సాక్షి, సిద్దిపేట: ‘‘కృష్ణా బేసిన్‌లో ఉన్న కోదాడలో నిలబడి (మహాకూటమి బహిరంగ సభలో) కృష్ణా నదిలో నీళ్లు లేవు.. గోదావరి నీళ్లు పంచుకుందామని చంద్రబాబు మాయమాటలు మాట్లాడుతున్నడు. తెలంగాణ కాంగ్రెస్ సన్నాసులను, వాళ్ల అధినేత రాహుల్ గాంధీని కూర్చోబెట్టి ఎండార్సీ ఇస్తున్నడు. ఇందుకు మన కాంగ్రెస్ గొర్రెలు తలకాయలు ఊపుతున్నాయి. కృష్ణా నదిలో నీళ్లు లేవా? మన వాటా లేదా? హరీశ్‌రావు పటపట పళ్లు కొరకాలె. తెలంగాణ యావత్తూ... బిడ్డా మా వాటా లేదంటావా? నీ కెంత ధైర్యం రా? అని ఓటుతోని సమాధానం చెప్పాలి’’అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణను దోచుకోవడంలో చంద్రబాబు దాహం తీరలేదని కేసీఆర్ దుయ్యబట్టారు. కృష్ణాలో నీళ్లు లేవంటూ మాట్లాడిన చంద్రబాబు వద్ద నుంచి మైకు గుంజుకోవాల్సిన కాంగ్రెస్ దద్దమ్మలు... మొద్దన్నలు నోరు మెదపలేదని మండిపడ్డారు. మన నీళ్లు మనకు రాకుండా కుట్ర పన్నిన చంద్రబాబు నిజస్వరూపం మరోసారి బయటపడిందని విమర్శించారు. ‘‘కేసీఆర్, టీఆర్‌ఎస్ గెలిస్తే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఆకుపచ్చ తెలంగాణ ఏర్పడుతుంది. కోటి ఎకరాలకు నీళ్లు వస్తాయి.
అదే చంద్రబాబు భాగస్వామ్యంతో ఉన్న కూటమి గెలిస్తే రాష్ట్రానికి శనేశ్వరమే. కాళేశ్వరం ప్రాజెక్టు కావాలా... శనేశ్వరం కావాలా..? మీరే తేల్చుకోవాలి... విజ్ఞతతో ఓటు వేయాలి. దొంగ సర్వేలు చూసి ప్రజలు ఆందోళన చెందవద్దు. 100కుపైగా స్థానాల్లో గెలిచి తెరాస మళ్లీ అధికారంలోకి వస్తుంది. గజ్వేల్ నియోజకవర్గంలో పేదలందరికీ ఇళ్లు కట్టిస్తాను. నియోజకవర్గంలో ప్రతి ఇంటికీ రెండు పాడి గేదెలు ఇస్తాం’’అని కేసీఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి చివరిరోజైన బుధవారం తన సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ప్రసంగం ప్రారంభించబోయే ముందు తన సమీప బంధువు, మాజీ జెడ్పీటీసీ లక్ష్మీకాంతారావుకు పాదాభివందనం చేశారు. సభలో మంత్రి తన్నీరు హరీశ్‌రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, మెదక్ జిల్లా పరిషత్ చైర్మన్ రాజమణి, ఎమ్మెల్సీలు సుధాకర్‌రెడ్డి, ఫారూక్ హుస్సేన్, కార్పొరేషన్ల చైర్మన్లు భూంరెడ్డి, ఎలక్షన్‌రెడ్డి, భూపతిరెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ లక్ష్మీకాంతారావు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...
ఉన్న తెలంగాణను పోగొట్టింది కాంగ్రెస్సే
సకల సంపదలతో తులతూగిన తెలంగాణ ప్రాంతాన్ని పోగొట్టి ఏపీలో కలిపింది కాంగ్రెస్ ప్రభుత్వమే. హైదరాబాద్ స్టేట్ పేరు మీద తెలంగాణ ఉండె. 1956లో తెలంగాణ ప్రత్యేకంగా ఉండ కుండా బూర్గుల రామకృష్ణారావుతో నెహ్రూ మంతనాలు జరిపారు. తర్వాత ఉద్యమాలు చేసి నా తెలంగాణ ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంది. సమైక్య రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చట్ట సభలో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనని కరాఖండీగా చెప్పినా... కాంగ్రెస్ దద్దమ్మలు నోరు మెదపలేదు. అ«ధికారం కోసం లావాసపడే కాంగ్రెస్ నాయకులకు రాష్ట్ర ప్రయోజనాల గురించి అవసరం లేదు. వారికి కావాల్సింది కుర్చీ. అందుకోసమే ప్రాజెక్టులు ఆపేందుకు కుట్ర పన్నిన చంద్రబాబుతో చెయ్యి కలిపి తెలంగాణలో తిరుగుతున్నారు. కూటమికి ఓటేస్తే తెలంగాణ రాష్ట్రాన్ని ఢిల్లీకి, అమరావతికి తాకట్టు పెట్టాల్సి వస్తుంది. మన రాష్ట్రం మనకు వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు మాటలే ఒప్పుకుందామా?
సంపద పెంచి పంచాలనేదే లక్ష్యం...
దేశంలో నాలుగు సంవత్సరాల్లో ఎక్కడా లేనివిధంగా ఆర్థికవృద్ధి 17.17 శాతం పెంచుకున్నాం. ప్రస్తుతం అది 19.86కు చేరింది. దేశంలోనే అత్యధిక విద్యుత్ వినియోగం తెలంగాణలో జరుగుతోందని భారతదేశ విద్యుత్ అథారిటీ సంస్థ చెప్పింది. సంపద పెంచి ప్రజలకు పంచాలనే లక్ష్యంతోనే ముందుకెళ్తున్నాం. పదేళ్ల కాంగ్రెస్ హయాంలో ఇసుక ద్వారా కేవలం రూ. 9.56 కోట్ల ఆదాయమొస్తే.. నాలుగేళ్ల టీఆర్‌ఎస్ పాలనలో రూ. 2,056 కోట్ల ఆదాయం వచ్చింది. స్మగ్లింగ్, బ్లాక్ దందాను అరికట్టడం మూలంగానే ఇది సాధ్యమైంది. ఇలా కడుపుకట్టుకొని కూడబెట్టిన సంపదను సంక్షేమ పథకాలకు కేటాయిస్తున్నాం. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చే రాష్ట్రం.. దేశంలో తెలంగాణ ఒక్కటే. ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకూ ఆసరా పింఛన్లు ఇస్తున్నాం. కల్యాణలక్ష్మి, అమ్మఒడి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తెలంగాణను చూసి కేంద్ర ఆర్థిక మండలి నివ్వెరపోతోంది. ఒక్క కోరుట్లలోనే 68,758 మందికి పింఛన్లు ఇవ్వడాన్ని చూసి అక్కడి ప్రజలు ఆశ్చర్యపోయారు.
ఆరోగ్య తెలంగాణే లక్ష్యం...
వ్యవసాయానికి సాగునీరు, కల్యాణలక్ష్మి, పింఛన్ సౌకర్యాలతోపాటు ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఎర్రవల్లిలో వృద్ధుల ఇబ్బందులను గమనించి పుట్టిన పథకమే కంటి వెలుగు. ఒక్క కంటి వెలుగు పథకంతోనే ఆగదు. మళ్లీ మన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ముక్కు, చెవి, గొంతు పరీక్షలు.. ఆ తర్వాత పళ్ల పరీక్షలు, అనంతరం పాథాలజీ సిబ్బంది ద్వారా ప్రతి వ్యక్తి సంపూర్ణ ఆరోగ్య రికార్డును సిద్ధం చేస్తాం. ఆరోగ్య రికార్డు ఆధారంగా అత్యవసర చికిత్స కూడా అందుబాటులోకి వస్తుంది.
వంద సీట్లకుపైగా గెలుస్తాం: కేకే
పేదరికంతో అలమటిస్తున్న తెలంగాణ రాష్ట్రంలో సంపద పెంచి పేదవారికి పంచాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన లక్ష్యమని టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కేశవరావు తెలిపారు. రాష్ట్రమంతటా ఓటు వేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారని.. ఆయనకు ఓటు వేయాలని ప్రజలను కోరే అవకాశం రావడం తన అదృష్టమన్నారు. వంద సీట్లకుపైగా టీఆర్‌ఎస్ పార్టీ గెలుస్తుందని జోస్యం చెప్పారు. ఈ గెలుపు పార్టీది కాదని.. ప్రజలదన్నారు. ఈ రాష్ట్రం ప్రజారాష్ట్రమని.. టీఆర్‌ఎస్ ప్రజాపార్టీ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో తాగు, సాగునీరు కష్టాలు తీరుతున్నాయని, తెలంగాణ చీకటి రాష్ట్రంగా మారుతుందని ఎద్దేవా చేసిన ఆంధ్ర పాలకుల విమర్శలకు నిరంతర విద్యుత్‌తో సమాధానం చెప్పామన్నారు. కాగా, సభ విజయవంతం కావడంపై హరీశ్‌రావును ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు.
గాలిగాలి గత్తర కావొద్దు...
తెలంగాణ రాష్ట్ర సాధనలో 58 సంవత్సరాలు తన్నులాట, కష్ట నష్టాలు, అవమానాలు, క్షోభలు చవిచూశాం. ఎంతో మంది తల్లులు వారి బిడ్డల ప్రాణాలు కళ్లముందే పోయినా చలించలేదు. త్యాగాల పునాదుల మీద తెలంగాణ ఏర్పడ్డదే కానీ... బిస్కెట్‌లాగా భిక్షమేస్తే వచ్చింది కాదు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో పేదల కంట కన్నీరు చూడొద్దనేదే నా స్వప్నం. దుఃఖం లేని తెలంగాణ నా ఆశ. ఆకుపచ్చ తెలంగాణే నా లక్ష్యం. కోటి ఎకరాల మాగాణి కోసమే యజ్ఞం చేస్తున్నా. తెలంగాణ ఏర్పడ్డ నాలుగు సంవత్సరాల్లోనే అనేక రకాల మార్పులు తీసుకొచ్చాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ యజ్ఞం ఆగొద్దు. గెలిచి నిలవాలి. ఓట్లు అంటేనే గాలిగాలి గత్తర కావొద్దు. ఎంతో కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ ఇప్పుడిప్పుడే మొగ్గ తొడిగే ప్రయత్నంలో ఉంది. నేను పెట్టిన మొక్కలు పూత పూసి కాయ కాసే దశలో ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో వచ్చిన ఎన్నికలు తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక. గాలి మాటలు విని గాబరాపడి ఓటేస్తే ఐదు సంవత్సరాలు ఏడవాల్సి వస్తుంది.
హరీశ్... ప్రాజెక్టుల వద్ద నిద్రచేసి పనులు చేయిస్తుండు..
తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు ఇవ్వాలనే సంకల్పాన్ని యజ్ఞంలా చేపడుతున్నం. మా మంత్రి (హరీశ్‌రావును ఉద్దేశించి) ప్రాజెక్టుల దగ్గర నిద్రచేసి వెంటపడి మరీ పనులు చేయిస్తుండు. గిట్లాంటి చరిత్ర కాంగ్రెసోళ్లకు ఉందా..? కాంగ్రెస్‌కు తెలంగాణ అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదు. ఏనాడూ వారు ప్రజాసమస్యల పరిష్కారాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. కానీ తెలంగాణ మంత్రివర్గంలో కీలకశాఖ నిర్వహిస్తున్న హరీశ్ తనదైన శైలిలో పనిచేసి ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులను పూర్తి చేయడంతో లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించగలిగాం.
బాబు కుట్రలు సాగనీయం...
చంద్రబాబు ఏం కోరుతున్నాడు. తెలంగాణలో కీలుబొమ్మ ప్రభుత్వం ఉండాలనేది చంద్రబాబు లక్ష్యం. అధికారం పోయిందనే కడుపుమంటతో ఉన్న కాంగ్రెస్ నేతల అసమర్థతను చంద్రబాబు వాడుకుంటున్నాడు. అక్రమంగా సంపాదించిన సొమ్ములు తీసుకొని.. ఆంధ్రా నాయకులు, ఇంటె లిజెన్స్ డిపార్ట్‌మెంట్‌ను తీసుకొచ్చి ఇక్కడ మోహరించిండు. దానికి కాంగ్రెస్ నేతలు భజన పాడుతున్నారు. అందుకే ఆంధ్రాకెళ్లి చంద్రబాబును భుజాల మీద మోసుకొచ్చారు.
మీరు నాకు అవకాశం ఇస్తే నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణను బానిస కానివ్వను. ఇప్పుడు ఎన్నికల్లో కొట్లాడాల్సింది మీరు. ఓటుతో దెబ్బ కొట్టాలి. కోటి ఎకరాల మాగాణి చేసేందుకు మనం ప్రయత్నిస్తుంటే గొడ్డలి భుజాన పెట్టుకొని అడ్డుకోవాలని చూస్తున్న కుట్రబాజి చంద్రబాబుకు ఓటుతో బుద్ధి చెప్పి తరిమికొట్టాలి. తెలంగాణను దుర్మార్గులపాలు కాకుండా కాపాడుకోవాలి. తెలంగాణను కేసీఆర్ సాధించినప్పుడు.. మీరంతా సంబురపడ్డరు. తెలంగాణ మేధావులు, ఉద్యోగులు, కవు లు, రచయితలు ఆలోచించి.. తెలంగాణకు రక్షణ కవచంగా నిలవాల్సిన బాధ్యత ఉంది. మీ మద్దతు లేకపోతే నేనేం చేయలేను. మీరు ఆశీర్వదించి దీవిస్తే.. దేశమే నివ్వెరపోయే అభివృద్ధి, సంక్షేమం జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment