మాట్లాడుతున్న రాజేందర్
ఇల్లందకుంట (హుజూరాబాద్): దేశంలో ఇంత ఖరీదైన ఎన్నికలు ఎప్పుడూ చూడలేదని, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందేందుకు కేసీఆర్ కుట్రలు చేస్తోంటే ఆయన అల్లుడు హరీశ్‌రావు అమలు చేస్తున్నారని మాజీమంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆరోపించారు. హుజూరాబాద్‌లో ఇప్పటికే రూ.4,700 కోట్లకు సంబంధించిన జీవోలతోపాటు రూ.250కోట్లను ఓటర్లకు పంచిపెట్టారని ఆయన విమర్శించారు.
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని ఓ గార్డెన్‌లో మంగళవారం జరిగిన నాయీబ్రాహ్మణ, రెడ్డి కులస్తుల ఆత్మీయ సమ్మేళనానికి ఈటల రాజేందర్ హాజరయ్యారు. అనంతరం ఈటల మాట్లాడుతూ..ఎన్నికలప్పుడు మాత్రమే సీఎం కేసీఆర్‌కు నాయీబ్రాహ్మణులు, రజకులు గుర్తుకొస్తారని...వారి అభివృద్ధికి రూ.500కోట్లు కేటాయించాలని ఓ సమావేశంలో తాను ప్రాతిపాదించగా రూ.28కోట్లే ఇచ్చారని విమర్శించారు. ప్రగతిభవన్‌లో మంత్రులకు, ఎమ్మెల్యేలకు ప్రవేశంలేదని రాష్ట్రంలో వారికి స్వేచ్ఛలేదని వారంతా రబ్బరు స్టాంపులుగా ఉన్నారని ఈటల ఆరోపించారు.
నియంతలా పాలిస్తున్న కేసీఆర్ నుంచి 2023లో ప్రజలకు విముక్తి లభిస్తుందని జోస్యం చెప్పారు. డబ్బు, మద్యంతో ప్రజలను బానిసలుగా మారుస్తున్నారని, మోకాళ్ల మీద నడిచినా హుజూరాబాద్ ప్రజలు టీఆర్‌ఎస్‌కు ఓట్లు వేయరని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, చల్లా ధర్మారావు, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చెర్మన్ సురేందర్ రాజు, శ్రీనివాస్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment