oparation akarsh
-
బీజేపీ: ఆపరేషన్ ఆకర్ష్..
సాక్షి, రంగారెడ్డి: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సత్తా చాటిన భారతీయ జనతా పార్టీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికార టీఆర్ఎస్ పార్టీలోని అసమ్మతి నేతలపై కాషాయదళం దృష్టి సారించింది. వికారాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్‌కు కాషాయ కండువా కప్పేందుకు బీజేపీ నేతలు రంగంలోకి దిగినట్లు తెలిసింది. పార్టీ అధిష్టానం తీరుపై అసంతృప్తిగా ఉన్న ఈ సీనియర్ నేత.. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కమల తీర్థం పుచ్చుకుంటారన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే చివరి నిమిషంలో వెనకడుగు వేశారు. ఆ తర్వాత మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణకు ముందు కూడా మరోసారి ఈ అంశం చర్చకు వచ్చినా కార్యరూపం దాల్చలేదు. ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ నెగ్గడంతోపాటు తాజాగా రెండు రోజుల క్రితం వెలువడిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీ గణనీయంగా స్థానాలను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఊపుమీదున్న బీజేపీలో ఆయన చేరిక మరోసారి చర్చనీయాంశంగా మారింది. తాజాగా బీజేపీకి చెందిన పలువురు నాయకులు.. చంద్రశేఖర్‌తో సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. బీజేపీలో చేరికకు ఆయన సుముఖంగా ఉన్నప్పటికీ.. కొంత సమయం కావాలని కాషాయదళ నేతలను కోరినట్లు వార్తలు వినిపించాయి. తన అనుయాయులు, పార్టీ శ్రేణులు, సన్నిహితులతో చర్చించి వారి అభీష్టాన్ని తెలుకుంటానని చెప్పినట్లు సమాచారం. మూడు నాలుగు రోజుల్లో మాజీ మంత్రి చేరికపై స్పష్టత వస్తుందని కమల నేతలు చెబుతున్నారు. ఎలాగైనా పార్టీలో చేరతారన్న ధీమాతో వారు ఉన్నారు. ఈయన రాకతో వికారాబాద్‌లో బీజేపీ మరింత బలపడుతుందన్న విశ్వాసాన్ని బీజేపీ వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్‌కు కష్టకాలమే.. ఇప్పటికే గ్రేటర్ ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బతగిలిన కాంగ్రెస్‌ను.. సీనియర్ నేతల వలసలు మరింత ఇబ్బందుల్లో నెట్టేస్తున్నాయి. సుదీర్ఘ చరిత్ర ఉన్న ఈ పార్టీ జిల్లాను శాసించిన స్థాయి నుంచి.. ఉనికే ప్రశ్నార్థకంగా మారుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. నాయకత్వ లేమి, అధిష్టానానికి నాయకులకు మధ్య సమన్వయం కొరవడటం తదితర కారణాల వల్ల హస్తం చతికిల పడుతూ వస్తోంది. ఈ వైఫల్యాల వల్లే నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఇదే తరహాలోనే ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ మంత్రి చంద్రశేఖర్ కమలం వైపు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న చంద్రశేఖర్‌కు సీఎం కేసీఆర్ సన్నిహితుడనే పేరుంది. అయితే గులాబీ పార్టీలో ఇమడలేకపోయిన ఆయన కాంగ్రెస్‌లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడంతో ఆ పార్టీని వీడారు. ఏఐఎఫ్బీ తరఫున ఎన్నికల బరిలో దిగి.. ఓటమిపాలైన చంద్రశేఖర్ తిరిగి హస్తం గూటికి చేరారు. సొంత నియోజకవర్గమైన వికారాబాద్‌ని కాదని పొరుగున ఉన్న చేవెళ్ల సెగ్మెంట్ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించారు. దీనిపైనా ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. దీనికితోడు స్థానిక నేతనైన తనను కాదని వికారాబాద్‌లో మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్‌కు పార్టీ అధిష్టానం ప్రాధాన్యత ఇస్తోందని మథన పడ్డారు. ఈ పరిణామాలన్నీ చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీని వీడేందుకు మార్గం చూపుతున్నాయని తెలుస్తోంది. మొత్తంగా ఈ పార్టీకి భవిష్యత్ లేదన్న నిర్ణయానికి వచ్చిన ఈయన ప్రత్యామ్నాయంగా కమలం చెంతకు చేరేందుకు దాదాపుగా సిద్ధమయ్యారన్న వార్తలు వినిపిస్తున్నాయి. పక్కా వ్యూహంతో.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ వేగంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే గ్రేటర్ ఎన్నికలకు ముందు తెలంగాణ ఉద్యమ నేత, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, శేరిలింగంపల్లి సెగ్మెంట్ కాంగ్రెస్ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ తదితరులు కాషాయ కండువా కప్పుకున్నారు. మరికొందరి నేతలపై దృష్టి సారించిన కమలనాథులు వారితో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్, ఇతర పార్టీల్లో పదవులు అలంకరించిన మాజీలు, క్రియాశీలక నేతలతోపాటు టీఆర్ఎస్లో ఎడమొహం పెడమొహంగా ఉన్న నేతలను పార్టీలో చేర్చుకోవాలని యోచిస్తోంది. వచ్చే సాధారణ ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య అధికార పార్టీలో అధికంగానే ఉంది. ఇటువంటి నియోజకవర్గాలను లక్ష్యంగా చేసుకుని ఆశావహులతో టచ్‌లోకి వెళ్లాలని బీజేపీ ప్రణాళిక రూపొందించుకుంటోంది. మొత్తానికి వీలైనంత వేగిరంగా జిల్లాలో టీఆర్ఎస్కు దీటుగా కమలదళాన్ని సిద్ధం చేసి ఎన్నికలను ఎదుర్కోవాలన్నది బీజేపీ వ్యూహంగా చెప్పవచ్చు. -
ఆపరేషన్ ఆకర్ష్
సాక్షి, కామారెడ్డి: ఎన్నికలు ఇప్పట్లో లేవంటూనే అధికార టీఆర్ఎస్ పార్టీ విపక్ష పార్టీల నేతలకు గాలం వేస్తోంది. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కోసం పర్యటనలుజరుపుతున్న అధికార పార్టీ ప్రజాప్రతినిధులు.. పనిలో పనిగా ఇతర పార్టీల నేతలతో మంతనా లు సాగిస్తూ వారికి గులాబీ తీర్థం ఇస్తున్నారు. జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో ఇటీవలి కాలంలో వలసలు జోరందుకున్నాయి. జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యమంతో పాటు, విద్యార్థి ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్న చెలిమెల భానుప్రసాద్ ఇటీవలే ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. మరో విద్యార్థి నాయకుడు అగ్గి రవీందర్ కూడా కారెక్కారు. కాంగ్రెస్ టికెట్టుపై గెలిచిన కామారెడ్డి మున్సిప ల్ చైర్పర్సన్ పిప్పిరి సుష్మ, వైస్ చైర్మన్ మసూ ద్, మాచారెడ్డి జెడ్పీటీసీ సభ్యురాలు గ్యార లక్ష్మి, డీసీసీబీ వైస్ చైర్మన్ పరికి ప్రేమ్‌కుమార్, భిక్కనూరు ఎంపీపీ సుదర్శన్... ఇలా పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులను గతంలోనే టీఆర్ఎస్లో చేర్చుకున్నారు. నియోజకవర్గంలో మెజారిటీ ప్రజాప్రతినిధులు ఇప్పుడు అధికార పార్టీలోనే ఉన్నారు. తాజాగా సోమవారంబీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, గత ఎన్నికల్లో ఎమ్మె ల్యే అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ ఇట్టం సిద్దరాములును కూడా పార్టీలోకి ఆహ్వానించారు. బాన్సువాడ నియోజక వర్గంలో.. వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తన నియోజక వర్గంలో ప్రత్యర్థి పార్టీలకు చెందిన ముఖ్య నాయకులకు గాలం వేస్తూ వారిని పార్టీలో చేర్చుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు గట్టి పోటీ లేకుండా చూసుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉమ్మడి జిల్లా గ్రంథాల య సంస్థ చైర్మన్‌గా పనిచేసిన శ్రీనివాస్యాద వ్, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు కిషోర్‌యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గురువినయ్కుమార్లను టీఆర్ఎస్లోకి లాగారు. అలాగే గిరిజన నాయకుడిగా గుర్తింపున్న టీడీపీ నియోజక వర్గ ఇన్చార్జి, బంజారాసంఘం జిల్లా అధ్యక్షు డు బద్యానాయక్‌కు గులాబీ కండువా కప్పారు. జుక్కల్ నియోజక వర్గంలోనూ టీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే హన్మంత్ సింధే వివిధ పార్టీల్లోని పలువురు గ్రామ, మండల స్థాయి నేతలను పార్టీలోకి తీసుకువచ్చారు. కుల సంఘాల ప్రతినిధులకూ గులాబీ తీర్థం ఇస్తున్నారు. ఎల్లారెడ్డిలో.. ఎల్లారెడ్డి నియోజక వర్గంలో ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి వివిధ పార్టీలకు చెందిన గ్రామ, మండల స్థాయి నాయకులను టీఆర్ఎస్లోకి ఆహ్వానిస్తున్నారు. ఏడాది కాలంలో నియోజక వర్గంలోని వివిధ పార్టీలకు చెందిన ద్వితీయ శ్రేణి నేతలను చాలామందిని కారెక్కించుకున్నారు. తాడ్వాయి మండలానికి చెందిన సింగిల్ విండో చైర్మన్ సంజీవరెడ్డికి ఇటీవలే గులాబీ కండువా కప్పేశారు. జిల్లాలో అత్యధికంగా కొత్త పంచాయతీలు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోనే ఏర్పాటవుతున్నాయి. దీంతో ఆయా గ్రామాలకు చెందిన ముఖ్య నాయకులు, పెద్ద మనుషులందరినీ గులాబీ గూటికి తీసుకువస్తున్నారు. ముందుచూపుతో.... రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాలనుంచి గట్టి పోటీ లేకుండా చూసుకోవాలన్న ముందుచూపుతో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ప్రత్యర్థి పార్టీల నేతలకు గాలం వేస్తున్నట్టు తెలుస్తోంది. బాన్సువాడ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు పలువురు టీఆర్ఎస్లో చేరడానికి మంత్రి పోచారం తన రాజకీయ చాతుర్యాన్ని ప్రదర్శించారు. ప్రత్యర్థిని బలహీన పరచడం ద్వారా దూసుకెళ్లాలన్న ఆలోచనతో ఉన్నారు. కామారెడ్డి నియోజక వర్గంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అభివృద్ధి కార్యక్రమాల పేరుతో గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. స్థానికంగా ఎక్కువ సమయం గడుపుతున్నారు. ప్రభుత్వ పరంగా ఎక్కువ మందికి సీఎం సహాయ నిధి ద్వారా సాయం అందించే ప్రయత్నం చేశారు. అలాగే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీతో పాటు యంత్రలక్ష్మి ద్వారా ట్రాక్టర్ల పంపిణీ వంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ అటు ప్రజలను, ఇటు క్యాడర్‌ను ఆకర్శించే పనిలో పడ్డారు. ఎమ్మెల్యేలు శుభకార్యాలకు హాజరుకావడం, ఎవరైనా చనిపోతే పరామర్శించడం వంటి విషయాలకు ప్రాధాన్యతనిస్తున్నారు. జుక్కల్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యేలు కూడా తమతమ నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రయత్నాలను అప్పుడే ముమ్మరం చేశారు. అధికార పార్టీ నేతలు ఇతర పార్టీల నేతలకు గాలం వేస్తుండడంతో అంతటా ఎన్నికలపైనే చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్లోకి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ ఇట్టం సిద్దరాములు సోమవారం టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్‌ల సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. సిద్ధరాములు 2014 ఎన్నికల్లో కామారెడ్డి అసెంబ్లీ నియోజక వర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. సిద్ధరాములుతో పాటు ఆయన సోదరుడు, రాజంపేట మాజీ సర్పంచ్ ఇట్టం నడిపి సిద్ధరాములు, కుటుంబ సభ్యులు డాక్టర్ సుకుమార్, డాక్టర్ అజయ్‌లు కూడా కారెక్కారు. ఈ సందర్భంగా ప్రభుత్వం విప్ గంప గోవర్ధన్ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయని భావించి సిద్ధరాములు తమ పార్టీలో చేరారని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ ముజీబొద్దీన్, నాయకులు శేర్ల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
మాటా ముచ్చట..
తెలంగాణ రాష్ట్ర సమితి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ‘ఆపరేషన్ ఆకర్ష్ ను మరింత వేగంగా అమలు చేసేందుకు పావులు కదుపుతోంది. ఈ మేరకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశనం చేసేందుకు అధిష్టానం అన్నిస్థాయిల్లో నూ చర్యలు చేపట్టింది. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం, తదనంతరం చోటుచేసుకున్న పరిణామాలపై మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర కీలక ప్రజాప్రతినిధులు, నేతలకు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఇటీవలే మార్గదర్శనం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రజా›ప్రతినిధులు, సీనియర్లతో ఈనెల 3న ప్రగతిభవన్‌లో కీలక సమావేశం కూడా నిర్వహించారు. ఆ మరుసటి రోజు నుంచే చేరికలపై దృష్టి సారించిన టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ ముఖ్యనేతలతో మంతనాలు సాగిస్తున్నారు. మంథ ని, హుజూరాబాద్, సిరిసిల్ల నియోజకవర్గాల్లో ఇప్పటికే కాంగ్రెస్, టీడీపీల నుంచి వలసలు మొదలు కాగా, పూర్వ జిల్లా కరీంనగర్ కేంద్రంగా బుధవారం బైపాస్‌రోడ్డు (బొమ్మకల్) శివారులోని ‘వి’ కన్వెన్షన్ హాల్లో ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాజకీయంగా ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు, అన్ని రాజకీయ పార్టీలు ‘ఆపరేషన్ ఆకర్ష్’పై దృష్టి సారించిన నేపథ్యంలో టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా కార్యకర్తల సమావేశం నిర్వహించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే.. ఉమ్మడి జిల్లా పార్టీ శ్రేణులకు ప్రభుత్వం పనితీరు, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును వివరించడంతోపాటు వారిలో ఉత్సాహం నింపేందుకు కరీంనగర్ వేదికగా సమావేశం నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 2014 సాధారణ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా పరిధిలో 13 శాసనసభ స్థానాలకు గాను 12 స్థానాల్లో విజయం సాధించడం, మూడు ఎంపీ, ఎమ్మెల్సీ స్థానాలను, జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకోవడంతో తిరుగులేని శక్తిగా పార్టీ నిలిచింది. ఆ విధంగానే రానున్న ఎన్నికల్లో అదే స్ఫూర్తిని కొనసాగించేలా క్యాడర్ అప్రమత్తం కావాలని పిలుపునిచ్చేందుకే కీలక సమావేశంగా చెబుతున్నారు. ఇదే క్రమంలో గ్రామ, మండల స్థాయిల్లో ప్రభావితం చేసే నేతలను గుర్తించి వారిని పార్టీలోకి తీసుకొచ్చే బాధ్యతను భుజస్కంధాలపై వేసుకొని పార్టీని రానున్న ఎన్నికల్లో మరింత బలోపేతం చేసే దిశగా క్యాడర్‌కి దిశానిర్దేశనం చేయనున్నారు. కాగా.. ఉమ్మడి జిల్లా పరిధిలో ఆపరేషన్ ఆకర్ష్ పై మంత్రి ఈటల రాజేందర్ ఇతర ప్రజాప్రతినిధులను కలుపుకుని కీలకంగా వ్యవహరిస్తుండగా.. ఇప్పటికే మంథని, హుజూరాబాద్ నియోజకవర్గాల నుంచి పార్టీలోకి వలసలు మొదలయ్యాయి. ఇదే సమయంలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, గత ప్రభుత్వాల హయాంలోని లోటుపాట్లను ఎత్తిచూపుతూ క్షేత్రస్థాయిలో విస్తృతమైన ప్రచారం చేపట్టి పార్టీని ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేయాలని సమాయత్తం చేయడం ముఖ్యోద్దేశమని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఉమ్మడి జిల్లా శ్రేణులకు ఇన్చార్జీల పరిచయం.. కార్యకర్తలతో మాటా ముచ్చట.. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా టీఆర్ఎస్ అధినేత నియోజకవర్గం, జిల్లా బాధ్యులను నియమించారు. పార్టీ రాష్ట్ర కమిటీలో కార్యదర్శి, సహాయ కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి హోదాలలో ఉన్న పలువురు సీనియర్లకు అవకాశం కల్పించారు. జిల్లాకు చెందిన సీనియర్లు ఒక్కొక్కరికి మూడు నుంచి నాలుగు నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించిన కేసీఆర్, పొరుగు జిల్లాకు చెందిన సీనియర్‌ను జిల్లా ఇన్చార్జి జనరల్ సెక్రెటరీగా నియమించారు. మాజీ మంత్రి, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బస్వరాజు సారయ్యను పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి జనరల్ సెక్రెటరీగా నియమించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 నియోజకవర్గాలకు నలుగురు బాధ్యులను నియమించారు. మంత్రి ఈటల రాజేందర్ ప్రాతినిధ్య వహిస్తున్న హుజూరాబాద్‌తోపాటు హుస్నాబాద్, మానకొండూరు నియోజకవర్గాల ఇన్చార్జి బాధ్యతలను పోలీసు హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తకు అప్పగించారు. ఎమ్మెల్సీ తానిపర్తి భానుప్రసాద్‌రావుకు సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల, కోరుట్లలు, సిరిసిల్ల అర్బన్ బ్యాంకు మాజీ అధ్యక్షుడు గూడూరి ప్రవీణ్‌కు కరీంనగర్, చొప్పదండి, ధర్మపురి, కర్ర శ్రీహరికి పెద్దపల్లి, మంథని, రామగుండం నియోజకవర్గాల ఇన్‌చార్జీలుగా నియమించారు. కాగా.. అన్నిస్థాయిల్లో పార్టీని బలోపేతం చేయడం లక్ష్యంగా క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలను విస్తరించే దశలో బుధవారం నిర్వహించే సమావేశం ద్వారా ఉమ్మడి జిల్లా కార్యకర్తలను కొత్త ఇన్చార్జీల ద్వారా కలుసుకోనున్నారు. కీలకంగా మారిన ఈ సమావేశానికి మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్, ఎంపీలు వినోద్‌కుమార్, సుమన్, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు కార్యకర్తలు హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. -
మిగిలింది ముగ్గురే..!
జిల్లాలో టీడీపీ పరిస్థితి దారుణం ఆపరేషన్ ఆకర్ష్‌కు విలవిల పార్టీ కార్యక్రమాలకు కృష్ణయ్య దూరం జిల్లా రాజకీయాలకు దేవేందర్ రాంరాం ఎంపీ మల్లారెడ్డే పెద్దదిక్కు రంగారెడ్డి జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకు విలవిల్లాడుతోంది. ఒకప్పుడు బలంగా కనిపించిన పార్టీకి ఇప్పుడు నాయకులే కరువయ్యారు. ఒకరివెంట ఒకరు గులాబీ గూటికి చేరువయ్యారు. కొందరు పార్టీలో ఉన్నా అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. ఒకరిద్దరు పార్టీ గురించి పట్టించుకుంటున్నా కార్యకర్తలు కూడా వారిని వదిలి వెళ్తుండడంతో ఏం చేయాలో తోచనిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా రాజకీయాలను శాసించిన తెలుగుదేశం పార్టీకి నేడు ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. గత శాసనసభ ఎన్నికల్లో 15 స్థానాలు గెలిస్తే అందులో సగం సీట్లు రంగారెడ్డి జిల్లాలోవే. ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న పరిణామాలతో రాజకీయ సమీకరణలే మారిపోయాయి. అధికారపార్టీ సాగించిన అపరేషన్ ఆకర్ష్‌కు టీడీపీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. మేహ శ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఫిరాయింపుతో మొదలైన వలసల పర్వం...శేరిలింగంపల్లి శాసనసభ్యుడు అరికెపూడి గాంధీతో పూర్తయింది. మొత్తం ఏడుగురిలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మినహా మిగతా వారంతా గులాబీ గూటికి చేరిపోయారు. తీగల ఫిరాయింపు సమయంలో ఆయనపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను కలిసి ఫిర్యాదు చేసిన శాసనసభ్యులే.. ఆఖరుకు తమను టీఆర్ఎస్లో విలీనం చేయాలని లేఖను సమర్పించడం కొసమెరుపు. టీటీడీపీ ఎమ్మెల్యేల అభ్యర్థనకు సానకూలంగా స్పందించి స్పీకర్ కూడా పార్టీ మారిన ఎమ్మెల్యేలందరినీ టీఆర్ఎస్ సభ్యులుగా గుర్తిస్తున్నట్లు ప్రకటించడం రాజకీయ చర్చకు దారితీసింది. కాగా, మెజార్టీ ఎమ్మెల్యేలు గోడ దూకడంతో ఇక ఆ పార్టీకి జిల్లాలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్యే పెద్ద దిక్కుగా మారారు. అయితే, ఆయన కూడా కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. బీసీల సమస్యలపై ప్రభుత్వంపై పోరాటం సాగిస్తున్న ఆయన పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. ఇక పార్టీలో నంబర్ 2గా వెలిగిన రాజ్యసభ సభ్యుడు దేవేందర్‌గౌడ్ అనారోగ్య కారణాల రీత్యా క్రియాశీల రాజకీయాల్లో పాలుపంచుకోవడం లేదు. కేవలం హస్తిన రాజకీయాలు, పార్లమెంటులో జరిగే చర్చల్లోనే కనిపిస్తున్న గౌడ్సాబ్ జిల్లా రాజకీయాల్లో జోక్యం కూడా చేసుకోవడంలేదు. మల్కాజ్గిరి ఎంపీ చామకూర మల్లారెడ్డి గత ఎన్నికల వేళ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ వ్యతిరేక పవనాల్లోను విజయం సాధించి పార్లమెంటులో అడుగిడారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నప్పటికీ, పార్టీ శ్రేణులు, దిగువశ్రేణి నాయకత్వమంతా పక్కపార్టీలకు పలాయనం చిత్తగించడంతో దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు. దీంతో దాదాపుగా ఐసీయూలో చేరిన టీడీపీని బతికించడం దేవుడి కూడా కష్టమేనని ఆ పార్టీ వర్గాలే అంటున్నాయి.