మిగిలింది ముగ్గురే..!
జిల్లాలో టీడీపీ పరిస్థితి దారుణం
ఆపరేషన్ ఆకర్ష్‌కు విలవిల
పార్టీ కార్యక్రమాలకు కృష్ణయ్య దూరం
జిల్లా రాజకీయాలకు దేవేందర్ రాంరాం
ఎంపీ మల్లారెడ్డే పెద్దదిక్కు
రంగారెడ్డి జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకు విలవిల్లాడుతోంది. ఒకప్పుడు బలంగా కనిపించిన పార్టీకి ఇప్పుడు నాయకులే కరువయ్యారు. ఒకరివెంట ఒకరు గులాబీ గూటికి చేరువయ్యారు. కొందరు పార్టీలో ఉన్నా అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. ఒకరిద్దరు పార్టీ గురించి పట్టించుకుంటున్నా కార్యకర్తలు కూడా వారిని వదిలి వెళ్తుండడంతో ఏం చేయాలో తోచనిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా రాజకీయాలను శాసించిన తెలుగుదేశం పార్టీకి నేడు ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. గత శాసనసభ ఎన్నికల్లో 15 స్థానాలు గెలిస్తే అందులో సగం సీట్లు రంగారెడ్డి జిల్లాలోవే. ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న పరిణామాలతో రాజకీయ సమీకరణలే మారిపోయాయి. అధికారపార్టీ సాగించిన అపరేషన్ ఆకర్ష్‌కు టీడీపీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. మేహ శ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఫిరాయింపుతో మొదలైన వలసల పర్వం...శేరిలింగంపల్లి శాసనసభ్యుడు అరికెపూడి గాంధీతో పూర్తయింది. మొత్తం ఏడుగురిలో ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మినహా మిగతా వారంతా గులాబీ గూటికి చేరిపోయారు.
తీగల ఫిరాయింపు సమయంలో ఆయనపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను కలిసి ఫిర్యాదు చేసిన శాసనసభ్యులే.. ఆఖరుకు తమను టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలని లేఖను సమర్పించడం కొసమెరుపు. టీటీడీపీ ఎమ్మెల్యేల అభ్యర్థనకు సానకూలంగా స్పందించి స్పీకర్ కూడా పార్టీ మారిన ఎమ్మెల్యేలందరినీ టీఆర్‌ఎస్ సభ్యులుగా గుర్తిస్తున్నట్లు ప్రకటించడం రాజకీయ చర్చకు దారితీసింది. కాగా, మెజార్టీ ఎమ్మెల్యేలు గోడ దూకడంతో ఇక ఆ పార్టీకి జిల్లాలో ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్యే పెద్ద దిక్కుగా మారారు. అయితే, ఆయన కూడా కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. బీసీల సమస్యలపై ప్రభుత్వంపై పోరాటం సాగిస్తున్న ఆయన పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. ఇక పార్టీలో నంబర్ 2గా వెలిగిన రాజ్యసభ సభ్యుడు దేవేందర్‌గౌడ్ అనారోగ్య కారణాల రీత్యా క్రియాశీల రాజకీయాల్లో పాలుపంచుకోవడం లేదు.
కేవలం హస్తిన రాజకీయాలు, పార్లమెంటులో జరిగే చర్చల్లోనే కనిపిస్తున్న గౌడ్‌సాబ్ జిల్లా రాజకీయాల్లో జోక్యం కూడా చేసుకోవడంలేదు. మల్కాజ్‌గిరి ఎంపీ చామకూర మల్లారెడ్డి గత ఎన్నికల వేళ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ వ్యతిరేక పవనాల్లోను విజయం సాధించి పార్లమెంటులో అడుగిడారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నప్పటికీ, పార్టీ శ్రేణులు, దిగువశ్రేణి నాయకత్వమంతా పక్కపార్టీలకు పలాయనం చిత్తగించడంతో దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు. దీంతో దాదాపుగా ఐసీయూలో చేరిన టీడీపీని బతికించడం దేవుడి కూడా కష్టమేనని ఆ పార్టీ వర్గాలే అంటున్నాయి.