సమాజంలో ఇతరుల కంటే అట్టడుగున ఉన్న దళితుల అభ్యున్నతి కోసమే తొలుత దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టాం. ప్రాధాన్యతా క్రమంలో బీసీ, ఈబీసీలు, మైనారిటీలు, ఇతర పేదలకూ దీన్ని వర్తింపజేస్తాం. దశలవారీగా అన్నివర్గాల అభివృద్ధికి పనిచేస్తాం. రాష్ట్ర ఆవిర్భావం మొదలుకుని ఇప్పటిదాకా ఏ ఎన్నిక జరిగినా టీఆర్‌ఎస్ గెలుస్తూ వస్తోంది. 2018 ఎన్నికల్లో 89 స్థానాల్లో గెలిచినా.. మధుసూదనాచారి, తుమ్మల, పి.మహేందర్‌రెడ్డి వంటి నాయకులు సొంత తప్పిదాలతో ఓటమి పాలయ్యారు. దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా నేను స్వయంగా ఓ బహిరంగ సభకు హాజరై ఉంటే బాగుండేది. అక్కడ అభ్యర్థి మీద వ్యతిరేకత వల్లే ఆశించిన ఫలితం రాలేదు. -కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘దళితబంధు’ తరహాలో రాష్ట్రం లో అన్ని వర్గాల పేదలకు పథకాన్ని అమలు చేస్తా మని టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఈ విషయంలో ప్రతిపక్షాల విమర్శలకు జడవబోమని, దశలవారీగా అన్ని వర్గాల అభివృద్ధి కోసం పనిచేస్తామని చెప్పారు. పార్టీని చూసే ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారని.. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నది ముమ్మాటికీ టీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. పార్టీలోకి నాయకులు వస్తూ పోతూ ఉంటారని, ఎవరికైనా పార్టీయే సుప్రీమ్ అని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్ అన్ని ఎన్నికల్లో వరుస విజయాలు సాధిస్తూ వస్తోందని, దీనికి దారిదాపుల్లో ఎవరూ లేరని చెప్పారు. మరో ఇరవై ఏండ్లు రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అధికారంలో ఉంటుందన్నారు. మంగళవారం తెలంగాణభవన్‌లో జరిగిన టీఆర్‌ఎస్ రాష్ట్ర కమిటీ సమావేశంలో కేసీఆర్ సుమారు రెండున్నర గంటలకుపైగా ప్రసంగించారు. ముఖ్యాంశాలు కేసీఆర్ మాటల్లోనే..
‘దళితబంధు’తో దేశవ్యాప్తంగా..
రెక్కల కష్టం మీదే బతుకున్న వారిలో ఎక్కువ మంది దళితులే ఉన్నారు. భూమిలేని నిరుపేదల్లో ఎస్టీలతో పోలిస్తే ఎస్సీలే ఎక్కువ శాతం ఉన్నారు. సమాజంలో అట్టడుగున్న ఉన్న దళితుల అభ్యున్నతి కోసమే దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టాం. సుమారు 25 ఏండ్ల కిందట నేను సిద్దిపేట ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో దళితజ్యోతి కార్యక్రమాన్ని చేపట్టిన స్ఫూర్తితో ప్రస్తుతం దళితబంధుకు శ్రీకారం చుట్టాం. ఈ పథకంపై వస్తున్న విమర్శలను ఎక్కడికక్కడ తిప్పికొట్టడంతోపాటు, ఈ పథకాన్ని లబ్ధిదారులకు చేరవేయడంలో పార్టీ యంత్రాంగం చురుగ్గా పనిచేయాలి.
పథకం ప్రయోజనాలను అందిపుచ్చుకునేలా దళిత జాతిని చైతన్యవంతులను చేయాలి. స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్లు గడుస్తున్నా దళితుల జీవితాలను మార్చే పథకాల అమల్లో జాతీయ పార్టీలు విఫలమయ్యాయి. దళితబంధుపై విమర్శలు చేస్తున్న పార్టీలు తమ పాలనలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని నిలదీయాలి. రాష్ట్రంలో దళితబంధు పథకం విజయం సాధిస్తే.. దేశవ్యాప్తంగా ఈ పథకం అమలు కోసం ఒత్తిడి పెరుగుతుంది. దళితబంధు ద్వారా తెలంగాణ దేశానికే రోల్ మోడల్‌గా మారుతుంది. ప్రాధాన్యతా క్రమంలో రాబోయే రోజుల్లో ఈ పథకాన్ని అన్ని వర్గాలకు వర్తింపజేస్తాం.
పార్టీ యంత్రాంగం నుంచే భవిష్యత్తు నేతలు
ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ విలీనం మొదలుకుని 2014లో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుదాకా సాగిన రాజకీయ పరిణామాలు, ఉద్యమాలకు ఎంతో నేపథ్యముంది. వివిధ కారణాలతో పార్టీలు, నాయకులు జాతీయ పార్టీలకు లొంగిపోయినా.. 2001లో తెలంగాణ సాధన లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ను ఏర్పాటుచేసి వరుసగా రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చాం. ఉద్యమ లక్ష్యాల సాధన కోసం పనిచేస్తున్నాం. పార్టీ యంత్రాంగం నుంచే కొత్త నాయకత్వం పుట్టుకొస్తుంది. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారందరికీ భవిష్యత్తులో రాజకీయంగా వివిధ రూపాల్లో అవకాశాలు వస్తాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కమిటీతో మరో సందర్భంలో సమావేశమై.. జాతీయ రాజకీయాల్లో టీఆర్‌ఎస్ పాత్ర గురించి మాట్లాడుతా.
సభ్యత్వ నమోదు పూర్తి చేయండి
ఈ ఏడాది ఫిబ్రవరిలోచేపట్టిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈ నెలాఖరుతో పూర్తిచేయండి. మరో 38 నియోజకవర్గాల నుంచి సభ్యత్వ నమోదు వివరాలు పార్టీ కార్యాలయానికి అందాల్సి ఉంది. సెప్టెంబర్ రెండో తేదీ నుంచి గ్రామస్థాయిలో సంస్థాగత కమిటీల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించాలి. 12,796 గ్రామ పంచాయతీలు, 3,654 మున్సిపల్ వార్డుల వారీగా పార్టీ కమిటీలు ఏర్పాటు చేయాలి. మండల, మున్సిపల్, పట్టణ, జిల్లా కమిటీల ఏర్పాటును వచ్చే నెలాఖరులోగా పూర్తి చేయాలి. చాలాకాలం తర్వాత పార్టీ జిల్లా అధ్యక్షులను కూడా నియమించాం. జిల్లా కమిటీల ఏర్పాటు పూర్తయిన తర్వాత రాష్ట్ర కమిటీని కొత్తగా ఏర్పాటు చేస్తాం. హైదరాబాద్, వరంగల్ మినహా 24 జిల్లాల్లో పార్టీ జిల్లా కార్యాలయాల నిర్మాణం పూర్తయింది. మిగతాచోట్ల పనులు చివరి దశలో ఉన్నాయి. విజయదశమికి అటూఇటూగా మంచి రోజులు చూసుకుని జిల్లా కార్యాలయాల ప్రారంభోత్సవాలకు హాజరవుతా. కరోనా మూలంగా రెండేళ్లుగా పార్టీ వార్షిక సమావేశాలు (ప్లీనరీ) జరగడం లేదు. కరోనా పరిస్థితులను బేరీజు వేసుకుని సెప్టెంబర్ నెలాఖరు లేదా అక్టోబర్‌లో పార్టీ ‘ద్విదశాబ్ధి ఉత్సవ సభ’ను నిర్వహిస్తాం.
ఢిల్లీలో టీఆర్‌ఎస్ భవన్‌కు శంకుస్థాపన
దేశ రాజధాని ఢిల్లీలోని వసంత్‌విహార్‌లో పార్టీ కార్యాలయ భవనం ‘టీఆర్‌ఎస్ భవన్’కు సెప్టెంబర్ 2న ఉదయం శంకుస్థాపన చేస్తా. ఘనంగా జరిగే ఈ కార్యక్రమానికి మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గం, జెడ్పీ చైర్మన్లు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, మరికొందరు హాజరవుతారు. శంకుస్థాపనకు ఒకరోజు ముందే సెప్టెంబర్ ఒకటో తేదీ సాయంత్రానికల్లా పార్టీ నేతలందరూ ఢిల్లీకి చేరుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలి. పార్టీ ఎంపీలు ఢిల్లీలోనే ఉండి రాష్ట్రం నుంచి వచ్చే ప్రతినిధులు రెండు మూడు రోజులు బస చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలి’’ అని సీఎం కేసీఆర్ సూచించారు. సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు, పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు, మంత్రి సత్యవతి రాథోడ్, నేతలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బోడకుంటి వెంకటేశ్వర్లు, తక్కళ్లపల్లి రవీందర్‌రావు, బడుగుల లింగయ్యయాదవ్, బస్వరాజు సారయ్య, ఫారూక్ హుస్సేన్, ఫరీదుద్దీన్, శంభీపూర్ రాజు, మాలోత్ కవిత, వేలేటి రాధాకృష్ణశర్మ, బక్కి వెంకటయ్య, ఇంతియాజ్ ఇషాక్, నారదాసు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment