సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికలకు సెప్టెంబర్‌లోనే తమ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తామని, ఎవరితో పొత్తు ఉండదని, ఒంటిరిగానే పోటీ చేస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఆయన అధ్యక్షతన టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశ అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. సమావేశంలో పార్టీ తరపున 9 తీర్మానాలు చేసినట్లు తెలిపారు.
‘విభజన హామీలు అమలు చేయాలి. కాలేశ్వం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకపోయినా రూ.20 వేల కోట్లు ఇవ్వాలి. వరి, మొక్కజొన్నలకు రూ. 2వేల చొప్పున మద్దతు ధర ప్రకటించాలి. ఎస్టీ, మైనార్టీల రిజర్వేషన్లను 9వ షెడ్యూల్‌లో చేర్చి అమలు చేయాలి. బీసీల సంక్షేమం కోసం మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలి. నీతి అయోగ్ వల్ల దేశానికి ఒరిగిందేమి లేదు. నీతి అయోగ్ అసలు ఉద్దేశం వేరు.. కేంద్రం అనుసరిస్తున్న పద్ధతి వేరు. నీతి అయోగ్ పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్లుగా ఉంది. ఇప్పుడు పెరిగిన దేశ జనాభాకు అనుగుణంగా పార్లమెంటు స్థానాలు పెంచాలి. కేంద్రం సమాఖ్య విధానానికి తూట్లు పొడుస్తోంది. అధికార కేంద్రీకరణ చేస్తూ రాష్ర్టాలను మున్సిపాలిటీల్లాగా చూస్తున్నారు. రాష్ర్టాలకు మరింత స్వేచ్ఛ కావాలని గట్టిగా చెబుతున్నాం.విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, రూరల్, అర్బన్ సంక్షేమాలను రాష్ట్రాలకు వదిలేయాలి. బీసీలు, మహిళలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలి.’ అని తీర్మానించినట్లు కేసీఆర్ పేర్కొన్నారు. సెప్టెంబర్ 2న హైదరాబాద్‌లో ‘ప్రగతి నివేదన’ పేరిట టీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభ ఉంటుందన్నారు.
రాహుల్ పరిణితి చెందాలి..
రాహుల్ మాట్లాడటంలో పరిణితి చెందాలని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టడం లేదన్న ఆయన ఆరోపణల్లో నిజం లేదన్నారు. రాహుల్ తమని కుటుంబ పాలన అనడం హాస్యాస్పదమన్నారు. ఢిల్లీ కుటుంబ పాలన కంటే తమ కటుంబ పాలనే బెటర్ అని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ 100కు పైగా సీట్లలో గెలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెసేతర, బీజేపీయేతర ఫెడరల్ ఫ్రంట్ తమదని స్పష్టం చేశారు. ఏక కాలంలో రూ.2 లక్షల రుణమాఫీ సాధ్యం కాదని, దశలవారిగా చేయాల్సిందేనన్నారు. నిరుద్యోగ భృతిపై కాంగ్రెస్‌ను నిలదీస్తామన్నారు. ఎంతమంది నిరుద్యోగులకు, ఏ లెక్కన భృతి ఇస్తారో చెప్పాలని ప్రశ్నించారు. బోగస్ పథకాలను మేం అమలు చేయడం లేదన్నారు. ఎన్నికలకు ఆరునెలల ముందు ముందస్తు అనలేమని, ఈ ఆరు నెలల కాలంలో ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించవచ్చని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకం ఆయుష్మాన్ భారత్ కంటే గొప్ప పథకాన్ని తమ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఆయుష్మాన్ భారత్ కోసం తెలంగాణ సాఫ్ట్‌వేర్ తీసుకున్నారని చెప్పారు. రైతు బీమ మొత్తం తమ ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment