మళ్లీ వస్తా.. రెండు రోజులుంటా.. | KCR Speech in Nirmal Open Meeting | Sakshi
Sakshi News home page

మళ్లీ వస్తా.. రెండు రోజులుంటా..

Published Mon, Apr 8 2019 2:17 PM | Last Updated on Mon, Apr 8 2019 2:19 PM

KCR Speech in Nirmal Open Meeting - Sakshi

‘దేశానికి కశ్మీర్‌ ఎట్లనో.. మన తెలంగాణకు ఉమ్మడి ఆదిలాబాద్‌ అట్ల. సహజసంపదలున్న జిల్లాను ఒకటిన్నర సంవత్సరాల్లో కశ్మీర్‌ లెక్క కళకళలాడేలా చేస్తా. ఇది నా బాధ్యత. ఎంపీ ఎన్నికల తర్వాత మళ్లీ ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు వస్తా. ఇక్కడి ఆదివాసీ బిడ్డలకు న్యాయం చేస్తా. అన్నివర్గాల సమస్యలను దూరం చేస్తా. ఆదిలాబాద్‌ ఓటర్లు మన నగేశ్‌ను మూడులక్షల మెజార్టీతో గెలిపించాలని కోరుతున్న..’  

నిర్మల్‌: ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివా రం సాయంత్రం సీఎం కేసీఆర్‌ నిర్మల్‌ వచ్చారు. జిల్లాకేంద్రంలో ని ఎల్లపెల్లి క్రషర్‌రోడ్డులో గల మైదానంలో భారీ బహిరంగసభ నిర్వహించారు. హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరిన ఆయన సరిగ్గా సాయంత్రం 5గంటల 10నిమిషాలకు సభాస్థలికి చేరుకున్నారు. 5.12కు ప్రసంగాన్ని ప్రారంభించి, 5.47  వరకు ముగించారు. మొత్తం 35నిమిషాల పాటు సీఎం ప్రసంగం కొనసాగింది. ముందుగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ నగేశ్, జెడ్పీ చైర్‌పర్సన్‌ శోభారాణి, ఎమ్మెల్యేలు జోగురామన్న, విఠల్‌రెడ్డి, బాపురావు, రేఖానాయక్, ఆత్రం సక్కు, కోనేరు కోనప్ప, డెయిరీ చైర్మన్‌ లోక భూమారెడ్డి తదితరులు మాట్లాడారు. అనంతరం సీఎం ప్రసంగం ప్రారంభించారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత 24గంటల పాటు రైతాంగానికి ఉచిత కరెంటు ఇస్తున్నామన్నారు. రాత్రిపూట పాములు, తేళ్ల మధ్య పొలానికి పోవడం, కరెంటు షాకుల కష్టం పోయేలా చేశామన్నారు. అన్నివర్గాల వారి పింఛన్లను పెంచామని, ఎక్కడా లేని విధంగా బీడీ కార్మికులకు కూడా పింఛన్లు ఇస్తున్నామని చెప్పారు. ఉమ్మడి ఆదిలాబాద్‌లోనూ బీడీ కార్మికులు ఉన్నారని పీఎఫ్‌ ఉన్న వారందరికీ పింఛన్‌ అందించనున్నామని పేర్కొన్నారు. రైతుబంధు సాయాన్ని ఏడాదికి ఎకరాకు రూ.పదివేలకు పెంచుతున్నామన్నారు. నాణ్యమైన చదువులు, సన్నబియ్యంతో విద్యార్థులకు భోజనం, 24గంటల కరెంటు, పింఛన్లు.. ఇలా ఇవన్నీ ప్రజల కండ్ల ముందే ఉన్నాయని పేర్కొన్నారు.

 జిందగీలా జిల్లా కాకుండే.. 

తెలంగాణ ఏర్పడటం వల్లే అభివృద్ధి సాధ్యమైందని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలన సౌలభ్యం కోసం జిల్లాలను ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌కు చెందిన అప్పటి మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న, ఎంపీ నగేశ్‌ తమ జిల్లాలో బెజ్జూరు నుంచి ఆదిలాబాద్, బాసర నుంచి ఆదిలాబాద్‌కు పోవాలంటే కష్టమవుతుందని నా దృష్టికి తీసుకువచ్చారన్నారు.

అందుకే ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ప్రజల కష్టాలు తీర్చేతందుకు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్‌లుగా నాలుగు జిల్లాలు చేసినమన్నారు. తెలంగాణ ఏర్పడకుంటే.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాకుంటే.. జిందగీలా నిర్మల్‌ జిల్లా కాకుండే.. అని పేర్కొన్నారు.  
 
కశ్మీర్‌లా కళకళలాడాలె.. 

దేశానికి కశ్మీర్‌ ఎలాగో.. తెలంగాణకు ఉమ్మడి జిల్లా అలాంటిదని సీఎం అభివర్ణించారు. సహ జసిద్ధమైన వనరులు, వనసంపద ఉన్న జిల్లాను అన్నిరకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. కాళేశ్వ రం ప్రాజెక్టులో భాగంగా 27, 28 ప్యాకేజీల్లో భాగంగా ఎస్సారెస్పీ ద్వారా నిర్మల్‌ నియోజకవర్గంలో 50వేల ఎకరాలు, ముథోల్‌ నియోజకవర్గంలో 50వేల ఎకరాలు.. మొత్తం లక్ష ఎకరాలకు సాగునీరు అందించనున్నామన్నారు. ప్రాణహిత నదిపై తుమ్మడిహెట్టి ప్రాజెక్టు కూడా చేపడుతున్నామని, మంచిర్యాల, కుమురంభీం జిల్లాలకూ సాగునీటిని అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ప్రాజెక్టులన్నింటిని సద్వినియోగం చేసేలా చూస్తామని, ఒకటిన్నర సంవత్సరం తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్‌ను కశ్మీర్‌లా కళకళలాడేలా చేస్తామని వివరించారు. ఇది తన బాధ్యతని కేసీఆర్‌ హామీ ఇచ్చారు.

 బర్రునచ్చి.. బుర్రున పోను.. 

మంచిర్యాల జిల్లాకు చెందిన రైతు ఫేస్‌బుక్‌లో వీడియో పెడితే, వెంటనే స్పందించి పరిష్కరించానని సీఎం సభలో పేర్కొన్నారు. అందరి లెక్క ఆల్తూ..ఫాల్తూ ముచ్చట్లు చెప్పుడు ఇష్టం లేదని.. జూన్‌ తర్వాత దేశమే ఆశ్చర్యపోయేలా కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తమని వెల్లడించారు. భూ యజమానికి సంపూర్ణమైన హక్కును కల్పిస్తామని చెప్పారు. రైతులకు సంబంధించిన భూసమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ఇందుకోసం ఎన్నికల తర్వాత మళ్లీ ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు వస్తానని చెప్పారు. ఇప్పటి లెక్క.. బర్రునచ్చి బుర్రున పోనని, రెండుమూడు రోజుల ఇక్కడనే ఉంటానన్నారు. సీఎస్‌తో సహా అందరు అధికారులు, మంత్రివర్గమంతా తనతో ఇక్కడే ఉంటుందన్నారు. రైతులు నెల రోజులు ఓపిక పట్టాలని, భూసంబంధిత సమస్యలన్నీ పరిష్కారమవుతాయని హామీ ఇచ్చారు. రైతులందరికీ గిట్టుబాటు ధరలు అందేలా చేస్తామన్నారు.

1996లోనే సత్తెన్నతో చెప్పిన.. 

సీఎం కేసీఆర్‌ మరోసారి టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు వి.సత్యనారాయణగౌడ్‌ను గుర్తుచేసుకున్నారు. తెలంగాణ ఏర్పడితే సమస్యలన్నీ దూరమైతాయని తాను 1996లోనే కడ్తాల్‌ సత్యనారాయణతో చెప్పానని సీఎం గుర్తుచేశారు. అప్పట్లో తాను ఎస్సారెస్పీకి వచ్చినప్పుడు సత్యనారాయణగౌడ్‌ మరికొందరితో కలిసి డ్యామ్‌పై నడుచుకుంటూ వెళ్లామని చెప్పారు.

అప్పుడే తెలంగాణ కోసం ఉద్యమం గురించి మాట్లాడుకున్నామన్నారు. బతికుంటే తానే ఉద్యమం చేస్తానని సత్తెన్నతో చెప్పానని సీఎం పేర్కొన్నారు. 2001లో జెండా పట్టుకుంటే ముందుగా ఎవరూ రాలేదని, ఆ తర్వాత ఒక్కొక్కరుగా వచ్చి చేరడంతో ఉద్యమం బలపడిందన్నారు. స్వరాష్ట్రం సాధించుకోవడం వల్ల పేదలకు, వృద్ధులకు, ఒంటరి, వితంతు, దివ్యాంగులకు పింఛన్లను ఇచ్చి కడుపు నింపుతున్నామన్నారు. 

న్యాయం చేస్తా.. 

గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులు, పథకాల లొల్లి పడి ఆదిలాబాద్‌ జిల్లాకు రాలేకపోయానని సీఎం పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత ఆదిలాబా ద్, నిర్మల్‌లకు వస్తానని, రెండుమూడు రోజులు ఇక్కడే ఉండి అభివృద్ధి పనులు చేయిస్తానని హా మీ ఇచ్చారు. ఆదిలాబాద్‌ ఆదివాసీ బిడ్డలకు న్యా యం చేస్తానన్నారు. పోడు భూములు, ఏజెన్సీలో గిరిజనేతరుల భూముల సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు. జిల్లాలో మైనార్టీ ముస్లింల కోసం ప్రత్యేక గురుకులాలను ఏర్పాటు చేశామన్నారు.

అన్నివర్గాలను అభివృద్ధి చేయడం తన బాధ్యత అని చెప్పారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యేల సహకారంతో జిల్లా అభివృద్ధి పథంలో నడుస్తుం దన్నారు. గత ఎన్నికల్లో జిల్లాకు వచ్చి కోరితే.. తొమ్మిది మందిఎమ్మెల్యేలను గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాననీ, లోక్‌సభ ఎన్నికల్లో పనిమంతుడైన గోడం నగేశ్‌ను మరోసారి ఎంపీగా గెలిపించాలని కోరారు. ఈసారి 3లక్షల మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.  

భారీ బందోబస్తు 

సభకు ఎస్పీ శశిర్‌రాజు ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. సీఎం హోదాలో తొలిసారి ఉమ్మడి జిల్లాకు వచ్చిన కేసీఆర్‌ కార్యక్రమానికి అంచెలంచెలుగా భద్రత ఏర్పాట్లు చేశారు. సభలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అధ్యక్షత వహించారు. ఇందులో రాజ్యసభ ఎంపీలు కె.కేశవరావు, సంతోష్‌రావు, జెడ్పీచైర్‌పర్సన్‌ శోభారాణి, ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్‌ బాపురావు, అజ్మీరా రేఖానాయక్, విఠల్‌రెడ్డి, కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు, ఎమ్మెల్సీ పురాణం సతీశ్, డెయిరీ చైర్మన్‌ లోక భూమారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, నల్ల ఇంద్రకరణ్‌రెడ్డి, సీనియర్‌ నాయకులు సత్యనారాయణగౌడ్, కే. శ్రీహరిరావు, రాంకిషన్‌రెడ్డి, అరిగెల నాగేశ్వర్‌రావు, డాక్టర్‌ మల్లికార్జున్‌రెడ్డి, గౌతమ్‌రెడ్డి, ఎర్రవోతు రాజేందర్, ధర్మాజీగారి రాజేందర్, పాకాల రాంచందర్, డాక్టర్‌ స్వర్ణారెడ్డి, శ్యాంసుందర్, కౌన్సిలర్లు, సర్పంచులు తదితరులు హాజరయ్యారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement