సాక్షి, హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌లో నిబద్ధత కలిగిన కార్యకర్తగా పనిచేస్తున్న తన పేరును మాజీ మంత్రి ఈటల రాజేందర్ తరచూ ప్రస్తావించడం సరికాదని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తనకు గురువు, మార్గదర్శి అని.. ఎప్పటికీ ఆయన మాట జవదాటకుండా నడుచుకుంటానని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘సీఎం కేసీఆర్ కేవలం పార్టీ అధ్యక్షుడే కాదు.. నాకు గురువు, నా మార్గదర్శి, నాకు తండ్రితో సమానం. ఆయన మాట జవదాటకుండా నడుచుకుంటున్నా. నా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు ఇలాగే నడుచుకుంటా. నేను నిబద్ధత, విధేయత, క్రమశిక్షణగల కార్యకర్తను. పార్టీ ఆవి ర్భావం నుంచి నేటి వరకు నాకు పార్టీ ప్రయోజనాలే పరమావధి. పార్టీ ఏ పని అప్పగించినా పూర్తి చేయడం నా విధి. కేసీఆర్ ఏ ఆదేశం ఇచ్చినా శిరసావహించడం కర్తవ్యంగా భావిస్తా’’ అని హరీశ్ పేర్కొన్నారు.
ఈటలది మనో వికారం
‘‘తాచెడ్డ కోతి వనమెల్లా చెరిచినట్టు’గా ఈటల రాజేందర్ వైఖరి కనిపిస్తోంది. పార్టీని వీడటానికి ఆయనకు అనేక కారణాలు ఉండొచ్చు. ఉండాలా, వెళ్లిపోవాలా అన్నది ఆయన ఇష్టం. ఈటల బయటకు వెళితే.. టీఆర్‌ఎస్ పార్టీకి వీసమెత్తు నష్టం లేదు. ఆయన పార్టీకి చేసిన సేవకన్నా.. పార్టీ ఆయనకు ఇచ్చిన అవకాశాలే ఎక్కువ. తన సమస్యలకు, తన గొడవకు నైతిక బలం కోసం పదే పదే నా పేరు ప్రస్తావించడం ఈటల భావ దారిద్య్రానికి నిదర్శనం. నా భుజాలపై తుపాకీ పెట్టాలనుకోవడం విఫల ప్రయత్నమే కాదు, వికారం కూడా. ఆయన మాటల్లో మనో వికారమే తప్ప సత్యం ఎంత మాత్రం లేదు. నా గురించి ఈటల చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా’’ అని పేర్కొన్నారు.
కేంద్రం వల్లే టీకాలకు ఇబ్బందులు
సాక్షి, సిద్దిపేట: వ్యాక్సిన్ల విషయంలో ‘అమ్మ పెట్టదు, అడుక్కోనివ్వదు’ అనే చందంగా కేంద్రం వ్యవహరిస్తోందని ఆర్థికశాఖ మంత్రి టి.హరీశ్‌రావు విమర్శించారు. శనివారం సిద్దిపేటలో ఏర్పాటు చేసిన కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో ఉత్పత్తి అయిన వ్యాక్సిన్‌ను కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుక్కునే పరిస్థితి లేకుండా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
చదవండి : Etela Rajender: అది ప్రగతి భవన్ కాదు.. బానిసల భవన్
Comments
Please login to add a commentAdd a comment