‘ఈ రాహుల్‌కు కేసీఆర్‌ భయపడ్తడా’ | KCR Says TRS MLA Candidates Will Announce In September | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్‌లోనే అభ్యర్థుల ఖరారు

Published Tue, Aug 14 2018 2:07 AM | Last Updated on Thu, Sep 6 2018 2:53 PM

KCR Says TRS MLA Candidates Will Announce In September - Sakshi

సోమవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్‌. చిత్రంలో బసవరాజు సారయ్య, కెకె, రాజేశ్వర్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, గుండు సుధారాణి తదితరులు

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను సెప్టెంబర్‌లోనే ప్రకటిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. సోమవారం తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 9 తీర్మానాలను ఆమోదించారు. ఈ సమావేశంలో దేశ, రాష్ట్ర, పార్టీ, రాష్ట్ర ప్రభుత్వ పనితీరు వంటివాటిపై చర్చించారు. ఈ వివరాలతో పాటు పలు అంశాలపై మీడియాతో కేసీఆర్‌ మాట్లాడారు. ఎన్నికలకు ఆరునెలల ముందు ఊహాజనితాలు, అయోమయాన్ని తొలగించడానికి అభ్యర్థులను ముందుగానే ప్రకటిస్తామని స్పష్టంచేశారు. అభ్యర్థుల ఎంపికపై పూర్తి అధికారాన్ని పార్టీ అధ్యక్షుడిగా తనకే అప్పగించినట్టుగా వెల్లడించారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో జరిగిన అభివృద్ధిని చెప్పేందుకు సెప్టెంబర్‌ 2న ‘ప్రగతి నివేదన సభ’పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని ప్రకటించారు.

సభ నిర్వహణకు హైదరాబాద్‌ పరిసరాల్లోని ఔటర్‌ రింగు రోడ్డుకు దగ్గరలో మూడు ప్రాంతాలను పరిశీలిస్తున్నామన్నారు. శామీర్‌పేట, కొంగరకలాన్, బౌరంపేటలో 15 వందల ఎకరాల్లో సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తులు ఉండబోవని, ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తామని స్పష్టంచేశారు. సెప్టెంబర్‌లోనే అభ్యర్థులను ప్రకటించి, ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కోవడానికి పార్టీని సిద్ధం చేస్తున్నామని తెలిపారు. అభ్యర్థుల ఎంపిక కోసం పార్టీ సెక్రటరీ జనరల్‌ కె.కేశవరావు నేతృత్వంలో ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులతో వాస్తవ నివేదికలను తీసుకుంటున్నామని చెప్పారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇస్తామని, ఒకట్రెండు మినహా మార్పులు చాలా తక్కువగా ఉంటాయని తెలిపారు. లోక్‌సభకు పోటీ చేస్తారా అని ఓ విలేకరి ప్రశ్నించగా.. ‘‘ఇక్కడ ఉంటే (అసెంబ్లీలో) నాతో ఏమన్నా ఇబ్బందిగా ఉందా’’అంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారు. మిగిలిన అంశాలపై కేసీఆర్‌ ఏమన్నారో ఆయన మాటల్లోనే..

ఈ రాహుల్‌కు కేసీఆర్‌ భయపడ్తడా?
రాహుల్‌గాంధీ పరిణితిని, వివేకాన్ని పెంచుకుంటే మంచిది. ఎవరో రాసిస్తే చదవడం తగ్గించాలి. కాంగ్రెస్‌ హయాంలో తెలంగాణ మిగులు రాష్ట్రంగా ఉండేదట. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి ఎప్పుడొచ్చింది? మిగులు రాష్ట్రం ఎప్పుడైంది? ఇలాంటివి మాట్లాడి అభాసుపాలు కావొద్దు. జనం నవ్వుకుంటున్నరు. ప్రతిపక్షాలకు రాహుల్‌ ఆస్తిగా మారినట్టుగా అనుకుంటున్నరు. ఇది నిజమే అని రాహుల్‌గాంధీ ప్రవర్తన, మాటతీరుతో అనిపిస్తున్నది. ఆ కౌగిలింతలు, జోకులు, అర్భక మాటలు ఏంది? దేశంలో రాహుల్, మోదీ తప్ప ఎవరూ లేరా? ఇట్లాంటి రాహుల్‌కు కేసీఆర్‌ భయపడ్తడా? హైదరాబాద్‌లోనే ఉంటూ దక్షిణ భారతదేశంలో ప్రచారం చేసుకోవచ్చు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా, ఎక్కడైనా తిరగొచ్చు. ఓయూలోకి రానివ్వకుంటే నాకేం సంబంధం? అక్కడి వీసీ అనుమతించలేదు. ఓయూ, జేయూ ఎక్కడికైనా వెళ్లొచ్చు. ఓయూవాళ్లను సరూర్‌నగర్‌ పిలిపించుకోలేరా? ఎన్నికలంటే కొట్లాడాల్సిందే.. ఏకగ్రీవంగా అధికారం అప్పజెప్తరా? కాంగ్రెస్‌ వంటి జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఇలాంటి మాటలు మాట్లాడవచ్చా? 22 లక్షల మందికి ఇళ్లు కట్టిస్తామని నేను హామీనిచ్చినట్టుగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అంటున్నడు. 2.60 లక్షల మందికి ఇళ్లు అని చెప్పినం, వాటిని పూర్తి చేస్తున్నం. ఇప్పటిదాకా 5 వేల ఇళ్లు కూడా కట్టలేదన్నడు. ఉత్తమ్‌ వస్తానంటే ఒక్క హైదరాబాద్‌లోనే, ఒక్క దగ్గరనే 5 వేల ఇళ్లు కట్టినవి చూపిస్తం. లక్ష ఉద్యోగాలు అని చెప్పినం.. చెప్పినన్ని ఉద్యోగాలు భర్తీ చేయడం పూర్తికావొస్తోంది. జైపాల్‌రెడ్డికి ముసలితనం వల్ల మతిభ్రమించింది. వయసు మీరిపోవడం వల్ల పిల్లచేష్టలతో గౌరవాన్ని తగ్గించుకుంటున్నడు. ఏమన్నా మాట్లాడితే వాస్తవం, వివేకం ఉండాలి. ఒకటి అంటే పది అంటం.

మా కుటుంబ పాలన మంచిదే
కుటుంబ పాలన అని రాహుల్‌ అంటున్నడు. కుటుంబ పాలనతో రాజకీయాల్లోకి వచ్చిన రాహుల్‌ ఆ మాట అంటే ప్రజలు నవ్వుతున్నరు. ఢిల్లీ కుటుంబ పాలన కంటే మా కుటుంబ పాలన మంచిదే. వాళ్లు స్వాతంత్య్రం కోసం ఏం కొట్లాడినరో లేదో కానీ మా కుటుంబం కూడా తెలంగాణ కోసం కొట్లాడింది. కుటుంబ పాలనలతో తప్పేమీ లేదు. ఢిల్లీకి బానిసలుగా ఉండే సంప్రదాయానికి గతంలో ఎన్టీఆర్, ఇప్పుడు టీఆర్‌ఎస్‌ గండికొట్టింది. మంత్రివర్గ విస్తరణ చేయాలన్నా, ఏ చిన్న పనిచేయాలన్నా ఢిల్లీ అనుమతి కోసం, ఆదేశం కోసం చూడాలి. ఢిల్లీ ఎస్‌ అంటే ఎస్, నో అంటే నో. ఇవన్నీ మర్చిపోయి రాహుల్‌గాంధీ ఏది పడితే అది, ఎట్ల పడితే అట్లా మాట్లాడితే అయితదా? ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ, నిరుద్యోగ భృతిపై కాంగ్రెస్‌ నేతలు మోసపూరితంగా మాట్లాడుతున్నరు. ఆపదమొక్కులతో ప్రజలను మోసం చేయడానికి నిరుద్యోగ భృతి చెబుతున్నరు. నిరుద్యోగులంటే ఎవరు? ఎంతమందికి ఇస్తారో చెప్తారా? కాంగ్రెస్‌ వచ్చేది లేదు, హామీలను అమలు చేసేదీ లేదు. కాంగ్రెస్‌ కూడా ఒక ప్రాంతీయపార్టీగా మారింది. ఆ పార్టీకి అధికారంలోకి వచ్చే శక్తి లేదు. ఏమన్నా మాట్లాడితే సంస్కారం, పద్దతి, వివేకం ఉండాలి.

త్వరలో నవీన్‌ పట్నాయక్‌ను కలుస్తా
కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలతో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు అవుతుంది. ఇది ఆషామాషీ, చిల్లర రాజకీయ వ్యవహారం కాదు. దేశంలో విద్య, రోడ్లు, రైళ్లు వంటివాటిలో ప్రపంచ దేశాలతో పోలిస్తే చాలా వెనుకబడి ఉన్నాం. దేశంలో గుణాత్మక మార్పు రావాలి. దానికి ఏవో రెండు పార్టీలను కూడగట్టి, చిల్లర మల్లర రాజకీయాలు చేయడం కాదు. భవిష్యత్‌ తరాల కోసం, దీర్ఘకాలిక ప్రయోజనాలకోసం ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు కావాల్సిందే. కాంగ్రెస్, బీజేపీలు వైఫల్యం చెందాయి. త్వరలోనే ఒరిస్సా సీఎం నవీన్‌ పట్నాయక్‌ను కలుస్తా. కాంగ్రెస్, బీజేపీలు దేశంలోని 130 కోట్ల మందితో పరాచికాలు ఆడుతున్నాయి.

ఇక్కడ పుట్టినవారంతా తెలంగాణ బిడ్డలే..
ఇక్కడ పుట్టినవారంతా తెలంగాణ బిడ్డలే. సీమాంధ్రవారే కాదు తమిళనాడు, కేరళ, గుజరాత్, రాజస్థాన్‌ రాష్ట్రాల వారూ ఇక్కడ పుడితే పరాయివాళ్లు అయితరా? టీఆర్‌ఎస్‌ ఆవిర్భావంలోనే.. పొట్టకూటి కోసం వచ్చిన వారితో కొట్లాట లేదని, పొట్టకొట్టే వారితోనే పంచాయితీ అని చెప్పినం. అదే మాటకు కట్టుబడి ఉన్నాం. తెలంగాణలో పెట్టుబడి పెట్టేవారికి ఎర్ర తివాచీ పరుస్తామని అప్పుడే చెప్పినం. ఇప్పుడదే చేస్తున్నం. సెటిలర్లకు టికెట్లు ఇచ్చినం. కాంగ్రెస్‌ వాళ్లు ఇస్తామంటే, ఎంత మందికి ఇస్తారో చూద్దాం. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సెటిలర్లకు టికెట్లు ఇచ్చి, గెలిపించినం. అసెంబ్లీ ఎన్నికల్లోనూ అవకాశం ఇస్తాం. అమెరికాలో పుడితే గ్రీన్‌కార్డు ఇస్తున్నరు. తెలంగాణలో పుడితే పరాయివాళ్లుగా ఎలా చూస్తాం.

అది మంత్రులకు కూడా తెలియదు..
అసెంబ్లీ రద్దు చేస్తామని ఎలా చెప్తాం? రద్దు చేయాలనుకుంటే మంత్రివర్గ సభ్యులకు కూడా తెలియదు. ఇప్పుడు ఎన్నికల పరిధిలోకి వచ్చినం.. ఇప్పుడు ఎన్నికలు వచ్చినా ముందస్తు ఎన్నికలు కాదు.. మిగిలిన రాష్ట్రాల్లో ఎన్నికలు వస్తే వాటితో కలిసి వచ్చినా షెడ్యూలు ప్రకారం ఎన్నికలు జరిగినట్టే. ముందస్తు అనుకోవడమే సరికాదు. దేశంలో జమిలి ఎన్నికలు సాధ్యం కాదు. బీజేపీతో లోపాయికారీ ఒప్పందం అనడంలో అర్థం లేదు. కేసీఆర్‌ ఏది చేసినా బాజాప్తా, అందరికీ చెప్పి చేస్తడు. లోపాయికారీ ఒప్పందాలు, చీకటి ఒప్పందాలు అవసరం లేదు. ఎన్నికల గురించి అంతా ఇప్పుడే చెప్తే మజా ఏముంటది? రెండు ఎన్నికలు కలిసి వస్తాయా, రావా అని చెప్పడానికి జ్యోతిషుడ్ని కాదు. లోక్‌సభ ఎన్నికలు నా చేతిలో ఉంటయా? బీజేపీ మాటలు తియ్యగా ఉన్నా, చేతల్లో లేదు. బీజేపీ నేతల విమర్శలకు, ఆశలకు అర్థం లేదు.  

టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గం తీర్మానాలివీ..

  • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలో పేర్కొన్న అన్ని హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలి. విభజన ప్రక్రియను పూర్తి చేయాలి
  • కేంద్రం కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకపోతే రూ.20 వేల కోట్ల నిధులు ఇవ్వాలి
  • ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరలలో వరి, మొక్కజొన్నకు తక్కువగా నిర్ణయించింది. ఈ రెండు పంటలకు క్వింటాల్‌కు రూ.2 వేలు ఇవ్వాలి
  • ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి
  • ఎస్టీ, మైనారిటీల విషయంలో తెలంగాణలో ప్రత్యేక పరిస్థితి ఉంది. ఈ వర్గాల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లను పెంచుకునే అధికారం రాష్ట్రానికి ఇవ్వాలి
  • ఎస్సీ వర్గీకరణపై కేంద్రం వెంటనే నిర్ణయం తీసుకోవాలి
  • అధిక సంఖ్యలో జనాభా ఉండే బీసీ వర్గాల కోసం కేంద్ర ప్రభుత్వంలో బీసీ సంక్షేమ శాఖను ఏర్పాటు చేయాలి
  • బీసీలకు, మహిళలకు చట్టసభలో రిజర్వేషన్లు కల్పించాలి. అవసరమైతే లోక్‌సభ సీట్లను పెంచాలి
  • వ్యవసాయం, విద్య, ఆరోగ్య వంటి అంశాలపై పూర్తి అధికారాలు రాష్ట్రాల పరిధిలోనే ఉండాలి  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement