డాక్టర్ సిద్ధరాములుకు కండువా కప్పుతున్న మంత్రి పోచారం
సాక్షి, కామారెడ్డి: ఎన్నికలు ఇప్పట్లో లేవంటూనే అధికార టీఆర్‌ఎస్ పార్టీ విపక్ష పార్టీల నేతలకు గాలం వేస్తోంది. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కోసం పర్యటనలుజరుపుతున్న అధికార పార్టీ ప్రజాప్రతినిధులు.. పనిలో పనిగా ఇతర పార్టీల నేతలతో మంతనా లు సాగిస్తూ వారికి గులాబీ తీర్థం ఇస్తున్నారు. జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో ఇటీవలి కాలంలో వలసలు జోరందుకున్నాయి. జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యమంతో పాటు, విద్యార్థి ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్న చెలిమెల భానుప్రసాద్ ఇటీవలే ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. మరో విద్యార్థి నాయకుడు అగ్గి రవీందర్ కూడా కారెక్కారు. కాంగ్రెస్ టికెట్టుపై గెలిచిన కామారెడ్డి మున్సిప ల్ చైర్‌పర్సన్ పిప్పిరి సుష్మ, వైస్ చైర్మన్ మసూ ద్, మాచారెడ్డి జెడ్పీటీసీ సభ్యురాలు గ్యార లక్ష్మి, డీసీసీబీ వైస్ చైర్మన్ పరికి ప్రేమ్‌కుమార్, భిక్కనూరు ఎంపీపీ సుదర్శన్... ఇలా పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులను గతంలోనే టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. నియోజకవర్గంలో మెజారిటీ ప్రజాప్రతినిధులు ఇప్పుడు అధికార పార్టీలోనే ఉన్నారు. తాజాగా సోమవారంబీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, గత ఎన్నికల్లో ఎమ్మె ల్యే అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ ఇట్టం సిద్దరాములును కూడా పార్టీలోకి ఆహ్వానించారు.
బాన్సువాడ నియోజక వర్గంలో..
వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తన నియోజక వర్గంలో ప్రత్యర్థి పార్టీలకు చెందిన ముఖ్య నాయకులకు గాలం వేస్తూ వారిని పార్టీలో చేర్చుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు గట్టి పోటీ లేకుండా చూసుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉమ్మడి జిల్లా గ్రంథాల య సంస్థ చైర్మన్‌గా పనిచేసిన శ్రీనివాస్‌యాద వ్, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు కిషోర్‌యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గురువినయ్‌కుమార్‌లను టీఆర్‌ఎస్‌లోకి లాగారు. అలాగే గిరిజన నాయకుడిగా గుర్తింపున్న టీడీపీ నియోజక వర్గ ఇన్‌చార్జి, బంజారాసంఘం జిల్లా అధ్యక్షు డు బద్యానాయక్‌కు గులాబీ కండువా కప్పారు.
జుక్కల్ నియోజక వర్గంలోనూ టీఆర్‌ఎస్‌లోకి వలసలు కొనసాగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే హన్మంత్ సింధే వివిధ పార్టీల్లోని పలువురు గ్రామ, మండల స్థాయి నేతలను పార్టీలోకి తీసుకువచ్చారు. కుల సంఘాల ప్రతినిధులకూ గులాబీ తీర్థం ఇస్తున్నారు.
ఎల్లారెడ్డిలో..
ఎల్లారెడ్డి నియోజక వర్గంలో ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి వివిధ పార్టీలకు చెందిన గ్రామ, మండల స్థాయి నాయకులను టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానిస్తున్నారు. ఏడాది కాలంలో నియోజక వర్గంలోని వివిధ పార్టీలకు చెందిన ద్వితీయ శ్రేణి నేతలను చాలామందిని కారెక్కించుకున్నారు. తాడ్వాయి మండలానికి చెందిన సింగిల్ విండో చైర్మన్ సంజీవరెడ్డికి ఇటీవలే గులాబీ కండువా కప్పేశారు. జిల్లాలో అత్యధికంగా కొత్త పంచాయతీలు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోనే ఏర్పాటవుతున్నాయి. దీంతో ఆయా గ్రామాలకు చెందిన ముఖ్య నాయకులు, పెద్ద మనుషులందరినీ గులాబీ గూటికి తీసుకువస్తున్నారు.
ముందుచూపుతో....
రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాలనుంచి గట్టి పోటీ లేకుండా చూసుకోవాలన్న ముందుచూపుతో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ప్రత్యర్థి పార్టీల నేతలకు గాలం వేస్తున్నట్టు తెలుస్తోంది. బాన్సువాడ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు పలువురు టీఆర్‌ఎస్‌లో చేరడానికి మంత్రి పోచారం తన రాజకీయ చాతుర్యాన్ని ప్రదర్శించారు. ప్రత్యర్థిని బలహీన పరచడం ద్వారా దూసుకెళ్లాలన్న ఆలోచనతో ఉన్నారు. కామారెడ్డి నియోజక వర్గంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అభివృద్ధి కార్యక్రమాల పేరుతో గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. స్థానికంగా ఎక్కువ సమయం గడుపుతున్నారు. ప్రభుత్వ పరంగా ఎక్కువ మందికి సీఎం సహాయ నిధి ద్వారా సాయం అందించే ప్రయత్నం చేశారు. అలాగే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీతో పాటు యంత్రలక్ష్మి ద్వారా ట్రాక్టర్ల పంపిణీ వంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ అటు ప్రజలను, ఇటు క్యాడర్‌ను ఆకర్శించే పనిలో పడ్డారు. ఎమ్మెల్యేలు శుభకార్యాలకు హాజరుకావడం, ఎవరైనా చనిపోతే పరామర్శించడం వంటి విషయాలకు ప్రాధాన్యతనిస్తున్నారు. జుక్కల్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యేలు కూడా తమతమ నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రయత్నాలను అప్పుడే ముమ్మరం చేశారు. అధికార పార్టీ నేతలు ఇతర పార్టీల నేతలకు గాలం వేస్తుండడంతో అంతటా ఎన్నికలపైనే చర్చ జరుగుతోంది.
టీఆర్‌ఎస్‌లోకి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ ఇట్టం సిద్దరాములు సోమవారం టీఆర్‌ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్‌ల సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. సిద్ధరాములు 2014 ఎన్నికల్లో కామారెడ్డి అసెంబ్లీ నియోజక వర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. సిద్ధరాములుతో పాటు ఆయన సోదరుడు, రాజంపేట మాజీ సర్పంచ్ ఇట్టం నడిపి సిద్ధరాములు, కుటుంబ సభ్యులు డాక్టర్ సుకుమార్, డాక్టర్ అజయ్‌లు కూడా కారెక్కారు. ఈ సందర్భంగా ప్రభుత్వం విప్ గంప గోవర్ధన్ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయని భావించి సిద్ధరాములు తమ పార్టీలో చేరారని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ ముజీబొద్దీన్, నాయకులు శేర్ల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment