సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నేడు(బుధవారం) జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు అభివృద్ధి పనులకు కేసీఆర్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. సీఎం పర్యటనకు కావాల్సిన ఏర్పాట్లను మంత్రులు కొప్పుల ఈశ్వర్, హరీశ్‌రావు, గంగుల కమలాకర్ పూర్తిచేశారు. సాయంత్రం ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు.
ఉమ్మడి జిల్లా నుంచి దాదాపుగా 2 లక్షల మందిని సీఎం సభకు సమీకరించేందుకు స్థానిక నేతలు ఏర్పాట్లు చేశారు. జగిత్యాల సభలో సీఎం కేసీఆర్ చేసే ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై సీబీఐ, ఈడీ, ఐటీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు వరుసగా దాడులు, నోటీసులు జారీ చేయడంపై ముఖ్యమంత్రి మండిపడే అవకాశాలు ఉన్నాయి.
ఈ నెల 11న కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత సీబీఐ విచారణను ఎదుర్కోనున్న నేపథ్యంలో ఈ సభలో సీఎం ఏం మాట్లాడబోతున్నారన్న దానిపై నాయకులు, ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది. జగిత్యాల అసెంబ్లీ స్థానం కూడా నిజామాబాద్ పార్లమెంటు సెగ్మెంటు పరిధిలో వస్తుండటంతో సభకు సంబంధించిన ఏర్పాట్లలో ఎమ్మెల్సీ కవిత కూడా తలమునకలయ్యారు.
సీఎం కేసీఆర్ పర్యటన వివరాలు
►బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరుతారు.
►12.35 గంటలకు జగిత్యాల సమీకృత కలెక్టరేట్ సమీపంలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.
►12.40 గంటలకు జిల్లా టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం
►ఒంటి గంటకు మెడికల్ కళాశాల భవనం, మధ్యాహ్నం 1.15 గంటలకు జగిత్యాల జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయ భవనం ప్రారంభం
►3.10 గంటలకు మోతె గ్రామంలో బహిరంగసభ
►సాయంత్రం 6 గంటలకు కరీంనగర్‌కు బయలుదేరి తీగలగుట్టపల్లిలోని ఆయన నివాసానికి చేరుకుంటారు.
►మరునాడు ఉదయం ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్‌ను ప్రారంభించి, అనంతరం మాజీ మేయర్ రవీందర్ సింగ్ కూతురు వివాహవేడుకకు హాజరుకానున్నారు. ఆ తరువాత కరీంనగర్‌లోని తీగలబ్రిడ్జి, మానేరు రివర్‌ఫ్రంట్ పనులను పరిశీలిస్తారు. అనంతరం హైదరాబాద్‌కు హెలికాప్టర్‌లో తిరుగుప్రయాణం కానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment