీరు ఆధారంగానే టికెట్లు వస్తాయి. పీకే సర్వేను కూడా ప్రామాణికంగా తీసుకుంటాం. కొన్ని కఠిన నిర్ణయా లకు కూడా వెనుకాడం. ఇప్పటి నుంచే మీ పనితీరు మెరుగు పరుచుకోవాలి. పార్టీ పరంగా ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉండాలి. గతంలో రెండుసార్లు జిల్లాలో చేదు ఫలి తాలు వచ్చాయని, ఈసారి అవి పునరావృతం కావొద్దని, పదికి పది స్థానాలను సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రజలు ఈసడించుకునేలా అధికార యంత్రాంగాన్ని సొంత పనులకు వినియోగించుకోవద్దు. దీనివల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుంది’అని అన్నారు. సమావేశానికి ఎంపీ నామా నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కాగా స్థానికంగా లేకపోవడంతో ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య హాజరుకాలేదు. బీఆర్ఎస్ కోర్ కమిటీ మీటింగ్‌కు పిలుస్తాం జాతీయస్థాయిలో పార్టీ నిర్మాణంపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి పెట్టారని, భారత్ రాష్ట్రీయ సమితి(బీఆర్ఎస్) ఏర్పా టు చేస్తున్నామని, త్వరలోనే పార్టీ ప్రకటన ఉంటుందని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ కోర్ కమిటీ మీటింగ్‌కు సంబం ధించి ఉమ్మడి జిల్లా ముఖ్యనేతలకు కూడా ఆహ్వానాలు అం దుతాయని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఇప్పుడు వచ్చినట్లుగానే భావించి అందరూ నియోజకవర్గాల్లో, గ్రామాల్లో విస్తృతంగా పర్యటించాలని సూచించారు. -
బీసీలు, ఈబీసీలు, మైనారిటీలు, ఇతర పేదలకు అందరికీ ‘బంధు’
సమాజంలో ఇతరుల కంటే అట్టడుగున ఉన్న దళితుల అభ్యున్నతి కోసమే తొలుత దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టాం. ప్రాధాన్యతా క్రమంలో బీసీ, ఈబీసీలు, మైనారిటీలు, ఇతర పేదలకూ దీన్ని వర్తింపజేస్తాం. దశలవారీగా అన్నివర్గాల అభివృద్ధికి పనిచేస్తాం. రాష్ట్ర ఆవిర్భావం మొదలుకుని ఇప్పటిదాకా ఏ ఎన్నిక జరిగినా టీఆర్ఎస్ గెలుస్తూ వస్తోంది. 2018 ఎన్నికల్లో 89 స్థానాల్లో గెలిచినా.. మధుసూదనాచారి, తుమ్మల, పి.మహేందర్‌రెడ్డి వంటి నాయకులు సొంత తప్పిదాలతో ఓటమి పాలయ్యారు. దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా నేను స్వయంగా ఓ బహిరంగ సభకు హాజరై ఉంటే బాగుండేది. అక్కడ అభ్యర్థి మీద వ్యతిరేకత వల్లే ఆశించిన ఫలితం రాలేదు. -కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: ‘దళితబంధు’ తరహాలో రాష్ట్రం లో అన్ని వర్గాల పేదలకు పథకాన్ని అమలు చేస్తా మని టీఆర్ఎస్ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఈ విషయంలో ప్రతిపక్షాల విమర్శలకు జడవబోమని, దశలవారీగా అన్ని వర్గాల అభివృద్ధి కోసం పనిచేస్తామని చెప్పారు. పార్టీని చూసే ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారని.. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నది ముమ్మాటికీ టీఆర్ఎస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. పార్టీలోకి నాయకులు వస్తూ పోతూ ఉంటారని, ఎవరికైనా పార్టీయే సుప్రీమ్ అని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ అన్ని ఎన్నికల్లో వరుస విజయాలు సాధిస్తూ వస్తోందని, దీనికి దారిదాపుల్లో ఎవరూ లేరని చెప్పారు. మరో ఇరవై ఏండ్లు రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉంటుందన్నారు. మంగళవారం తెలంగాణభవన్‌లో జరిగిన టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ సమావేశంలో కేసీఆర్ సుమారు రెండున్నర గంటలకుపైగా ప్రసంగించారు. ముఖ్యాంశాలు కేసీఆర్ మాటల్లోనే.. ‘దళితబంధు’తో దేశవ్యాప్తంగా.. రెక్కల కష్టం మీదే బతుకున్న వారిలో ఎక్కువ మంది దళితులే ఉన్నారు. భూమిలేని నిరుపేదల్లో ఎస్టీలతో పోలిస్తే ఎస్సీలే ఎక్కువ శాతం ఉన్నారు. సమాజంలో అట్టడుగున్న ఉన్న దళితుల అభ్యున్నతి కోసమే దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టాం. సుమారు 25 ఏండ్ల కిందట నేను సిద్దిపేట ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో దళితజ్యోతి కార్యక్రమాన్ని చేపట్టిన స్ఫూర్తితో ప్రస్తుతం దళితబంధుకు శ్రీకారం చుట్టాం. ఈ పథకంపై వస్తున్న విమర్శలను ఎక్కడికక్కడ తిప్పికొట్టడంతోపాటు, ఈ పథకాన్ని లబ్ధిదారులకు చేరవేయడంలో పార్టీ యంత్రాంగం చురుగ్గా పనిచేయాలి. పథకం ప్రయోజనాలను అందిపుచ్చుకునేలా దళిత జాతిని చైతన్యవంతులను చేయాలి. స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్లు గడుస్తున్నా దళితుల జీవితాలను మార్చే పథకాల అమల్లో జాతీయ పార్టీలు విఫలమయ్యాయి. దళితబంధుపై విమర్శలు చేస్తున్న పార్టీలు తమ పాలనలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని నిలదీయాలి. రాష్ట్రంలో దళితబంధు పథకం విజయం సాధిస్తే.. దేశవ్యాప్తంగా ఈ పథకం అమలు కోసం ఒత్తిడి పెరుగుతుంది. దళితబంధు ద్వారా తెలంగాణ దేశానికే రోల్ మోడల్‌గా మారుతుంది. ప్రాధాన్యతా క్రమంలో రాబోయే రోజుల్లో ఈ పథకాన్ని అన్ని వర్గాలకు వర్తింపజేస్తాం. పార్టీ యంత్రాంగం నుంచే భవిష్యత్తు నేతలు ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ విలీనం మొదలుకుని 2014లో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుదాకా సాగిన రాజకీయ పరిణామాలు, ఉద్యమాలకు ఎంతో నేపథ్యముంది. వివిధ కారణాలతో పార్టీలు, నాయకులు జాతీయ పార్టీలకు లొంగిపోయినా.. 2001లో తెలంగాణ సాధన లక్ష్యంగా టీఆర్ఎస్ను ఏర్పాటుచేసి వరుసగా రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చాం. ఉద్యమ లక్ష్యాల సాధన కోసం పనిచేస్తున్నాం. పార్టీ యంత్రాంగం నుంచే కొత్త నాయకత్వం పుట్టుకొస్తుంది. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారందరికీ భవిష్యత్తులో రాజకీయంగా వివిధ రూపాల్లో అవకాశాలు వస్తాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కమిటీతో మరో సందర్భంలో సమావేశమై.. జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ పాత్ర గురించి మాట్లాడుతా. సభ్యత్వ నమోదు పూర్తి చేయండి ఈ ఏడాది ఫిబ్రవరిలోచేపట్టిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈ నెలాఖరుతో పూర్తిచేయండి. మరో 38 నియోజకవర్గాల నుంచి సభ్యత్వ నమోదు వివరాలు పార్టీ కార్యాలయానికి అందాల్సి ఉంది. సెప్టెంబర్ రెండో తేదీ నుంచి గ్రామస్థాయిలో సంస్థాగత కమిటీల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించాలి. 12,796 గ్రామ పంచాయతీలు, 3,654 మున్సిపల్ వార్డుల వారీగా పార్టీ కమిటీలు ఏర్పాటు చేయాలి. మండల, మున్సిపల్, పట్టణ, జిల్లా కమిటీల ఏర్పాటును వచ్చే నెలాఖరులోగా పూర్తి చేయాలి. చాలాకాలం తర్వాత పార్టీ జిల్లా అధ్యక్షులను కూడా నియమించాం. జిల్లా కమిటీల ఏర్పాటు పూర్తయిన తర్వాత రాష్ట్ర కమిటీని కొత్తగా ఏర్పాటు చేస్తాం. హైదరాబాద్, వరంగల్ మినహా 24 జిల్లాల్లో పార్టీ జిల్లా కార్యాలయాల నిర్మాణం పూర్తయింది. మిగతాచోట్ల పనులు చివరి దశలో ఉన్నాయి. విజయదశమికి అటూఇటూగా మంచి రోజులు చూసుకుని జిల్లా కార్యాలయాల ప్రారంభోత్సవాలకు హాజరవుతా. కరోనా మూలంగా రెండేళ్లుగా పార్టీ వార్షిక సమావేశాలు (ప్లీనరీ) జరగడం లేదు. కరోనా పరిస్థితులను బేరీజు వేసుకుని సెప్టెంబర్ నెలాఖరు లేదా అక్టోబర్‌లో పార్టీ ‘ద్విదశాబ్ధి ఉత్సవ సభ’ను నిర్వహిస్తాం. ఢిల్లీలో టీఆర్ఎస్ భవన్‌కు శంకుస్థాపన దేశ రాజధాని ఢిల్లీలోని వసంత్‌విహార్‌లో పార్టీ కార్యాలయ భవనం ‘టీఆర్ఎస్ భవన్’కు సెప్టెంబర్ 2న ఉదయం శంకుస్థాపన చేస్తా. ఘనంగా జరిగే ఈ కార్యక్రమానికి మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గం, జెడ్పీ చైర్మన్లు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, మరికొందరు హాజరవుతారు. శంకుస్థాపనకు ఒకరోజు ముందే సెప్టెంబర్ ఒకటో తేదీ సాయంత్రానికల్లా పార్టీ నేతలందరూ ఢిల్లీకి చేరుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలి. పార్టీ ఎంపీలు ఢిల్లీలోనే ఉండి రాష్ట్రం నుంచి వచ్చే ప్రతినిధులు రెండు మూడు రోజులు బస చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలి’’ అని సీఎం కేసీఆర్ సూచించారు. సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు, పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు, మంత్రి సత్యవతి రాథోడ్, నేతలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బోడకుంటి వెంకటేశ్వర్లు, తక్కళ్లపల్లి రవీందర్రావు, బడుగుల లింగయ్యయాదవ్, బస్వరాజు సారయ్య, ఫారూక్ హుస్సేన్, ఫరీదుద్దీన్, శంభీపూర్ రాజు, మాలోత్ కవిత, వేలేటి రాధాకృష్ణశర్మ, బక్కి వెంకటయ్య, ఇంతియాజ్ ఇషాక్, నారదాసు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. -
మళ్లీ వస్తా.. రెండు రోజులుంటా..
‘దేశానికి కశ్మీర్ ఎట్లనో.. మన తెలంగాణకు ఉమ్మడి ఆదిలాబాద్ అట్ల. సహజసంపదలున్న జిల్లాను ఒకటిన్నర సంవత్సరాల్లో కశ్మీర్ లెక్క కళకళలాడేలా చేస్తా. ఇది నా బాధ్యత. ఎంపీ ఎన్నికల తర్వాత మళ్లీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వస్తా. ఇక్కడి ఆదివాసీ బిడ్డలకు న్యాయం చేస్తా. అన్నివర్గాల సమస్యలను దూరం చేస్తా. ఆదిలాబాద్ ఓటర్లు మన నగేశ్‌ను మూడులక్షల మెజార్టీతో గెలిపించాలని కోరుతున్న..’ నిర్మల్: ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివా రం సాయంత్రం సీఎం కేసీఆర్ నిర్మల్ వచ్చారు. జిల్లాకేంద్రంలో ని ఎల్లపెల్లి క్రషర్‌రోడ్డులో గల మైదానంలో భారీ బహిరంగసభ నిర్వహించారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరిన ఆయన సరిగ్గా సాయంత్రం 5గంటల 10నిమిషాలకు సభాస్థలికి చేరుకున్నారు. 5.12కు ప్రసంగాన్ని ప్రారంభించి, 5.47 వరకు ముగించారు. మొత్తం 35నిమిషాల పాటు సీఎం ప్రసంగం కొనసాగింది. ముందుగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ నగేశ్, జెడ్పీ చైర్పర్సన్ శోభారాణి, ఎమ్మెల్యేలు జోగురామన్న, విఠల్‌రెడ్డి, బాపురావు, రేఖానాయక్, ఆత్రం సక్కు, కోనేరు కోనప్ప, డెయిరీ చైర్మన్ లోక భూమారెడ్డి తదితరులు మాట్లాడారు. అనంతరం సీఎం ప్రసంగం ప్రారంభించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 24గంటల పాటు రైతాంగానికి ఉచిత కరెంటు ఇస్తున్నామన్నారు. రాత్రిపూట పాములు, తేళ్ల మధ్య పొలానికి పోవడం, కరెంటు షాకుల కష్టం పోయేలా చేశామన్నారు. అన్నివర్గాల వారి పింఛన్లను పెంచామని, ఎక్కడా లేని విధంగా బీడీ కార్మికులకు కూడా పింఛన్లు ఇస్తున్నామని చెప్పారు. ఉమ్మడి ఆదిలాబాద్‌లోనూ బీడీ కార్మికులు ఉన్నారని పీఎఫ్ ఉన్న వారందరికీ పింఛన్ అందించనున్నామని పేర్కొన్నారు. రైతుబంధు సాయాన్ని ఏడాదికి ఎకరాకు రూ.పదివేలకు పెంచుతున్నామన్నారు. నాణ్యమైన చదువులు, సన్నబియ్యంతో విద్యార్థులకు భోజనం, 24గంటల కరెంటు, పింఛన్లు.. ఇలా ఇవన్నీ ప్రజల కండ్ల ముందే ఉన్నాయని పేర్కొన్నారు. జిందగీలా జిల్లా కాకుండే.. తెలంగాణ ఏర్పడటం వల్లే అభివృద్ధి సాధ్యమైందని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలన సౌలభ్యం కోసం జిల్లాలను ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌కు చెందిన అప్పటి మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న, ఎంపీ నగేశ్ తమ జిల్లాలో బెజ్జూరు నుంచి ఆదిలాబాద్, బాసర నుంచి ఆదిలాబాద్‌కు పోవాలంటే కష్టమవుతుందని నా దృష్టికి తీసుకువచ్చారన్నారు. అందుకే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజల కష్టాలు తీర్చేతందుకు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్లుగా నాలుగు జిల్లాలు చేసినమన్నారు. తెలంగాణ ఏర్పడకుంటే.. టీఆర్ఎస్ ప్రభుత్వం రాకుంటే.. జిందగీలా నిర్మల్ జిల్లా కాకుండే.. అని పేర్కొన్నారు. కశ్మీర్‌లా కళకళలాడాలె.. దేశానికి కశ్మీర్ ఎలాగో.. తెలంగాణకు ఉమ్మడి జిల్లా అలాంటిదని సీఎం అభివర్ణించారు. సహ జసిద్ధమైన వనరులు, వనసంపద ఉన్న జిల్లాను అన్నిరకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. కాళేశ్వ రం ప్రాజెక్టులో భాగంగా 27, 28 ప్యాకేజీల్లో భాగంగా ఎస్సారెస్పీ ద్వారా నిర్మల్ నియోజకవర్గంలో 50వేల ఎకరాలు, ముథోల్ నియోజకవర్గంలో 50వేల ఎకరాలు.. మొత్తం లక్ష ఎకరాలకు సాగునీరు అందించనున్నామన్నారు. ప్రాణహిత నదిపై తుమ్మడిహెట్టి ప్రాజెక్టు కూడా చేపడుతున్నామని, మంచిర్యాల, కుమురంభీం జిల్లాలకూ సాగునీటిని అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ప్రాజెక్టులన్నింటిని సద్వినియోగం చేసేలా చూస్తామని, ఒకటిన్నర సంవత్సరం తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్‌ను కశ్మీర్‌లా కళకళలాడేలా చేస్తామని వివరించారు. ఇది తన బాధ్యతని కేసీఆర్ హామీ ఇచ్చారు. బర్రునచ్చి.. బుర్రున పోను.. మంచిర్యాల జిల్లాకు చెందిన రైతు ఫేస్బుక్లో వీడియో పెడితే, వెంటనే స్పందించి పరిష్కరించానని సీఎం సభలో పేర్కొన్నారు. అందరి లెక్క ఆల్తూ..ఫాల్తూ ముచ్చట్లు చెప్పుడు ఇష్టం లేదని.. జూన్ తర్వాత దేశమే ఆశ్చర్యపోయేలా కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తమని వెల్లడించారు. భూ యజమానికి సంపూర్ణమైన హక్కును కల్పిస్తామని చెప్పారు. రైతులకు సంబంధించిన భూసమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇందుకోసం ఎన్నికల తర్వాత మళ్లీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వస్తానని చెప్పారు. ఇప్పటి లెక్క.. బర్రునచ్చి బుర్రున పోనని, రెండుమూడు రోజుల ఇక్కడనే ఉంటానన్నారు. సీఎస్‌తో సహా అందరు అధికారులు, మంత్రివర్గమంతా తనతో ఇక్కడే ఉంటుందన్నారు. రైతులు నెల రోజులు ఓపిక పట్టాలని, భూసంబంధిత సమస్యలన్నీ పరిష్కారమవుతాయని హామీ ఇచ్చారు. రైతులందరికీ గిట్టుబాటు ధరలు అందేలా చేస్తామన్నారు. 1996లోనే సత్తెన్నతో చెప్పిన.. సీఎం కేసీఆర్ మరోసారి టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వి.సత్యనారాయణగౌడ్‌ను గుర్తుచేసుకున్నారు. తెలంగాణ ఏర్పడితే సమస్యలన్నీ దూరమైతాయని తాను 1996లోనే కడ్తాల్ సత్యనారాయణతో చెప్పానని సీఎం గుర్తుచేశారు. అప్పట్లో తాను ఎస్సారెస్పీకి వచ్చినప్పుడు సత్యనారాయణగౌడ్ మరికొందరితో కలిసి డ్యామ్‌పై నడుచుకుంటూ వెళ్లామని చెప్పారు. అప్పుడే తెలంగాణ కోసం ఉద్యమం గురించి మాట్లాడుకున్నామన్నారు. బతికుంటే తానే ఉద్యమం చేస్తానని సత్తెన్నతో చెప్పానని సీఎం పేర్కొన్నారు. 2001లో జెండా పట్టుకుంటే ముందుగా ఎవరూ రాలేదని, ఆ తర్వాత ఒక్కొక్కరుగా వచ్చి చేరడంతో ఉద్యమం బలపడిందన్నారు. స్వరాష్ట్రం సాధించుకోవడం వల్ల పేదలకు, వృద్ధులకు, ఒంటరి, వితంతు, దివ్యాంగులకు పింఛన్లను ఇచ్చి కడుపు నింపుతున్నామన్నారు. న్యాయం చేస్తా.. గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులు, పథకాల లొల్లి పడి ఆదిలాబాద్ జిల్లాకు రాలేకపోయానని సీఎం పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత ఆదిలాబా ద్, నిర్మల్‌లకు వస్తానని, రెండుమూడు రోజులు ఇక్కడే ఉండి అభివృద్ధి పనులు చేయిస్తానని హా మీ ఇచ్చారు. ఆదిలాబాద్ ఆదివాసీ బిడ్డలకు న్యా యం చేస్తానన్నారు. పోడు భూములు, ఏజెన్సీలో గిరిజనేతరుల భూముల సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు. జిల్లాలో మైనార్టీ ముస్లింల కోసం ప్రత్యేక గురుకులాలను ఏర్పాటు చేశామన్నారు. అన్నివర్గాలను అభివృద్ధి చేయడం తన బాధ్యత అని చెప్పారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యేల సహకారంతో జిల్లా అభివృద్ధి పథంలో నడుస్తుం దన్నారు. గత ఎన్నికల్లో జిల్లాకు వచ్చి కోరితే.. తొమ్మిది మందిఎమ్మెల్యేలను గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాననీ, లోక్‌సభ ఎన్నికల్లో పనిమంతుడైన గోడం నగేశ్‌ను మరోసారి ఎంపీగా గెలిపించాలని కోరారు. ఈసారి 3లక్షల మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. భారీ బందోబస్తు సభకు ఎస్పీ శశిర్రాజు ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. సీఎం హోదాలో తొలిసారి ఉమ్మడి జిల్లాకు వచ్చిన కేసీఆర్ కార్యక్రమానికి అంచెలంచెలుగా భద్రత ఏర్పాట్లు చేశారు. సభలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అధ్యక్షత వహించారు. ఇందులో రాజ్యసభ ఎంపీలు కె.కేశవరావు, సంతోష్‌రావు, జెడ్పీచైర్‌పర్సన్ శోభారాణి, ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావు, అజ్మీరా రేఖానాయక్, విఠల్‌రెడ్డి, కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు, ఎమ్మెల్సీ పురాణం సతీశ్, డెయిరీ చైర్మన్ లోక భూమారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, నల్ల ఇంద్రకరణ్‌రెడ్డి, సీనియర్ నాయకులు సత్యనారాయణగౌడ్, కే. శ్రీహరిరావు, రాంకిషన్‌రెడ్డి, అరిగెల నాగేశ్వర్రావు, డాక్టర్ మల్లికార్జున్‌రెడ్డి, గౌతమ్‌రెడ్డి, ఎర్రవోతు రాజేందర్, ధర్మాజీగారి రాజేందర్, పాకాల రాంచందర్, డాక్టర్ స్వర్ణారెడ్డి, శ్యాంసుందర్, కౌన్సిలర్లు, సర్పంచులు తదితరులు హాజరయ్యారు. -
కేసీఆర్ సభను జయప్రదం చేయాలి
సాక్షి, పెద్దశంకరంపేట(మెదక్): పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించే సీఎం కేసీఆర్ ప్రచారసభను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు విజయరామరాజు అన్నారు. ఆదివారం మండలంలోని బుజ్రాన్‌పల్లి, టెంకటి, జంబికుంట, దానంపల్లి, మల్కాపూర్, గొట్టిముక్కుల గ్రామాల్లో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ తరపున ప్రచారం చేశారు. ఏప్రిల్ 3న అల్లాదుర్గంలో జరిగే కేసీఆర్ సభకు కార్యకర్తలు, నాయకులు హాజరుకావాలని కోరారు. జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తిచేశారు. సమావేశంలో మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు రాములు, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు సురేష్‌గౌడ్, ఎంపీటీసీ సభ్యుడు మాణిక్‌రెడ్డి, మాజీ సర్పంచ్ జంగం శ్రీనివాస్, నాయకులు హరి, గోవర్దన్, పున్నయ్య, అంజయ్య ఉన్నారు. -
‘పాలమూరు’తో సస్యశ్యామలం
సాక్షి, శంషాబాద్: ‘ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎమ్మెల్యే సబితారెడ్డి కలిసినప్పుడు కాళేశ్వరం అద్భుతంగా పూర్తిచేస్తున్నారు.. రంగారెడ్డి జిల్లా ప్రజలకు కూడా త్వరగా సాగునీరందించాలని కోరగా.. మరో రెండేళ్లోనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాకు సాగునీరందుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు’ అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. మాజీ మంత్రి సబితారెడ్డి తనయుడు కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరిన సందర్భంగా మంగళరాత్రి శంషాబాద్ పట్టణంలో జరిగిన బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడారు. జిల్లాలో లక్ష ఎకరాలకు పైగానే సాగునీరందించేందుకు పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయన్నారు. జీవో 111 కూడా పర్యావరణ హితంగా నిర్ణయం తీసుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధంగా ఉన్నారన్నారు. అందుకు అనుగుణంగా జీవో అమలులో ఉన్న గ్రామాల నుంచి తీర్మానాలను తీసుకోవాల్సిందిగా ఇటీవల ముఖ్యమంత్రే స్వయంగా చేవెళ్ల, రాజేంద్రనగర్ ఎమ్మెల్యేలకు సూచించారన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని బుద్వెల్, కిస్మత్పూర్ గ్రామాల మధ్య ఏర్పాటు చేయబోయే ఐటీ క్లస్టర్ శేరిలింగంపల్లిని మించిపోనుందని ఆయన చెప్పారు. ఎమ్మెల్యే సబితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మహేశ్వరం నియోజకవర్గ పరిధిలో కూడా ఫార్మాసిటీతో పాటు ఎలక్ట్రానిక్ పరిశ్రమలతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలున్నాయన్నారు. శంషాబాద్‌లోని కొత్వాల్‌గూడలో నైట్ సఫారీ ఏర్పాటు చేసేందుకు సీఎం యోచిస్తున్నారని కేటీఆర్ వెల్లడించారు. కడుపులో పెట్టుకోవాలే.. కొత్తగా చేరిన వారిని కడుపులో పెట్టుకుని సమన్వయంతో పనిచేయాలని కేటీఆర్ సూచించారు. కార్తీక్‌రెడ్డి రాకతో టీఆర్ఎస్ మరింత బలోపేతంగా మారిందన్నారు. చేవెళ్లలో అభ్యర్థి ఎవరైనా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజల ఆకాంక్ష మేరకే.. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా నేతలు నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని కాంగ్రెస్ నేత కార్తీక్‌రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లాలో ప్రజలు టీఆర్ఎస్కు బ్రహ్మరథం పట్టారని, ప్రజల సంక్షేమం కోసమే టీఆర్ఎస్ పార్టీలో చేరానన్నారు. నాన్న (మాజీ హోంమంత్రి ఇంద్రారెడ్డి) కాంగ్రెస్‌లో చేరిన నాడు ఆ పార్టీ చక్రాలు లేని బండి మాదిరిగా ఉండేదని, అలాంటి పార్టీని అమ్మ (ఎమ్మెల్యే సబితారెడ్డి) తాను కలిసి బలమైన శక్తిగా మార్చామన్నారు. ప్రస్తుత తరుణంలో ప్రజల సంక్షేమం కేవలం టీఆర్ఎస్తోనే సాధ్యమని నిర్ణయించుకున్నామన్నారు. పార్టీలు మారడం హేయమైన చర్యగా మాట్లాడుతున్న ఎంపీ కోండా విశ్వేశ్వర్‌రెడ్డి రాజకీయ గుర్తింపును ఇచ్చిన టీఆర్ఎస్కు ద్రోహం చేసి పార్టీ మారి వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. రెండు స్థానాల్లో అత్యధిక మెజార్టీ మల్కాజ్గిరి, చేవెళ్ల ఎంపీ నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీ సాధించి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహుమతి ఇవాల్సిన అవసరముందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. కాంగ్రెస్ దివాలా తీసిందని, బీజేపీ పువ్వు పూజకు కూడా పనికిరాకుండా పోయిందని ఎద్దేవా చేశారు. కార్తీక్‌రెడ్డి రాకతో చేవెళ్లలో టీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండమైన విజయం సాధిస్తుందని అన్నారు. బ్రహ్మరథం పడుతున్నారు టీఆర్ఎస్కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో టీఆర్ఎస్ కీలకంగా మారనుందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు పార్టీకి మంచి ఫలితాలనందించడం ఖాయమని చెప్పారు. పంచాయతీ పోయింది.. మా గురువు ఇంద్రన్న కుమారుడితో మాటికి ముందు జగడం చేసుకునే పంచాయతీ పోయిందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ అన్నారు. కార్తీక్‌రెడ్డి రాకతో అందరి కన్నా తానే ఎక్కువ సంతోస్తున్నానని, మంచి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో పనిచేస్తున్న సంతృప్తి ఎంతగానో ఉందన్నారు. రాజకీయాల్లో ఓర్పు ఎంతో అవసరమని, సమయం వచ్చినప్పుడు అంతా మంచే జరుగుతుందన్నారు. అప్పట్లో తన గురువు ఇంద్రారెడ్డి నోటి మాటగా నేను ఎమ్మెల్యే అయితనని అన్నడని, అదే జరిగిందన్నారు. బ్రహ్మాండమైన మెజార్టీ ఖాయం చేవెళ్ల పార్లమెంట్ స్థానాన్ని టీఆర్ఎస్ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవడం ఖాయమని పరిగి ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెలే కాలె యాదయ్య, వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. కార్తీక్‌రెడ్డి రాకతో టీఆర్ఎస్ మరింత బలోపేతమైందని వారు చెప్పారు. -
శంఖారావానికి ఏర్పాట్లు..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్:పార్లమెంటు ఎన్నికల శంఖారావాన్ని మో గిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పాల్గొనే తొలి బహిరంగసభను ఘనంగా నిర్వహించేందుకు ఆ పార్టీ నా యకత్వం ఏర్పాట్లు చేస్తోంది. కలిసొచ్చిన ఉద్యమగడ్డ కరీంనగర్ నుంచే కేసీఆర్ ఈనెల 17న లోక్‌సభ ఎన్నికల సమరానికి తరలివస్తున్నందున గతంలో కన్నా భారీగా సభను నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఈమేరకు గురువారం మం త్రులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, ఎంపీ బి.వినోద్‌కుమార్, జిల్లా పార్టీ ఇన్చార్జి బస్వరాజు సారయ్య, స్థానిక కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఇతర ఎమ్మెల్యేలు, నాయకులు సమావేశమై కార్యాచరణను రూపొందించారు. మానేర్‌డ్యాం దిగువన సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న స్పోర్ట్స్ స్కూల్ కాంప్లెక్స్‌లో సభ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తొలుత తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీలో సభ జరపాలని భావించినా, ఆ స్థలం సభ నిర్వహణకు అనువుగా లేకపోవడంతో స్పోర్ట్స్ స్కూల్ కాంప్లెక్స్‌కు వేదికను మార్చారు. 2.5 లక్షల మందితో సభను నిర్వహించాలని భావిస్తున్నప్పటికీ, సభాప్రాం గణం విస్తీర్ణం సరిపోదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే తొలిసభను ఘనంగా నిర్వహిం చడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్ సంకేతాలు పంపించాలనే లక్ష్యంతో జిల్లా నాయకులు ప్రణా ళికలు రూపొందించారు. కరీంనగర్ శివారులో ఎటు చూసినా జనం కనిపించేలా సభను దిగ్విజయం చేయాలనే లక్ష్యంతో నేతలు ముందుకుసాగుతున్నారు.పార్టీ నేతల మధ్య సమన్వయం, మండలాల వారీగా సభకు జనాన్ని తరలించడం వం టి కార్యక్రమాలు నిరాటంకంగా సాగేలా ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్చార్జీలను నియమించారు. పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి జనాన్ని తీసుకువచ్చేందుకు స్థానిక ఎమ్మెల్యేలకు పనులు అప్పగించారు. సభను విజయవంతం చేయడంలో ఎమ్మెల్యేలదే కీలకపాత్ర. కరీంనగర్ నియోజకవర్గం నుంచే 50వేల జనం కేసీఆర్ పాల్గొనే కరీంనగర్సభకు కేవలం కరీంనగర్ నియోజకవర్గం నుంచే 50వేల మంది హాజరవుతారని భావిస్తున్నారు. ఈమేరకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బాధ్యత తీసుకున్నారు. ఆయన బుధవారం రాత్రి ఓ హోటల్లో సమావేశం ఏర్పాటు చేసి మునిసిపల్ కార్పొరేటర్లకు టార్గెట్లు ఇచ్చారు. మునిసిపల్ మేయర్ సర్ధార్ రవీందర్‌సింగ్ జనసమీకరణలో కీలకంగా వ్యవహరించనున్నారు. 50 డివిజన్లు ఉన్న కార్పొరేషన్లో ఒక్కో డివిజన్ నుంచి వెయ్యి మంది హాజరైన సభతోపాటు కరీంనగర్ రోడ్లు కిటకిటలాడతాయి. సిరిసిల్ల, వేములవాడ నుంచి బైపాస్‌రోడ్డులో నేరుగా సభాస్థలి ప్రాంతానికే వాహనాలు వస్తాయి. మానకొండూరు, హుజూ రాబాద్, హుస్నాబాద్ నుంచి వచ్చే వాహనాలకు మానేర్డ్యామ్లో పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. చొప్పదండి, ధర్మపురి నుంచి వచ్చే వాహనాలకు సైతం సమీపంలోనే పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నా రు. కరీంనగర్ మినహా ఆరు నియోజకవర్గాల నుంచి 2 లక్షల మందిని తరలించాలని గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్ణయించారు. నియోజకవర్గాల వారీగా ఇన్చార్జీలు సభను విజయవంతం చేయడంతోపాటు జనసమీకరణలో స్థానిక ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకునేలా నియోజకవర్గానికి ఇద్దరు ఇన్చార్జీలను నియమించారు. హుజూరాబాద్‌కు పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, మానకొండూరుకు పుట్ట మధు, సత్యనారాయణగౌడ్, సిరిసిల్లకు బాల్క సుమన్, కోరుకంటి చందర్, హుస్నాబాద్‌కు తుల ఉమ, ఆరూరి రమేశ్, ధర్మపురికి సంజయ్, కరీంనగర్‌కు కొప్పు ల ఈశ్వర్, వేములవాడకు దాసరి మనోహర్‌రెడ్డి తదితరులు ఇన్‌చార్జీలుగా వ్యవహరించనున్నారు. కరీంనగర్ నుంచే అత్యధిక మెజారిటీ: ఈటల రాజేందర్ ఉద్యమ కాలం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వెన్నంటి నిలిచిన కరీంనగర్ ప్రజలు పార్లమెంటు ఎన్నికల్లో మరోసారి ఆశీర్వదిస్తారని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్లో గురువారం మాట్లాడారు. కేసీఆర్ పాల్గొనే సభకు రెండున్నర లక్షల జనం హాజరవుతారని భావిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో ప్ర స్తుతం టీఆర్ఎస్ ఎదుట నిలబడేస్థాయిలో ఏ రా జకీయ పార్టీ లేదన్నారు. ప్రజలు గులాబీ జెండా ను సొంతం చేసుకున్నారని పేర్కొన్నారు. కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్‌ను రాష్ట్రంలోనే అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కోరారు. మంత్రి కొప్పుల ఈశ్వర్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మేయర్ రవీందర్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ సభాస్థలం పరిశీలన కరీంనగర్: కరీంనగరంలో కేసీఆర్ సభను విజయవంతం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరారు. ఈనెల 17న జరిగే సీఎం సభ ఏర్పాట్లను గురువారం పరిశీలించారు. టీఆర్ఎస్కు అచ్చొచ్చిన కరీంనగర్ జిల్లా నుంచే ఎన్నికల నగారా మోగనుండడంతో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభతో టీఆర్ఎస్కు ఉన్న ప్రజాబలం మరోసారి తెలుస్తుందని నేతలు అభిప్రాయపడుతున్నారు. కరీంనగర్ శివారులోని స్పోర్ట్స్స్కూల్ మైదానంలో నిర్వహించే సమావేశాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా నేతలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి జనం హాజరుకానున్నారు. స్పోర్ట్స్ స్కూల్ మైదానాన్ని మంత్రులు కొప్పుల ఈశ్వర్, ఈటల రాజేందర్, ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పార్టీ జిల్లా ఇన్చార్జి బస్వరాజు సారయ్య, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మేయర్ రవీందర్‌సింగ్, పోలీసు కమిషనర్ కమలాసన్‌రెడ్డి పరిశీలించారు. దాదాపు 30 ఎకరాల స్థలాన్ని చదునుచేయడంతోపాటు బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎండలు తీవ్రంగా ఉండడంతో మైదానం మొత్తం టెంట్లు వేయిస్తున్నారు. -
ఖమ్మంకు 25న సీఎం కేసీఆర్ రాక?
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా సీఎం కేసీఆర్ ఈనెల 25, 26 తేదీల్లో ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు తెలిసింది. ఈ మేరకు సమాచారం అందుకున్న పార్టీ నేతలు ప్రచార సభలకు ఏయే ప్రాంతాలను ఎంపిక చేయాలనే అంశంపై కసరత్తు చేస్తున్నారు. తొలుత క్షేత్రస్థాయి ఎన్నికల ప్రచారంపై దృష్టి సారించిన టీఆర్ఎస్.. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఈనెల 16వ తేదీన ఖమ్మంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నేతృత్వంలో జరగాల్సిన ఎన్నికల సన్నాహక సమావేశాన్ని సైతం రద్దు చేసుకుంది. ఎన్నికలకు సమయం సమీపించడం.. ప్రవర్తనా నియమావళి అమలులోకి రావడం.. జిల్లావ్యాప్తంగా పలుచోట్ల బహిరంగ సభలు నిర్వహించాల్సిన అవసరాన్ని గుర్తించిన పార్టీ నేతలు 16న జరగాల్సిన సమావేశాన్ని రద్దు చేసినట్లు తెలుస్తోంది. అదేరోజు ఉదయం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మూడు నియోజకవర్గాల పరిధిలో ఉన్న మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం సైతం రద్దయింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసేందుకు కేటీఆర్ సభ ఉపయోగపడుతుందని నేతలు భావించారు. అయితే ఎన్నికల సమయం ముంచుకురావడంతో ఖమ్మం, మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గాలపై టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ దృష్టి సారించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈనెల 25, 26 తేదీల్లో సీఎం కేసీఆర్ ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలోని ఒకటి, రెండు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు అవకాశం ఉందని సమాచారం. జిల్లా కేంద్రమైన ఖమ్మంతోపాటు ఖమ్మం లోక్‌సభ పరిధిలో ఉన్న కొత్తగూడెం లేదా అశ్వారావుపేటలో కేసీఆర్ ఎన్నికల ప్రచార సభ నిర్వహించేందుకు గల అవకాశాలను పార్టీ నేతలు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. వేడెక్కిన రాజకీయ వాతావరణం ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఆయా రాజకీయ పక్షాలు ఈ ఎన్నికల్లో తమ గెలుపు గుర్రాలను ఎంచుకునే పనిలో నిమగ్నం కాగా.. ఆయా పార్టీలకు చెందిన పలువురు నేతలు ఎంపీగా ఖమ్మం లోక్‌సభ నుంచి బరిలోకి దిగేందుకు పార్టీల నుంచి గ్రీన్‌సిగ్నల్ పొందేందుకు తమవంతు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈనెల 16న కేటీఆర్ ఖమ్మం జిల్లా కేంద్రంలో పర్యటించి.. పెవిలియన్ గ్రౌండ్లో జరిగే ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారని తొలుత కార్యక్రమం ఖరారైంది. ఆదివారం ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో స్వల్ప వ్యవధిలోనే బహిరంగ సభలు, సన్నాహక సభలు వేర్వేరుగా నిర్వహించడం వల్ల ఎదురయ్యే ఇబ్బందులు, క్షేత్రస్థాయిలో ప్రచారానికి కలిగే ఆటంకాలను పరిగణనలోకి తీసుకున్న టీఆర్ఎస్ నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభకే మొగ్గు చూపినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈనెల 18న ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావడంతోపాటు అదేరోజు నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. అయితే నామినేషన్లు స్వీకరించే తేదీ నాటికి ఖమ్మం టీఆర్ఎస్ అభ్యర్థిని అధికారికంగా ఖరారు చేస్తారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఉపసంహరణ తర్వాత ఎన్నికల ప్రచారానికి కేవలం 12 రోజులు మాత్రమే సమయం ఉండడంతో ఈ సమయాన్ని క్షేత్రస్థాయి ప్రచారం కోసం వెచ్చించాలని పార్టీ ముఖ్య నేతల నుంచి జిల్లా నేతలకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ తన పర్యటనకు ముందే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలతో సమావేశమై ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేస్తారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే కేటీఆర్ పాల్గొనాల్సిన ఖమ్మం లోక్‌సభ ఎన్నికల సన్నాహక సభకు పార్టీ వర్గాలు ఇప్పటికే పలు ఏర్పాట్లను పూర్తి చేశాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఒకరోజు ముందు వరకు సైతం కేటీఆర్ పర్యటన ఏర్పాట్లకు సంబంధించి ముఖ్య నేతలు సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించారు. ఇంతలోనే ఎన్నికల షెడ్యూల్ రావడం, ఎన్నికల ప్రచారానికి సమయం తక్కువగా ఉండడం వంటి కారణాలతో కేటీఆర్ ఎన్నికల సన్నాహక సభ మహబూబాబాద్, ఖమ్మం నియోజకవర్గాల్లో రద్దయినట్లు పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. -
‘సన్నాహక’ సమరభేరి
సాక్షిప్రతినిధి, వరంగల్: లోక్‌సభ ఎన్నికలకు కరీంనగర్ నుంచి సమర శంఖారావం పూరించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం వరంగల్ పార్లమెంట్ స్థాయి సన్నాహక సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఆయన ఉమ్మడి జిల్లాలోని రెండు ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవడమే త్వరలోనే షెడ్యూల్ విడుదల కానుందన్న ప్రచారం నేపథ్యంలో కేటీఆర్ ఎన్నికల శంఖారావం పూరించడంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. సన్నాహక సభ కోసం వరంగల్ తూర్పు నియోజకవర్గం పరిధిలోని ‘ఓ సిటీ’ మైదానం ముస్తాబైంది. వరంగల్ మహా నగరం మొత్తం గులాబీమయమైంది. ఏర్పాట్లు పూర్తి.. సన్నాహక సమావేశాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న గులాబీ నేతలు అందుకోసం భారీగా ఏర్పాట్లు చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సారథ్యంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. మంత్రి దయాకర్‌రావుతో పాటు మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపీలు పసునూరి దయాకర్, బండ ప్రకాశ్, ఎమ్మెల్యేలు దాస్యం వినయభాస్కర్, నన్నపనేని నరేందర్, చల్లా ధర్మారెడ్డి తదితరులు ఎప్పటికప్పుడు తగిన సూచనలు, సలహాలు ఇస్తూ ఏ లోటూ రాకుండా చర్యలు తీసుకున్నారు. ఈ సమావేశం ద్వారా సత్తా చాటేందుకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు. కేడర్‌కు దిశానిర్ధేశనం... టీఆర్ఎస్కు అన్ని విధాలా కలిసొచ్చే కరీంనగర్ వేదికగా కేటీఆర్ బుధవారం లోక్‌సభ ఎన్నికల శంఖారావం పూరించగా... తెలంగాణలో రెండో సన్నాహక సమావేశం వరంగల్‌లో నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బా«ధ్యతలు చేపట్టిన కేటీఆర్ మూడు నెలలుగా పార్టీ కార్యక్రమాలపై దృష్టి సారించారు. పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాలతో పాటు ఆయా జిల్లాల నేతలతో ముఖాముఖి, సమన్వయం చేయడంలో నిమగ్నమయ్యారు. లోక్‌సభ ఎన్నికలకు త్వరలోనే షెడ్యూల్ విడుదల అవుతుందన్న ప్రచారం మేరకు 16 లోక్‌సభ స్థానాల్లో టీఆర్ఎస్ విజయమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ సూచన మేరకు సన్నాహక సమావేశాలకు శ్రీకారం చుట్టారు. ఈ సమావేశాల నిర్వహణ పూర్తిగా కేటీఆర్ ఆధ్యర్యంలో జరుగుతుండగా, ఆయా జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలతో చర్చించి, షెడ్యూలు ఖరారు చేశారు. ఇందులో భాగంగానే గురువారం వరంగల్‌లో నిర్వహించే సన్నాహక సభకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. పార్టీ ఎన్నికల సమావేశమైనా బహిరంగ సభను మరిపించే రీతిలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో పార్టీ నేతలకు, కార్యకర్తలకు లోక్‌సభ ఎన్నికలపై కేటీఆర్ మార్గదర్శనం చేయనున్నారు. వరంగల్ లోక్‌సభ స్థానంలో జరిగిన అభివృద్ధి, ఎంపీ కృషి, రాష్ట్ర, జాతీయ స్థాయి అంశాలపై నిర్వహించిన పాత్ర, పార్టీని పటిష్ఠం చేసేందుకు జరిగిన కృషి తదితర అంశాలను ప్రస్తావించనున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, దేశానికి ఆదర్శంగా సాగుతున్న పాలన, అనేక సంక్షేమ పథకాలు, జాతీయ రాజకీయాల్లో పార్టీ పురోగమనం వంటి వాటిని ఆయన పార్టీ నేతలకు వివరించనున్నారు. కరీంనగర్ నుంచి వరంగల్ వేదికకు... కరీంనగర్ నుంచి బుధవారం లోక్‌సభ ఎన్నికల శంఖారావం పూరించిన కేటీఆర్ అక్కడే రాత్రి బస చేశారు. గురువారం ఉదయం కరీంనగర్ నుంచి బయలదేరనున్న ఆయనకు వరంగల్ అర్బన్ జిల్లా హసన్‌పర్తి వద్ద ఘనంగా స్వాగతం పలికేందుకు నేతలు ఏర్పాట్లు చేశారు. అనంతరం అక్కడి నుంచి మంత్రులు, ముఖ్యనేతలు వరంగల్ ఓ సిటీ మైదానం వరకు ఆయనను అనుసరిస్తారు. ఈ సమావేశంలో వరంగల్ తూర్పు, పశ్చిమ, పాలకుర్తి, పరకాల, వర్ధన్నపేట, భూపాలపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్పర్సన్, నగరపాలక సంస్థ మేయర్, పురపాలక సంఘాల ఛైర్మన్లు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, సర్పంచులు, రైతు సమన్వయ సమితి సభ్యులు తదితరులు పాల్గొననున్నారు. ఈ సమావేశం అనంతరం కేటీఆర్ మధ్యాహ్నం భువనగిరి పార్లమెంట్ స్థాయి సమావేశంలో పాల్గొనేందుకు బయలుదేరుతారు. హసన్‌పర్తి నుంచి భారీ ర్యాలీ.. కరీంనగర్ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఉదయం 10.30 గంటలకు హసన్పర్తికి వచ్చే కేటీఆర్‌కు అక్కడ భారీ స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి వందలాది వాహనాలతో వరంగల్ ఓ సిటీ సభాస్థలి వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. హసన్‌పర్తి నుంచి భీమారం, కాకతీయ యూనివర్సిటీ, నయీంనగర్ పెట్రోల్‌పంపు, హన్మకొండ చౌరస్తా, ములుగురోడ్, ఎంజీఎం సెంటర్, పోచమ్మ మైదాన్, కాశీబుగ్గ మీదుగా ఓ సిటీ మైదానం వరకు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలుకుతారు. ఇప్పటికే వరంగల్ మహానగరం మొత్తం గులాబీమయమైంది. ప్రతి చౌరస్తాలో గులాబీ జెండాలు, తోరణాలు ఏర్పాటు చేశారు. రహదారులు, చౌరస్తాల్లో కేటీఆర్‌కు స్వాగత ఫ్లెక్సీలు నెలకొల్పారు. -
నేడే టీఆర్ఎస్ సన్నాహక సభ
సాక్షి, యాదాద్రి : లోక్‌సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా టీఆర్ఎస్ నిర్వహిస్తోన్న భువనగిరి పార్లమెంటరీస్థాయి సన్నాహాక సమావేశం గురువారం జిల్లా కేంద్రంలో జరగనుంది. ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకమారావు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 2గంటలకు జరిగే సమావేశానికి సంబంధించి పార్టీ నాయకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సభా ప్రాంగణమంతా గులాబీమయంగా మార్చేశారు. 20వేల మందితో.. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి 20వేల మంది ప్రతినిధులతో ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. భువనగిరి, ఆలేరు, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి, జనగామ, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2వేల మంది ప్రతినిధులు రా వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సమావేశం జరుగుతున్న భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అదనంగా ప్రతినిధులు హాజరుకానున్నారు. సమావేశానికి హాజరయ్యే టీఆర్ఎస్ శ్రేణుల కోసం భోజన వసతులను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి భోజనాలు ప్రతినిధులకు అందుబాటులో ఉంటాయి. సమావేశానికి టీఆర్ఎస్ గ్రామ, మండల శాఖల అధ్యక్ష, కార్యదర్శులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు సహకార సంఘాల చైర్మన్లు, సర్పంచ్‌లు, ఉపసర్పంచ్లు, వార్డు మెంబర్లు రైతు సమన్వయ సమితి సభ్యులు, మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, వివిధ అనుబంధ సంఘాల ప్రతినిధులు, పార్టీ ప్రముఖులు హాజరవనున్నారు. ఏర్పాట్ల పరిశీలన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొనే సన్నాహక సమావేశ సభా ప్రాంగణాన్ని టీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు. ఎంపీలు బడుగుల లింగయ్య యాదవ్, డాక్టర్ బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి, గాదరి కిశోర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కొలుపుల అమరేందర్, మున్సిపల్ చైర్పర్సన్ నువ్వుల ప్రసన్న పరిశీలించి పలు సూచనలు చేశారు. వరంగల్‌లో సన్నాహక సభను పూర్తి చేసుకుని జిల్లాకు వస్తున్న కేటీఆర్‌కు పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి వంగపల్లి నుంచి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి రాయగిరి నుంచి సభా వేదిక వరకు భారీ బైక్ ర్యాలీతో స్వాగతం పలకడానికి సిద్ధమవుతున్నారు. -
‘ఈ రాహుల్‌కు కేసీఆర్ భయపడ్తడా’
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను సెప్టెంబర్‌లోనే ప్రకటిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. సోమవారం తెలంగాణభవన్‌లో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 9 తీర్మానాలను ఆమోదించారు. ఈ సమావేశంలో దేశ, రాష్ట్ర, పార్టీ, రాష్ట్ర ప్రభుత్వ పనితీరు వంటివాటిపై చర్చించారు. ఈ వివరాలతో పాటు పలు అంశాలపై మీడియాతో కేసీఆర్ మాట్లాడారు. ఎన్నికలకు ఆరునెలల ముందు ఊహాజనితాలు, అయోమయాన్ని తొలగించడానికి అభ్యర్థులను ముందుగానే ప్రకటిస్తామని స్పష్టంచేశారు. అభ్యర్థుల ఎంపికపై పూర్తి అధికారాన్ని పార్టీ అధ్యక్షుడిగా తనకే అప్పగించినట్టుగా వెల్లడించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో జరిగిన అభివృద్ధిని చెప్పేందుకు సెప్టెంబర్ 2న ‘ప్రగతి నివేదన సభ’పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని ప్రకటించారు. సభ నిర్వహణకు హైదరాబాద్ పరిసరాల్లోని ఔటర్ రింగు రోడ్డుకు దగ్గరలో మూడు ప్రాంతాలను పరిశీలిస్తున్నామన్నారు. శామీర్‌పేట, కొంగరకలాన్, బౌరంపేటలో 15 వందల ఎకరాల్లో సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తులు ఉండబోవని, ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తామని స్పష్టంచేశారు. సెప్టెంబర్‌లోనే అభ్యర్థులను ప్రకటించి, ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కోవడానికి పార్టీని సిద్ధం చేస్తున్నామని తెలిపారు. అభ్యర్థుల ఎంపిక కోసం పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు నేతృత్వంలో ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులతో వాస్తవ నివేదికలను తీసుకుంటున్నామని చెప్పారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇస్తామని, ఒకట్రెండు మినహా మార్పులు చాలా తక్కువగా ఉంటాయని తెలిపారు. లోక్‌సభకు పోటీ చేస్తారా అని ఓ విలేకరి ప్రశ్నించగా.. ‘‘ఇక్కడ ఉంటే (అసెంబ్లీలో) నాతో ఏమన్నా ఇబ్బందిగా ఉందా’’అంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారు. మిగిలిన అంశాలపై కేసీఆర్ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. ఈ రాహుల్‌కు కేసీఆర్ భయపడ్తడా? రాహుల్‌గాంధీ పరిణితిని, వివేకాన్ని పెంచుకుంటే మంచిది. ఎవరో రాసిస్తే చదవడం తగ్గించాలి. కాంగ్రెస్ హయాంలో తెలంగాణ మిగులు రాష్ట్రంగా ఉండేదట. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి ఎప్పుడొచ్చింది? మిగులు రాష్ట్రం ఎప్పుడైంది? ఇలాంటివి మాట్లాడి అభాసుపాలు కావొద్దు. జనం నవ్వుకుంటున్నరు. ప్రతిపక్షాలకు రాహుల్ ఆస్తిగా మారినట్టుగా అనుకుంటున్నరు. ఇది నిజమే అని రాహుల్‌గాంధీ ప్రవర్తన, మాటతీరుతో అనిపిస్తున్నది. ఆ కౌగిలింతలు, జోకులు, అర్భక మాటలు ఏంది? దేశంలో రాహుల్, మోదీ తప్ప ఎవరూ లేరా? ఇట్లాంటి రాహుల్‌కు కేసీఆర్ భయపడ్తడా? హైదరాబాద్‌లోనే ఉంటూ దక్షిణ భారతదేశంలో ప్రచారం చేసుకోవచ్చు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా, ఎక్కడైనా తిరగొచ్చు. ఓయూలోకి రానివ్వకుంటే నాకేం సంబంధం? అక్కడి వీసీ అనుమతించలేదు. ఓయూ, జేయూ ఎక్కడికైనా వెళ్లొచ్చు. ఓయూవాళ్లను సరూర్‌నగర్ పిలిపించుకోలేరా? ఎన్నికలంటే కొట్లాడాల్సిందే.. ఏకగ్రీవంగా అధికారం అప్పజెప్తరా? కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఇలాంటి మాటలు మాట్లాడవచ్చా? 22 లక్షల మందికి ఇళ్లు కట్టిస్తామని నేను హామీనిచ్చినట్టుగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అంటున్నడు. 2.60 లక్షల మందికి ఇళ్లు అని చెప్పినం, వాటిని పూర్తి చేస్తున్నం. ఇప్పటిదాకా 5 వేల ఇళ్లు కూడా కట్టలేదన్నడు. ఉత్తమ్ వస్తానంటే ఒక్క హైదరాబాద్‌లోనే, ఒక్క దగ్గరనే 5 వేల ఇళ్లు కట్టినవి చూపిస్తం. లక్ష ఉద్యోగాలు అని చెప్పినం.. చెప్పినన్ని ఉద్యోగాలు భర్తీ చేయడం పూర్తికావొస్తోంది. జైపాల్‌రెడ్డికి ముసలితనం వల్ల మతిభ్రమించింది. వయసు మీరిపోవడం వల్ల పిల్లచేష్టలతో గౌరవాన్ని తగ్గించుకుంటున్నడు. ఏమన్నా మాట్లాడితే వాస్తవం, వివేకం ఉండాలి. ఒకటి అంటే పది అంటం. మా కుటుంబ పాలన మంచిదే కుటుంబ పాలన అని రాహుల్ అంటున్నడు. కుటుంబ పాలనతో రాజకీయాల్లోకి వచ్చిన రాహుల్ ఆ మాట అంటే ప్రజలు నవ్వుతున్నరు. ఢిల్లీ కుటుంబ పాలన కంటే మా కుటుంబ పాలన మంచిదే. వాళ్లు స్వాతంత్య్రం కోసం ఏం కొట్లాడినరో లేదో కానీ మా కుటుంబం కూడా తెలంగాణ కోసం కొట్లాడింది. కుటుంబ పాలనలతో తప్పేమీ లేదు. ఢిల్లీకి బానిసలుగా ఉండే సంప్రదాయానికి గతంలో ఎన్టీఆర్, ఇప్పుడు టీఆర్ఎస్ గండికొట్టింది. మంత్రివర్గ విస్తరణ చేయాలన్నా, ఏ చిన్న పనిచేయాలన్నా ఢిల్లీ అనుమతి కోసం, ఆదేశం కోసం చూడాలి. ఢిల్లీ ఎస్ అంటే ఎస్, నో అంటే నో. ఇవన్నీ మర్చిపోయి రాహుల్‌గాంధీ ఏది పడితే అది, ఎట్ల పడితే అట్లా మాట్లాడితే అయితదా? ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ, నిరుద్యోగ భృతిపై కాంగ్రెస్ నేతలు మోసపూరితంగా మాట్లాడుతున్నరు. ఆపదమొక్కులతో ప్రజలను మోసం చేయడానికి నిరుద్యోగ భృతి చెబుతున్నరు. నిరుద్యోగులంటే ఎవరు? ఎంతమందికి ఇస్తారో చెప్తారా? కాంగ్రెస్ వచ్చేది లేదు, హామీలను అమలు చేసేదీ లేదు. కాంగ్రెస్ కూడా ఒక ప్రాంతీయపార్టీగా మారింది. ఆ పార్టీకి అధికారంలోకి వచ్చే శక్తి లేదు. ఏమన్నా మాట్లాడితే సంస్కారం, పద్దతి, వివేకం ఉండాలి. త్వరలో నవీన్ పట్నాయక్‌ను కలుస్తా కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు అవుతుంది. ఇది ఆషామాషీ, చిల్లర రాజకీయ వ్యవహారం కాదు. దేశంలో విద్య, రోడ్లు, రైళ్లు వంటివాటిలో ప్రపంచ దేశాలతో పోలిస్తే చాలా వెనుకబడి ఉన్నాం. దేశంలో గుణాత్మక మార్పు రావాలి. దానికి ఏవో రెండు పార్టీలను కూడగట్టి, చిల్లర మల్లర రాజకీయాలు చేయడం కాదు. భవిష్యత్ తరాల కోసం, దీర్ఘకాలిక ప్రయోజనాలకోసం ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కావాల్సిందే. కాంగ్రెస్, బీజేపీలు వైఫల్యం చెందాయి. త్వరలోనే ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్‌ను కలుస్తా. కాంగ్రెస్, బీజేపీలు దేశంలోని 130 కోట్ల మందితో పరాచికాలు ఆడుతున్నాయి. ఇక్కడ పుట్టినవారంతా తెలంగాణ బిడ్డలే.. ఇక్కడ పుట్టినవారంతా తెలంగాణ బిడ్డలే. సీమాంధ్రవారే కాదు తమిళనాడు, కేరళ, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల వారూ ఇక్కడ పుడితే పరాయివాళ్లు అయితరా? టీఆర్ఎస్ ఆవిర్భావంలోనే.. పొట్టకూటి కోసం వచ్చిన వారితో కొట్లాట లేదని, పొట్టకొట్టే వారితోనే పంచాయితీ అని చెప్పినం. అదే మాటకు కట్టుబడి ఉన్నాం. తెలంగాణలో పెట్టుబడి పెట్టేవారికి ఎర్ర తివాచీ పరుస్తామని అప్పుడే చెప్పినం. ఇప్పుడదే చేస్తున్నం. సెటిలర్లకు టికెట్లు ఇచ్చినం. కాంగ్రెస్ వాళ్లు ఇస్తామంటే, ఎంత మందికి ఇస్తారో చూద్దాం. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సెటిలర్లకు టికెట్లు ఇచ్చి, గెలిపించినం. అసెంబ్లీ ఎన్నికల్లోనూ అవకాశం ఇస్తాం. అమెరికాలో పుడితే గ్రీన్‌కార్డు ఇస్తున్నరు. తెలంగాణలో పుడితే పరాయివాళ్లుగా ఎలా చూస్తాం. అది మంత్రులకు కూడా తెలియదు.. అసెంబ్లీ రద్దు చేస్తామని ఎలా చెప్తాం? రద్దు చేయాలనుకుంటే మంత్రివర్గ సభ్యులకు కూడా తెలియదు. ఇప్పుడు ఎన్నికల పరిధిలోకి వచ్చినం.. ఇప్పుడు ఎన్నికలు వచ్చినా ముందస్తు ఎన్నికలు కాదు.. మిగిలిన రాష్ట్రాల్లో ఎన్నికలు వస్తే వాటితో కలిసి వచ్చినా షెడ్యూలు ప్రకారం ఎన్నికలు జరిగినట్టే. ముందస్తు అనుకోవడమే సరికాదు. దేశంలో జమిలి ఎన్నికలు సాధ్యం కాదు. బీజేపీతో లోపాయికారీ ఒప్పందం అనడంలో అర్థం లేదు. కేసీఆర్ ఏది చేసినా బాజాప్తా, అందరికీ చెప్పి చేస్తడు. లోపాయికారీ ఒప్పందాలు, చీకటి ఒప్పందాలు అవసరం లేదు. ఎన్నికల గురించి అంతా ఇప్పుడే చెప్తే మజా ఏముంటది? రెండు ఎన్నికలు కలిసి వస్తాయా, రావా అని చెప్పడానికి జ్యోతిషుడ్ని కాదు. లోక్‌సభ ఎన్నికలు నా చేతిలో ఉంటయా? బీజేపీ మాటలు తియ్యగా ఉన్నా, చేతల్లో లేదు. బీజేపీ నేతల విమర్శలకు, ఆశలకు అర్థం లేదు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గం తీర్మానాలివీ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న అన్ని హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలి. విభజన ప్రక్రియను పూర్తి చేయాలి కేంద్రం కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకపోతే రూ.20 వేల కోట్ల నిధులు ఇవ్వాలి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరలలో వరి, మొక్కజొన్నకు తక్కువగా నిర్ణయించింది. ఈ రెండు పంటలకు క్వింటాల్‌కు రూ.2 వేలు ఇవ్వాలి ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి ఎస్టీ, మైనారిటీల విషయంలో తెలంగాణలో ప్రత్యేక పరిస్థితి ఉంది. ఈ వర్గాల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లను పెంచుకునే అధికారం రాష్ట్రానికి ఇవ్వాలి ఎస్సీ వర్గీకరణపై కేంద్రం వెంటనే నిర్ణయం తీసుకోవాలి అధిక సంఖ్యలో జనాభా ఉండే బీసీ వర్గాల కోసం కేంద్ర ప్రభుత్వంలో బీసీ సంక్షేమ శాఖను ఏర్పాటు చేయాలి బీసీలకు, మహిళలకు చట్టసభలో రిజర్వేషన్లు కల్పించాలి. అవసరమైతే లోక్‌సభ సీట్లను పెంచాలి వ్యవసాయం, విద్య, ఆరోగ్య వంటి అంశాలపై పూర్తి అధికారాలు రాష్ట్రాల పరిధిలోనే ఉండాలి -
సెప్టెంబర్‌లోనే అభ్యర్థుల ప్రకటన: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికలకు సెప్టెంబర్‌లోనే తమ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తామని, ఎవరితో పొత్తు ఉండదని, ఒంటిరిగానే పోటీ చేస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. సోమవారం తెలంగాణ భవన్లో ఆయన అధ్యక్షతన టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశ అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. సమావేశంలో పార్టీ తరపున 9 తీర్మానాలు చేసినట్లు తెలిపారు. ‘విభజన హామీలు అమలు చేయాలి. కాలేశ్వం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకపోయినా రూ.20 వేల కోట్లు ఇవ్వాలి. వరి, మొక్కజొన్నలకు రూ. 2వేల చొప్పున మద్దతు ధర ప్రకటించాలి. ఎస్టీ, మైనార్టీల రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చి అమలు చేయాలి. బీసీల సంక్షేమం కోసం మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలి. నీతి అయోగ్ వల్ల దేశానికి ఒరిగిందేమి లేదు. నీతి అయోగ్ అసలు ఉద్దేశం వేరు.. కేంద్రం అనుసరిస్తున్న పద్ధతి వేరు. నీతి అయోగ్ పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్లుగా ఉంది. ఇప్పుడు పెరిగిన దేశ జనాభాకు అనుగుణంగా పార్లమెంటు స్థానాలు పెంచాలి. కేంద్రం సమాఖ్య విధానానికి తూట్లు పొడుస్తోంది. అధికార కేంద్రీకరణ చేస్తూ రాష్ర్టాలను మున్సిపాలిటీల్లాగా చూస్తున్నారు. రాష్ర్టాలకు మరింత స్వేచ్ఛ కావాలని గట్టిగా చెబుతున్నాం.విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, రూరల్, అర్బన్ సంక్షేమాలను రాష్ట్రాలకు వదిలేయాలి. బీసీలు, మహిళలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలి.’ అని తీర్మానించినట్లు కేసీఆర్ పేర్కొన్నారు. సెప్టెంబర్ 2న హైదరాబాద్‌లో ‘ప్రగతి నివేదన’ పేరిట టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ ఉంటుందన్నారు. రాహుల్ పరిణితి చెందాలి.. రాహుల్ మాట్లాడటంలో పరిణితి చెందాలని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టడం లేదన్న ఆయన ఆరోపణల్లో నిజం లేదన్నారు. రాహుల్ తమని కుటుంబ పాలన అనడం హాస్యాస్పదమన్నారు. ఢిల్లీ కుటుంబ పాలన కంటే తమ కటుంబ పాలనే బెటర్ అని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ 100కు పైగా సీట్లలో గెలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెసేతర, బీజేపీయేతర ఫెడరల్ ఫ్రంట్ తమదని స్పష్టం చేశారు. ఏక కాలంలో రూ.2 లక్షల రుణమాఫీ సాధ్యం కాదని, దశలవారిగా చేయాల్సిందేనన్నారు. నిరుద్యోగ భృతిపై కాంగ్రెస్‌ను నిలదీస్తామన్నారు. ఎంతమంది నిరుద్యోగులకు, ఏ లెక్కన భృతి ఇస్తారో చెప్పాలని ప్రశ్నించారు. బోగస్ పథకాలను మేం అమలు చేయడం లేదన్నారు. ఎన్నికలకు ఆరునెలల ముందు ముందస్తు అనలేమని, ఈ ఆరు నెలల కాలంలో ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించవచ్చని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకం ఆయుష్మాన్ భారత్ కంటే గొప్ప పథకాన్ని తమ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఆయుష్మాన్ భారత్ కోసం తెలంగాణ సాఫ్ట్వేర్ తీసుకున్నారని చెప్పారు. రైతు బీమ మొత్తం తమ ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. -
మాటా ముచ్చట..
తెలంగాణ రాష్ట్ర సమితి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ‘ఆపరేషన్ ఆకర్ష్ ను మరింత వేగంగా అమలు చేసేందుకు పావులు కదుపుతోంది. ఈ మేరకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశనం చేసేందుకు అధిష్టానం అన్నిస్థాయిల్లో నూ చర్యలు చేపట్టింది. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం, తదనంతరం చోటుచేసుకున్న పరిణామాలపై మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర కీలక ప్రజాప్రతినిధులు, నేతలకు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఇటీవలే మార్గదర్శనం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రజా›ప్రతినిధులు, సీనియర్లతో ఈనెల 3న ప్రగతిభవన్‌లో కీలక సమావేశం కూడా నిర్వహించారు. ఆ మరుసటి రోజు నుంచే చేరికలపై దృష్టి సారించిన టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ ముఖ్యనేతలతో మంతనాలు సాగిస్తున్నారు. మంథ ని, హుజూరాబాద్, సిరిసిల్ల నియోజకవర్గాల్లో ఇప్పటికే కాంగ్రెస్, టీడీపీల నుంచి వలసలు మొదలు కాగా, పూర్వ జిల్లా కరీంనగర్ కేంద్రంగా బుధవారం బైపాస్‌రోడ్డు (బొమ్మకల్) శివారులోని ‘వి’ కన్వెన్షన్ హాల్లో ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాజకీయంగా ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు, అన్ని రాజకీయ పార్టీలు ‘ఆపరేషన్ ఆకర్ష్’పై దృష్టి సారించిన నేపథ్యంలో టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా కార్యకర్తల సమావేశం నిర్వహించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే.. ఉమ్మడి జిల్లా పార్టీ శ్రేణులకు ప్రభుత్వం పనితీరు, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును వివరించడంతోపాటు వారిలో ఉత్సాహం నింపేందుకు కరీంనగర్ వేదికగా సమావేశం నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 2014 సాధారణ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా పరిధిలో 13 శాసనసభ స్థానాలకు గాను 12 స్థానాల్లో విజయం సాధించడం, మూడు ఎంపీ, ఎమ్మెల్సీ స్థానాలను, జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకోవడంతో తిరుగులేని శక్తిగా పార్టీ నిలిచింది. ఆ విధంగానే రానున్న ఎన్నికల్లో అదే స్ఫూర్తిని కొనసాగించేలా క్యాడర్ అప్రమత్తం కావాలని పిలుపునిచ్చేందుకే కీలక సమావేశంగా చెబుతున్నారు. ఇదే క్రమంలో గ్రామ, మండల స్థాయిల్లో ప్రభావితం చేసే నేతలను గుర్తించి వారిని పార్టీలోకి తీసుకొచ్చే బాధ్యతను భుజస్కంధాలపై వేసుకొని పార్టీని రానున్న ఎన్నికల్లో మరింత బలోపేతం చేసే దిశగా క్యాడర్‌కి దిశానిర్దేశనం చేయనున్నారు. కాగా.. ఉమ్మడి జిల్లా పరిధిలో ఆపరేషన్ ఆకర్ష్ పై మంత్రి ఈటల రాజేందర్ ఇతర ప్రజాప్రతినిధులను కలుపుకుని కీలకంగా వ్యవహరిస్తుండగా.. ఇప్పటికే మంథని, హుజూరాబాద్ నియోజకవర్గాల నుంచి పార్టీలోకి వలసలు మొదలయ్యాయి. ఇదే సమయంలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, గత ప్రభుత్వాల హయాంలోని లోటుపాట్లను ఎత్తిచూపుతూ క్షేత్రస్థాయిలో విస్తృతమైన ప్రచారం చేపట్టి పార్టీని ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేయాలని సమాయత్తం చేయడం ముఖ్యోద్దేశమని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఉమ్మడి జిల్లా శ్రేణులకు ఇన్చార్జీల పరిచయం.. కార్యకర్తలతో మాటా ముచ్చట.. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా టీఆర్ఎస్ అధినేత నియోజకవర్గం, జిల్లా బాధ్యులను నియమించారు. పార్టీ రాష్ట్ర కమిటీలో కార్యదర్శి, సహాయ కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి హోదాలలో ఉన్న పలువురు సీనియర్లకు అవకాశం కల్పించారు. జిల్లాకు చెందిన సీనియర్లు ఒక్కొక్కరికి మూడు నుంచి నాలుగు నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించిన కేసీఆర్, పొరుగు జిల్లాకు చెందిన సీనియర్‌ను జిల్లా ఇన్చార్జి జనరల్ సెక్రెటరీగా నియమించారు. మాజీ మంత్రి, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బస్వరాజు సారయ్యను పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి జనరల్ సెక్రెటరీగా నియమించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 నియోజకవర్గాలకు నలుగురు బాధ్యులను నియమించారు. మంత్రి ఈటల రాజేందర్ ప్రాతినిధ్య వహిస్తున్న హుజూరాబాద్‌తోపాటు హుస్నాబాద్, మానకొండూరు నియోజకవర్గాల ఇన్చార్జి బాధ్యతలను పోలీసు హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తకు అప్పగించారు. ఎమ్మెల్సీ తానిపర్తి భానుప్రసాద్‌రావుకు సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల, కోరుట్లలు, సిరిసిల్ల అర్బన్ బ్యాంకు మాజీ అధ్యక్షుడు గూడూరి ప్రవీణ్‌కు కరీంనగర్, చొప్పదండి, ధర్మపురి, కర్ర శ్రీహరికి పెద్దపల్లి, మంథని, రామగుండం నియోజకవర్గాల ఇన్‌చార్జీలుగా నియమించారు. కాగా.. అన్నిస్థాయిల్లో పార్టీని బలోపేతం చేయడం లక్ష్యంగా క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలను విస్తరించే దశలో బుధవారం నిర్వహించే సమావేశం ద్వారా ఉమ్మడి జిల్లా కార్యకర్తలను కొత్త ఇన్చార్జీల ద్వారా కలుసుకోనున్నారు. కీలకంగా మారిన ఈ సమావేశానికి మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్, ఎంపీలు వినోద్‌కుమార్, సుమన్, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు కార్యకర్తలు హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. -
టీఆర్ఎస్ ఎల్పీ, పార్లమెంటరీ పార్టీ భేటీ
హైదరాబాద్: టీఆర్ఎస్ శాసనసభా పక్షం, పార్లమెంటరీ పార్టీ సమావేశం బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో హైకోర్టు విభజన, కొత్త జిల్లాల ఏర్పాటు, సాగునీటి ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.