సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ముందస్తు ఎన్నికల హడావుడి.. జాతీయ రాజకీయాల దిశగా టీఆర్‌ఎస్ అడుగుల నేప థ్యంలో అన్ని జిల్లాల్లో పార్టీ నేతల మధ్య ఉన్న పొరపొచ్చా లపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్టీలోని విభేదాలపై ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పోటీ చేసి ఓడిపోయిన నేతలు, జెడ్పీ చైర్మన్లతో ప్రత్యేకంగా చర్చించారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.
‘ఎమ్మెల్యేలు, నేతల పనితీరు ఆధారంగానే టికెట్లు వస్తాయి. పీకే సర్వేను కూడా ప్రామాణికంగా తీసుకుంటాం. కొన్ని కఠిన నిర్ణయా లకు కూడా వెనుకాడం. ఇప్పటి నుంచే మీ పనితీరు మెరుగు పరుచుకోవాలి. పార్టీ పరంగా ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉండాలి. గతంలో రెండుసార్లు జిల్లాలో చేదు ఫలి తాలు వచ్చాయని, ఈసారి అవి పునరావృతం కావొద్దని, పదికి పది స్థానాలను సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని కేటీఆర్ స్పష్టం చేశారు.
ప్రజలు ఈసడించుకునేలా అధికార యంత్రాంగాన్ని సొంత పనులకు వినియోగించుకోవద్దు. దీనివల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుంది’అని అన్నారు. సమావేశానికి ఎంపీ నామా నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కాగా స్థానికంగా లేకపోవడంతో ఖమ్మం జిల్లా టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య హాజరుకాలేదు.
బీఆర్‌ఎస్ కోర్ కమిటీ మీటింగ్‌కు పిలుస్తాం
జాతీయస్థాయిలో పార్టీ నిర్మాణంపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి పెట్టారని, భారత్ రాష్ట్రీయ సమితి(బీఆర్‌ఎస్) ఏర్పా టు చేస్తున్నామని, త్వరలోనే పార్టీ ప్రకటన ఉంటుందని చెప్పుకొచ్చారు. బీఆర్‌ఎస్ కోర్ కమిటీ మీటింగ్‌కు సంబం ధించి ఉమ్మడి జిల్లా ముఖ్యనేతలకు కూడా ఆహ్వానాలు అం దుతాయని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఇప్పుడు వచ్చినట్లుగానే భావించి అందరూ నియోజకవర్గాల్లో, గ్రామాల్లో విస్తృతంగా పర్యటించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment