ఏ నిమిషానికి.. ఏమి జరుగునో!
నయీమ్‌తో సంబంధాలున్న గులాబీ నేతల్లో గుబులు
⇒ టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తీసుకోబోయే చర్యలపై ఉత్కంఠ
⇒ రాజీనామాలు.. సస్పెన్షన్లు అంటూ ప్రచారం
⇒ నామినేటెడ్ పదవుల భర్తీపై ప్రభావం చూపే అవకాశం
⇒ ఇప్పటికే అవకాశం కోల్పోయిన ఓ ఎమ్మెల్సీ
⇒ సొంత పార్టీలో చర్యల తర్వాత ప్రతిపక్ష పార్టీ నేతలపై దృష్టి
⇒ నయీమ్‌తో బంధాన్ని బయటపెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే కృష్ణయ్య
⇒ ఒకట్రెండు రోజుల్లో సిట్ నోటీసులు జారీ చేసే అవకాశం
సాక్షి, హైదరాబాద్
టీఆర్‌ఎస్ రాజకీయం గ్యాంగ్‌స్టర్ నయీమ్ డైరీ చుట్టూ తిరుగుతోంది. నయీమ్ ఎన్‌కౌంటర్ తర్వాత అతడి ఇంటి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న డైరీ సంచలనాత్మకంగా మారింది. వాస్తవానికి డైరీలోని వివరాలను ప్రభుత్వం ఇప్పటిదాకా బయటపెట్టలేదు. బ్రహ్మ పదార్థంలా మారిన ఈ డైరీ ఇప్పుడు అధికార టీఆర్‌ఎస్ నేతల్లోనూ గుబులు రేపుతోంది. నయీమ్ నేర సామ్రాజ్య విస్తరణలో, డబ్బుల సంపాదన దందాలో అతడికి కీలక అనుచరులుగా ఉన్న కొందరిని పోలీసులు అరెస్టు చేశారు. వారు పోలీసుల విచారణలో సంచలనాత్మక విషయాలు బయటపెట్టారని సమాచారం. ఇందులో టీడీపీ, కాంగ్రెస్‌కు చెందిన నాయకులతోపాటు ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో వివిధ పదవుల్లో ఉన్న వారి బాగోతాలూ బయట పడ్డాయంటున్నారు. ‘‘నయీమ్‌తో లింకులు ఉన్న వారు ఏ పార్టీకి చెందిన వారైనా, చివరకు టీఆర్‌ఎస్ నేతలైనా ఉపేక్షించొద్దు..’’ అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు పోలీసులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారన్న సమాచారంతో గులాబీ నేతల్లో ఆందోళన నెలకొంది. ఏదో ఒక రూపంలో నయీమ్‌తో సంబంధాలు నెరిపిన కొందరు టీఆర్‌ఎస్ నేతలు హడలిపోతున్నారు.
నామినేటెడ్ పదవుల భర్తీపై ప్రభావం
అధికార పార్టీలో నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తున్న నేతల సంఖ్య తక్కువేం లేదు. పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ రెండేళ్లుగా రాష్ట్ర, జిల్లా స్థాయి కార్పొరేషన్ పదవుల కోసం ఆశగా చూస్తున్నారు. ఇప్పటికే కొన్ని పదవులు భర్తీ అయినా.. అవి ఎమ్మెల్యేలకే ఎక్కువగా దక్కాయి. కొత్త జిల్లా ఏర్పాటు తర్వాత పార్టీ పదవులు, అధికార పదవుల భర్తీ ఉంటుంద నుకుంటున్న సమయంలో.. నయీమ్ వ్యవహారం తెరపైకి వచ్చింది. అతడితో నెరపిన సంబంధాల కారణగా తమకు అవకాశం దక్కదన్న శంక వీరిని పట్టి పీడిస్తోంది. నయీమ్‌తో ఏళ్లుగా సంబంధాలు ఉన్నాయని భావిస్తున్న పార్టీ ఎమ్మెల్సీ ఒకరికి ఇలాగే అవకాశం చేజారిందన్న ప్రచారం జరుగుతోంది. శాసన మండలిలో చీఫ్ విప్, ఇద్దరు విప్‌ల పదవుల నియామకాన్ని ప్రభుత్వం ఇటీవలే పూర్తి చేసింది.
వాస్తవానికి ఒక ఎమ్మెల్సీ మండలి విప్ పదవి కోసం అధినేత వద్ద ఎంతగానో ప్రయత్నించారు. ఒక దశలో ఆయనకు చీఫ్ విప్ పదవి కూడా లభిస్తుందన్న ప్రచారం జరిగింది. కానీ ఆయనకు నయీమ్‌తో సంబంధాలున్నాయని ప్రచారం జరగడం, పోలీసులకు కొన్ని ఆధారాలూ లభించడంతో అవకాశం దక్కలేదని చెబుతున్నారు. దీంతో మరో ఎమ్మెల్సీకి అనూహ్యంగా మండలి విప్ పదవి లభించింది. ఇలాగే వరంగల్ జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే సోదరుడు నామినేటెడ్ పదవికి పోటీలో ఉన్నారు.
ఆయనకు దాదాపు ఖాయమని అనుకుంటున్న తరుణంలో సదరు ఎమ్మెల్యే సోదరుడికీ నయీమ్‌తో లింకులు ఉన్నాయని తెలియడంతో ఆయన ఆశలపై నీళ్లు చల్లినట్లు అయ్యింది. మంత్రి పదవి ఆశిస్తున్న ఓ మహిళా ఎమ్మెల్యే భర్తకూ నయీమ్‌తో సంబంధాలు ఉన్నాయని అనుకుంటుండడంతో ఆమెకు దార్లు మూసుకుపోయిన ట్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వీరికి అధికార పదవులను అటుంచితే, కనీసం పార్టీలోనూ గుర్తింపు లేకుండా పోయే ప్రమాదం పొంచి ఉందంటున్నారు.
రాజీనామాలు.. సస్పెన్షన్లు?
నయీమ్‌తో ఏళ్లుగా అంటకాగిన వారిపై సీఎం కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీరి లింకులకు పోలీసులు ఆధారాలు సైతం చూపడంతో వారిపై చర్యలు తప్పవన్న సంకేతాలను సీఎం ఇచ్చినట్లు సమాచారం. పదవుల్లో ఉన్న నేత లను వారి పదవులకు రాజీనామాలు చేయిస్తారని అంటున్నారు. పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయాలన్న చర్చ జరిగిందని తెలిసింది. ఈ నెలాఖరు నాటికి చర్యలు ఉండొచ్చని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. డీజీపీ అనురాగ్ శర్మ ఇప్పటికే సీఎంకు ఇచ్చిన మధ్యంతర నివేదికలో టీఆర్‌ఎస్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు, ఇద్దరు ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, మాజీ మంత్రుల పేర్లు ఉన్నాయన్న నేపథ్యంలో.. మున్ముందు చోటు చేసుకోబోయే పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది.
కృష్ణయ్యపై చర్య తప్పదా?
నయీమ్ కేసులో టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్యకు చిక్కులు తప్పేలా లేవు. నయీమ్‌తో తనకు సుదీర్ఘకాలంగా సంబంధం ఉందని, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఫోన్లో మాట్లాడినట్లు స్వయంగా ఆయన మీడియాకు చెప్పడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు తనను సీఎంగా చూడాలని నయీమ్ భావించాడంటూ పేర్కొన్నాడు. ఎన్‌కౌంటర్ జరగడానికి రెండు నెలల ముందు సైతం చర్చలు జరిపినట్లు వెల్లడించారు. నయీమ్ కేసుల దర్యాప్తులో భాగంగా పోలీసులకు కొందరు ప్రజాప్రతినిధులకు సంబంధించి ఆధారాలు లభ్యమైనట్లు ప్రచారం జరుగుతోంది.
ఒకట్రెండు రోజుల్లో వారికి సీఆర్‌పీసీ సెక్షన్ 160 (సాక్షిగా) లేదా సీఆర్‌పీసీ సెక్షన్ 41 (నిందితుడు)గా పరిగణించి నోటీసులు జారీ చేయాలని సిట్ భావిస్తోంది. ఇంతలోనే ఆర్.కృష్ణయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. అజ్ఞాతంలో ఉన్న ఒక నేరస్తుడితో మాట్లాడటం, అతడి వివరాలు తెలిసుండి పోలీసులకు చెప్పకపోవడం కూడా నేరం కిందకు వస్తుందని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. కృష్ణయ్యే స్వయంగా నయీమ్‌తో ఉన్న అనుబంధాన్ని బయటపెట్టినందున ఆయన్ను పిలిచి విచారించాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. నయీమ్ భూ దందా కోణంలో కృష్ణయ్యను విచారించే అవకాశం ఉంది.