సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కేంద్రానివి పార్టిషన్ పాలిటిక్స్ అని.. తమవి న్యూట్రిషన్ పాలిటిక్స్ అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. రాష్ట్రంలోని మహిళల ఆరోగ్యం కోసం ఉచితంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్వహించ తలపెట్టిన ఎనిమిది రకాల వ్యాధులు, 57 టెస్టులతో కూడిన ‘ఆరోగ్య మహిళ’పథకానికి మంత్రి హరీశ్‌రావు కరీంనగర్‌లో బుధవారం శ్రీకా రం చుట్టారు. అనంతరం మార్క్‌ఫెడ్ గ్రౌండ్‌లో జరి గిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
కేంద్రం హిందూ–ముస్లిం అంటూ ప్రజలను విభజి స్తూ పాలిస్తూ.. పార్టిషన్ పాలిటిక్స్‌కు పాల్పడుతోందని మండిపడ్డారు. కరీంనగర్‌కు మెడికల్ కాలేజీ అడిగినా ప్రైవేటు కాలేజీలను సాకుగా చూపి అను మతి నిరాకరించిందన్నారు. తాము మాత్రం ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ఈ ఏడాది మెడికల్, నర్సింగ్ కాలేజీలను ప్రారంభిస్తున్నామన్నారు.
50 శాతం మంది మహిళలకు..
తెలంగాణలోని 50 శాతం మంది మహిళలు కేన్సర్, రక్తహీనత, గర్భసంచి, అధిక బరువు, పోషకాహార లోపం వంటి సమస్యలతో బాధపడుతున్నారని హరీశ్‌రావు చెప్పారు. ఆర్థిక ఇబ్బందులతో అనారోగ్య సమస్యను భర్తకు చెప్పుకోలేక చిన్న సమస్యను పెద్దగా చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
కేసీఆర్ కిట్‌తో గర్భిణులకు విశేష సేవలు అందుతున్నాయన్నారు. మహిళా ఆరోగ్యం పేరుతో మహిళలకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వమే చికిత్స అందిస్తుందని చెప్పారు. మెరుగైన సేవల కోసం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో 8 రకాల సమస్యలకు 8 వార్డులను ఏర్పాటు చేశామన్నారు. త్వరలోనే కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మారై స్కానింగ్ మెషీన్ అందుబాటులోకి తెస్తామని, సమస్య పెద్దది కాకముందే మహిళలు ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకొని చికిత్స పొందాలని సూచించారు.
ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని ఆడబిడ్డలకు ఆరోగ్యమహిళ, న్యూట్రిష న్ కిట్స్, రూ.750 కోట్లవడ్డీలేని రుణాలు విడుదల చేసి మూడు కానుకలను అందజేశారన్నారు. రెండో దశ వడ్డీలేని రుణాలను జూన్ లేదా జూలైలో అందజేస్తామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు.
శ్రీరామనవమి తరువాత న్యూట్రిషన్ కిట్లు
ఆరోగ్య మహిళలో భాగంగా మొత్తం 8 రకాల ఆరోగ్య సమస్యలకు ఆరోగ్య మహిళ ద్వారా పరిష్కారం లభిస్తుందని హరీశ్‌రావు చెప్పారు. రెఫరల్ ఆసుపత్రుల్లో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతీ మంగళవారం పూర్తిగా మహిళా వైద్య సిబ్బంది ఉండి వైద్యం అందిస్తారని.. ప్రస్తుతం 100 ఆసుపత్రులు ప్రారంభిస్తున్నామని తెలిపారు.
రాబోయే రోజుల్లో 1200 సెంటర్లకు పెంచుతామని హామీ ఇచ్చారు. అటెండర్ నుంచి డాక్టర్ దాకా ఆ క్లినిక్‌లో అంతా మహిళలే ఉంటారన్నారు. శ్రీరామ నవమి తరువాత రాష్ట్రవ్యాప్తంగా న్యూట్రిషన్ కిట్స్ అందిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment