వావిలాల సభలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: సాధారణ వ్యక్తిగా ఉన్న ఈటల రాజేందర్‌కు రాజకీయ ఓనమాలు నేర్పించి మంత్రిని చేసిన సీఎం కేసీఆర్‌కు, కన్నతల్లి లాంటి పార్టీకి వెన్నుపోటు పొడిచారని టీఆర్‌ఎస్ హుజూరాబాద్ ఉప ఎన్నిక ఇన్‌చార్జి, మంత్రి హరీశ్‌రావు అన్నారు. ‘మంత్రిగా ఉంటూ అసైన్డ్ భూములు కొనడం నేరం కాదా? మంత్రిగా ఉంటూ నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు ఆయన గెలిచి ప్రతిపక్షంలో కూర్చుని ఏం చేస్తారు.
ఆయన స్వార్థం కోసం ఈ ఉప ఎన్నిక వచ్చింది. నిన్నటిదాకా విమర్శించిన బీజేపీలో ఏ ముఖం పెట్టుకుని చేరారు. అధిక ధరలతో సామాన్యుడిని, నల్లచట్టాలతో రైతుల ఉసురు పోసుకుంటున్న పార్టీ బీజేపీ. కుట్రలు, సానుభూతి స్టంట్లతో ఎన్నికలో గెలవాలని చూస్తున్నారు. దళితబంధును తాత్కాలికంగా నిలిపివేయించిన రాజేందర్, బీజేపీ దళిత ద్రోహులుగా మిగిలారు. హుజూరాబాద్ మా కంచుకోట. ఇక్కడ మరోసారి భారీ మెజారిటీతో గెలిచి తీరుతాం’అన్నారు. ‘సాక్షి’తో ఆయన ప్రత్యేక ంగా మాట్లాడారు.
సాక్షి: హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం పార్టీ సుదీర్ఘకాలంగా ఎందుకు ప్రచారం చేయాల్సి వస్తోంది?
హరీశ్: ఇది ప్రత్యేకమైన ఎన్నిక. కరోనా నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియని సందిగ్ధత. మరోవైపు బీజేపీ ప్రచారం మొదలుపెట్టింది. అందుకే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పార్టీని సంసిద్ధంగా ఉంచేందుకు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో భాగంగా మేం కూడా ప్రచారం మొదలుపెట్టాం. కన్నతల్లిలాంటి పార్టీకి ఈటల వెన్నుపోటు పొడిచాడు. ఆ తల్లి గుండెల మీద కాలితో తన్ని, తండ్రిలాంటి కేసీఆర్‌కు ద్రోహం చేశాడు.
సాక్షి: హుజూరాబాద్ కోసమే దళిత బంధు తెచ్చారన్న ప్రచారం జరుగుతోంది?
హరీశ్: రైతుబంధు, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, ఆసరా పింఛన్, ఎవరి కోసం తెచ్చారు? గతంలో దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ హుజూరాబాద్‌లో ప్రారంభించినప్పుడు రాజేందర్ పక్కనే ఉన్నారు. ఆనాడు ఎందుకు వ్యతిరేకించలేదు. బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి కేంద్ర ఎన్నికల కమిషన్(సీఈసీ)కు రాసిన లేఖలో కరీంనగర్ సీపీ, కలెక్టర్‌ను ట్రాన్స్‌ఫర్ చేయాలని, దళితబంధు నిధులు ఖాతాల్లో వేయకుండా ఆపాలని కోరారు. అసలు ఆయన లేఖ రాయకపోతే సీఈసీ వివరణ కోరేది కాదు. దళితబంధు ఆగేది కాదు. నవంబర్ 4 లేదా 5న నేను, కొప్పుల వస్తాం. అర్హులైన ప్రతీ కుటుంబానికి దళితబంధును అందజేస్తాం.
సాక్షి: ధరల పెరుగుదల, ప్రైవేటీకరణ, పెట్రో ఉత్పత్తుల పెంపుపై ప్రజల స్పందన ఎలా ఉంది?
హరీశ్: అసలు బీజేపీకి ఎందుకు ఓటేయాలి. రాజేందర్ ఏం చెప్పి ఓటు అడుగుతున్నారు? బీజేపీ గ్యాస్ సిలిండర్ ధర రూ.1000కి పెంచింది. రూ.500 ఉన్న సబ్సిడీని క్రమంగా రూ.40కి తగ్గించింది. 21 రోజుల్లో 16 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. దీంతో ఉప్పు, పప్పు, కూరగాయల ధరలు పెరిగాయి.
సాక్షి: ఆరుసార్లు ఎమ్మెల్యే, రెండుసార్లు మంత్రిగా ఉన్న ఈటలను గెల్లు ఎదుర్కోగలరా?
హరీశ్: గెల్లు శ్రీనివాస్ యాదవ్ గొప్ప ఉద్యమకారుడు. 2004లో అప్పటి మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి మీద నిలుచున్నపుడు ఈటల రాజేందర్ ఎవరికి తెలుసు? ఆ రోజు కేసీఆర్, గులాబీ జెండాను చూసి జనాలు ఆయన్ను గెలిపించారు. ఆయనతో పోలిస్తే గెల్లు శ్రీనివాస్ వందరెట్లు సమర్థుడు. తప్పకుండా ఆయన భారీ మెజారిటీతో గెలుస్తారు. పార్టీ పెట్టినప్పటి నుంచి హుజూరాబాద్ టీఆర్‌ఎస్‌కు కంచుకోట. ఈటల రాజీనామాతో హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి నిలిచిపోయింది. గెల్లు గెలిచాక అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం. ఈ అభివృద్ధి కొనసాగాలంటే టీఆర్‌ఎస్ పార్టీ గెలవాలి. ఎంపీగా బండి సంజయ్ రెండున్నరేళ్లలో ఏం చేశారు? రాజేందర్ గెలిచినా జరిగేదేమీ ఉండదు.
సాక్షి: మీకు రోడ్డు రోలర్, చపాతీ రోలర్ గుర్తులు ఇబ్బంది కలిగిస్తాయా?
హరీశ్: ఈ రోడ్డు రోలర్, చపాతీ వల్ల పార్టీకి నష్టం కలిగింది. వీటిని తొలగించాలని గతంలోనే ఈసీని మేం కోరాం. ఎలాగైనా మాపార్టీ ఓట్లు చీల్చాలన్న చిల్లర రాజకీయాలతోనే ఈ గుర్తులతో బీజేపీ, రాజేందర్ తమకు లబ్ధిపొందే ఎత్తుగడలు వేస్తున్నారు. ఇవన్నీ దింపుడుకళ్లెం ఆశలు.
Comments
Please login to add a commentAdd a comment