24న ఔరంగాబాద్‌లో బీఆర్‌ఎస్‌ సభ  | BRS meeting in Aurangabad on 24th | Sakshi
Sakshi News home page

24న ఔరంగాబాద్‌లో బీఆర్‌ఎస్‌ సభ 

Published Sun, Apr 16 2023 1:18 AM | Last Updated on Sun, Apr 16 2023 5:25 PM

BRS meeting in Aurangabad on 24th - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఈ నెల 24న బీఆర్‌ఎస్‌ బహిరంగ సభ జరగనుంది. ఆ రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ విస్తరణకు ప్రాధాన్యమిస్తున్న ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇప్పటికే రెండు సభలను నిర్వహించగా.. తాజాగా మూడో సభ నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ లక్ష్యంగా క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేదిశగా బీఆర్‌ఎస్‌ అడుగులు వేస్తోంది.

ఈ క్రమంలో మహారాష్ట్రకు చెందిన వివిధ పా ర్టీల నేతలు కేసీఆర్‌ సమక్షంలో గులాబీ కండువా కప్పుకుని బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. బీజేపీ, శివసేనతోపాటు ఎన్‌సీపీ, శివసంగ్రామ్‌పార్టీ, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన తదితర పార్టీల నేతలు, కార్యకర్తలు ఈ జాబితాలో ఉన్నారు. షెట్కారీ సంఘటన్‌ నేత శరద్‌ ప్రవీణ్‌జోషి, మాజీ ఎమ్మెల్యేలు శంకరన్న డోంగె, సంగీత థోంబర్‌తోపాటు వివిధ పా ర్టీల తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసిన నేతలు ఇప్పటికే బీఆర్‌ఎస్‌లో చేరారు. 

గ్రామ స్థాయిలో బలోపేతానికి ప్రాధాన్యత 
క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం లక్ష్యంగా తెలంగాణకు సరిహద్దుగా ఉన్న మహారాష్ట్ర జిల్లాలతోపాటు తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాలపై బీఆర్‌ఎస్‌ దృష్టి కేంద్రీకరిస్తోంది. ప్రధానంగా లాతూర్, నాందేడ్, యవత్మాల్, చంద్రాపూర్, షోలాపూర్, ఔరంగాబాద్, ఉస్మానాబాద్, బీడ్, నాసిక్‌ జిల్లాలపై ఫోకస్‌ చేసింది. పా ర్టీలోకి చేరికలు కూడా ఈ ప్రాంతాల నుంచే ఎక్కువగా ఉంటున్నాయి.

ఈ క్రమంలోనే నాందేడ్‌లో ఫిబ్రవరి 5న బీఆర్‌ఎస్‌ తొలిసభను నిర్వహించగా.. మార్చి 6న కాంధార్‌–లోహలో రెండో సభ జరిగింది. తాజాగా ఔరంగాబాద్‌లో మూడో సభ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఒకట్రెండు రోజుల్లో ఏర్పాట్లు ప్రారంభమవుతాయని బీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి. 

తర్వాత షోలాపూర్‌లో.. 
ఔరంగాబాద్‌ తర్వాత మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతం లేదా పూర్వపు హైదరాబాద్‌ స్టేట్‌లో భాగమైన షోలాపూర్‌ను ఎంచుకోవాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న చేరికలను కొనసాగిస్తూనే క్షేత్రస్థాయిలో కమిటీల ఏర్పాటు ద్వారా.. పార్టీని బలోపేతం చేసేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు.

పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాన్షు తివారీతోపాటు, బీఆర్‌ఎస్‌ రైతు విభాగం మహారాష్ట్ర శాఖ అధ్యక్షుడు మాణిక్‌ కదమ్‌ తదితరులు చేరికలు, పార్టీ కార్యకలాపాల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. మరోవైపు జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, మాజీ ఎంపీ వేణుగోపాలాచారి, పౌరసరఫరాల కార్పొరేషన్‌ చైర్మన్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్‌ మహారాష్ట్ర నేతల చేరికలను సమన్వయం చేస్తున్నారు. 

అంకాస్‌ మైదానంలో బహిరంగ సభ 
ఔరంగాబాద్‌ సభకు సంబంధించి మహారాష్ట్రలోని కన్నడ్‌ నియోజకవర్గ కేంద్రంలో శనివారం సన్నాహక సమావేశం నిర్వహించారు. బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ అహ్మద్, ఐడీసీ చైర్మన్‌ వేణుగోపాలాచారి, మహారాష్ట్ర బీఆర్‌ఎస్‌ కిసాన్‌ సమితి అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే శంకరన్న డోంగే, హర్షవర్ధన్‌ జాదవ్, సీనియర్‌ నాయకులు అభయ్‌ కైలాస్‌రావు పాటిల్‌ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సభకు జన సమీకరణ, ఏర్పాట్లు, ఇతర అంశాలపై చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న రైతు ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లడం లక్ష్యంగా ఔరంగాబాద్‌ సభ జరుగుతున్నట్లు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ప్రకటించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement