సాక్షి, రంగారెడ్డి: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సత్తా చాటిన భారతీయ జనతా పార్టీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికార టీఆర్‌ఎస్ పార్టీలోని అసమ్మతి నేతలపై కాషాయదళం దృష్టి సారించింది. వికారాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్‌కు కాషాయ కండువా కప్పేందుకు బీజేపీ నేతలు రంగంలోకి దిగినట్లు తెలిసింది. పార్టీ అధిష్టానం తీరుపై అసంతృప్తిగా ఉన్న ఈ సీనియర్ నేత.. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కమల తీర్థం పుచ్చుకుంటారన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే చివరి నిమిషంలో వెనకడుగు వేశారు. ఆ తర్వాత మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణకు ముందు కూడా మరోసారి ఈ అంశం చర్చకు వచ్చినా కార్యరూపం దాల్చలేదు.
ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ నెగ్గడంతోపాటు తాజాగా రెండు రోజుల క్రితం వెలువడిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీ గణనీయంగా స్థానాలను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఊపుమీదున్న బీజేపీలో ఆయన చేరిక మరోసారి చర్చనీయాంశంగా మారింది. తాజాగా బీజేపీకి చెందిన పలువురు నాయకులు.. చంద్రశేఖర్‌తో సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. బీజేపీలో చేరికకు ఆయన సుముఖంగా ఉన్నప్పటికీ.. కొంత సమయం కావాలని కాషాయదళ నేతలను కోరినట్లు వార్తలు వినిపించాయి. తన అనుయాయులు, పార్టీ శ్రేణులు, సన్నిహితులతో చర్చించి వారి అభీష్టాన్ని తెలుకుంటానని చెప్పినట్లు సమాచారం. మూడు నాలుగు రోజుల్లో మాజీ మంత్రి చేరికపై స్పష్టత వస్తుందని కమల నేతలు చెబుతున్నారు. ఎలాగైనా పార్టీలో చేరతారన్న ధీమాతో వారు ఉన్నారు. ఈయన రాకతో వికారాబాద్‌లో బీజేపీ మరింత బలపడుతుందన్న విశ్వాసాన్ని బీజేపీ వ్యక్తం చేస్తోంది.
కాంగ్రెస్‌కు కష్టకాలమే..
ఇప్పటికే గ్రేటర్ ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బతగిలిన కాంగ్రెస్‌ను.. సీనియర్ నేతల వలసలు మరింత ఇబ్బందుల్లో నెట్టేస్తున్నాయి. సుదీర్ఘ చరిత్ర ఉన్న ఈ పార్టీ జిల్లాను శాసించిన స్థాయి నుంచి.. ఉనికే ప్రశ్నార్థకంగా మారుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. నాయకత్వ లేమి, అధిష్టానానికి నాయకులకు మధ్య సమన్వయం కొరవడటం తదితర కారణాల వల్ల హస్తం చతికిల పడుతూ వస్తోంది. ఈ వైఫల్యాల వల్లే నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఇదే తరహాలోనే ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ మంత్రి చంద్రశేఖర్ కమలం వైపు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది.
తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న చంద్రశేఖర్‌కు సీఎం కేసీఆర్ సన్నిహితుడనే పేరుంది. అయితే గులాబీ పార్టీలో ఇమడలేకపోయిన ఆయన కాంగ్రెస్‌లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడంతో ఆ పార్టీని వీడారు. ఏఐఎఫ్‌బీ తరఫున ఎన్నికల బరిలో దిగి.. ఓటమిపాలైన చంద్రశేఖర్ తిరిగి హస్తం గూటికి చేరారు. సొంత నియోజకవర్గమైన వికారాబాద్‌ని కాదని పొరుగున ఉన్న చేవెళ్ల సెగ్మెంట్ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించారు. దీనిపైనా ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. దీనికితోడు స్థానిక నేతనైన తనను కాదని వికారాబాద్‌లో మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్‌కు పార్టీ అధిష్టానం ప్రాధాన్యత ఇస్తోందని మథన పడ్డారు. ఈ పరిణామాలన్నీ చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీని వీడేందుకు మార్గం చూపుతున్నాయని తెలుస్తోంది. మొత్తంగా ఈ పార్టీకి భవిష్యత్ లేదన్న నిర్ణయానికి వచ్చిన ఈయన ప్రత్యామ్నాయంగా కమలం చెంతకు చేరేందుకు దాదాపుగా సిద్ధమయ్యారన్న వార్తలు వినిపిస్తున్నాయి.
పక్కా వ్యూహంతో..
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ వేగంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే గ్రేటర్ ఎన్నికలకు ముందు తెలంగాణ ఉద్యమ నేత, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, శేరిలింగంపల్లి సెగ్మెంట్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ తదితరులు కాషాయ కండువా కప్పుకున్నారు. మరికొందరి నేతలపై దృష్టి సారించిన కమలనాథులు వారితో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్, ఇతర పార్టీల్లో పదవులు అలంకరించిన మాజీలు, క్రియాశీలక నేతలతోపాటు టీఆర్‌ఎస్‌లో ఎడమొహం పెడమొహంగా ఉన్న నేతలను పార్టీలో చేర్చుకోవాలని యోచిస్తోంది.
వచ్చే సాధారణ ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య అధికార పార్టీలో అధికంగానే ఉంది. ఇటువంటి నియోజకవర్గాలను లక్ష్యంగా చేసుకుని ఆశావహులతో టచ్‌లోకి వెళ్లాలని బీజేపీ ప్రణాళిక రూపొందించుకుంటోంది. మొత్తానికి వీలైనంత వేగిరంగా జిల్లాలో టీఆర్‌ఎస్‌కు దీటుగా కమలదళాన్ని సిద్ధం చేసి ఎన్నికలను ఎదుర్కోవాలన్నది బీజేపీ వ్యూహంగా చెప్పవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment