
హుజూరాబాద్: ‘హుజూరాబాద్ ఉపఎన్నికల్లో బీజేపీ గెలిచేది లేదు. ప్రభుత్వం వచ్చేది లేదు. ఈటల మంత్రి అయ్యేది లేదు’ అని ఆర్థిక శాఖమంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. మంగళవారం మండలంలోని సింగాపురంలో జరిగిన టీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. తమకు అన్నం పెట్టి, ఆతిథ్యం ఇచ్చిన ఊరు సింగాపురం అన్నారు. ‘ఆసరా పింఛన్, కల్యాణలక్ష్మి కడుపు నింపవని రాజేందర్ అన్నడు. కేసీఆర్ కిట్ పనికి రాదట. రైతుబంధు దండగ అట.
ఆసరా పెన్షన్ పరిగ ఏరుకున్నట్లు అని రాజేందర్ అన్నడు’ అని చెప్పారు. ‘రాజేందర్ నీవు శ్రీమంతుడివి. నీకు అవసరం లేకపోవచ్చు కానీ ఓ అవ్వకు కొండంత ఆత్మవిశ్వాసం కల్పించింది ఆసరా పెన్షన్’ అని తెలిపారు. బీజేపీ, ఈటల రాజేందర్ హుజూరా బాద్‌కు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. అబద్ధాల బీజేపీ మాటలు నమ్మొద్దని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం మంచిగా నడుస్తుందని, ధరలు పెంచిన బీజేపీ తమకెందుకని ప్రశ్నించారు.