తెలంగాణ రాష్ట్ర సమితి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ‘ఆపరేషన్ ఆకర్ష్ ను మరింత వేగంగా అమలు చేసేందుకు పావులు కదుపుతోంది. ఈ మేరకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశనం చేసేందుకు అధిష్టానం అన్నిస్థాయిల్లో నూ చర్యలు చేపట్టింది. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం, తదనంతరం చోటుచేసుకున్న పరిణామాలపై మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర కీలక ప్రజాప్రతినిధులు, నేతలకు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఇటీవలే మార్గదర్శనం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రజా›ప్రతినిధులు, సీనియర్లతో ఈనెల 3న ప్రగతిభవన్‌లో కీలక సమావేశం కూడా నిర్వహించారు. ఆ మరుసటి రోజు నుంచే చేరికలపై దృష్టి సారించిన టీఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ ముఖ్యనేతలతో మంతనాలు సాగిస్తున్నారు. మంథ ని, హుజూరాబాద్, సిరిసిల్ల నియోజకవర్గాల్లో ఇప్పటికే కాంగ్రెస్, టీడీపీల నుంచి వలసలు మొదలు కాగా, పూర్వ జిల్లా కరీంనగర్ కేంద్రంగా బుధవారం బైపాస్‌రోడ్డు (బొమ్మకల్) శివారులోని ‘వి’ కన్వెన్షన్ హాల్‌లో ఉమ్మడి జిల్లా టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాజకీయంగా ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు, అన్ని రాజకీయ పార్టీలు ‘ఆపరేషన్ ఆకర్ష్’పై దృష్టి సారించిన నేపథ్యంలో టీఆర్‌ఎస్ ఉమ్మడి జిల్లా కార్యకర్తల సమావేశం నిర్వహించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే.. ఉమ్మడి జిల్లా పార్టీ శ్రేణులకు ప్రభుత్వం పనితీరు, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును వివరించడంతోపాటు వారిలో ఉత్సాహం నింపేందుకు కరీంనగర్ వేదికగా సమావేశం నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 2014 సాధారణ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా పరిధిలో 13 శాసనసభ స్థానాలకు గాను 12 స్థానాల్లో విజయం సాధించడం, మూడు ఎంపీ, ఎమ్మెల్సీ స్థానాలను, జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకోవడంతో తిరుగులేని శక్తిగా పార్టీ నిలిచింది. ఆ విధంగానే రానున్న ఎన్నికల్లో అదే స్ఫూర్తిని కొనసాగించేలా క్యాడర్ అప్రమత్తం కావాలని పిలుపునిచ్చేందుకే కీలక సమావేశంగా చెబుతున్నారు.
ఇదే క్రమంలో గ్రామ, మండల స్థాయిల్లో ప్రభావితం చేసే నేతలను గుర్తించి వారిని పార్టీలోకి తీసుకొచ్చే బాధ్యతను భుజస్కంధాలపై వేసుకొని పార్టీని రానున్న ఎన్నికల్లో మరింత బలోపేతం చేసే దిశగా క్యాడర్‌కి దిశానిర్దేశనం చేయనున్నారు. కాగా.. ఉమ్మడి జిల్లా పరిధిలో ఆపరేషన్ ఆకర్ష్ పై మంత్రి ఈటల రాజేందర్ ఇతర ప్రజాప్రతినిధులను కలుపుకుని కీలకంగా వ్యవహరిస్తుండగా.. ఇప్పటికే మంథని, హుజూరాబాద్ నియోజకవర్గాల నుంచి పార్టీలోకి వలసలు మొదలయ్యాయి. ఇదే సమయంలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, గత ప్రభుత్వాల హయాంలోని లోటుపాట్లను ఎత్తిచూపుతూ క్షేత్రస్థాయిలో విస్తృతమైన ప్రచారం చేపట్టి పార్టీని ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేయాలని సమాయత్తం చేయడం ముఖ్యోద్దేశమని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఉమ్మడి జిల్లా శ్రేణులకు ఇన్‌చార్జీల పరిచయం.. కార్యకర్తలతో మాటా ముచ్చట..
సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా టీఆర్‌ఎస్ అధినేత నియోజకవర్గం, జిల్లా బాధ్యులను నియమించారు. పార్టీ రాష్ట్ర కమిటీలో కార్యదర్శి, సహాయ కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి హోదాలలో ఉన్న పలువురు సీనియర్లకు అవకాశం కల్పించారు. జిల్లాకు చెందిన సీనియర్లు ఒక్కొక్కరికి మూడు నుంచి నాలుగు నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించిన కేసీఆర్, పొరుగు జిల్లాకు చెందిన సీనియర్‌ను జిల్లా ఇన్‌చార్జి జనరల్ సెక్రెటరీగా నియమించారు. మాజీ మంత్రి, టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బస్వరాజు సారయ్యను పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జి జనరల్ సెక్రెటరీగా నియమించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 నియోజకవర్గాలకు నలుగురు బాధ్యులను నియమించారు. మంత్రి ఈటల రాజేందర్ ప్రాతినిధ్య వహిస్తున్న హుజూరాబాద్‌తోపాటు హుస్నాబాద్, మానకొండూరు నియోజకవర్గాల ఇన్‌చార్జి బాధ్యతలను పోలీసు హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తకు అప్పగించారు.
ఎమ్మెల్సీ తానిపర్తి భానుప్రసాద్‌రావుకు సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల, కోరుట్లలు, సిరిసిల్ల అర్బన్ బ్యాంకు మాజీ అధ్యక్షుడు గూడూరి ప్రవీణ్‌కు కరీంనగర్, చొప్పదండి, ధర్మపురి, కర్ర శ్రీహరికి పెద్దపల్లి, మంథని, రామగుండం నియోజకవర్గాల ఇన్‌చార్జీలుగా నియమించారు. కాగా.. అన్నిస్థాయిల్లో పార్టీని బలోపేతం చేయడం లక్ష్యంగా క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలను విస్తరించే దశలో బుధవారం నిర్వహించే సమావేశం ద్వారా ఉమ్మడి జిల్లా కార్యకర్తలను కొత్త ఇన్‌చార్జీల ద్వారా కలుసుకోనున్నారు. కీలకంగా మారిన ఈ సమావేశానికి మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్, ఎంపీలు వినోద్‌కుమార్, సుమన్, జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు కార్యకర్తలు హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment