
ఎర్రవల్లి నివాసంలో పార్టీ నేతలతో కేసీఆర్ వరుస భేటీలు
క్షేత్రస్థాయిలో రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ పనితీరుపై ఆరా
జన సమీకరణ, సభ ఏర్పాట్లపై 20కి పైగా ప్రత్యేక కమిటీలు
ఏప్రిల్ 2న ఎల్కతుర్తిలో బహిరంగ సభా స్థలికి భూమి పూజ
రెండో వారం నుంచి జిల్లాలవారీగా కేటీఆర్ పర్యటనలు
సాక్షి, హైదరాబాద్: పార్టీ రజతోత్సవ వేడుకల్లో భాగంగా ఏప్రిల్ 27న నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయడంపై బీఆర్‌ఎస్ పార్టీ దృష్టి కేంద్రీకరించింది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఎర్రవల్లి నివాసంలో పార్టీ ముఖ్య నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. సభకు జన సమీకరణపై దిశానిర్దేశం చేస్తున్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి సభకు ఎంత మంది తరలివచ్చే అవకాశముందని ఆరా తీస్తున్నారు. మరోవైపు క్షేత్రస్థాయిలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ పనితీరుపై ప్రజలు స్పందిస్తున్న తీరును అడిగి తెలుసుకుంటున్నారు.
ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ, కరీంనగర్, వరంగల్ జిల్లాకు చెందిన ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశాలు నిర్వహించారు. బడ్జెట్ సమావేశాలపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుకు ఎప్పటికప్పుడు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తూ వచ్చారు. అదే సమయంలో పార్టీ ముఖ్యనేతలతో వరుస భేటీలు నిర్వహించారు.
ఉత్తర తెలంగాణలో బీజేపీ అంతర్గతంగా నిర్వహిస్తున్న కార్యకలాపాలపై కేసీఆర్ ఆరా తీస్తున్నట్లు తెలిసింది. పార్టీ సంస్థాగత నిర్మాణం, ఏడాది పొడవునా నిర్వహించాల్సిన రజతోత్సవ వేడుకల తీరుతెన్నులపైనా నేతల అభిప్రాయాలు కోరుతున్నట్లు తెలిసింది.
సభ ఏర్పాట్లకు ప్రత్యేక కమిటీలు
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బీఆర్‌ఎస్ అధినేత.. సభ నిర్వహణలో పార్టీ ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. సభ నిర్వహణ కోసం 20కి పైగా కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డితోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నేతలు సభా స్థలి ఎంపిక, రైతుల నుంచి నిరభ్యంతర పత్రాల సేకరణ, పోలీసుల అనుమతులకు దరఖాస్తులు తదితర పనుల్లో తలమునకలయ్యారు.
హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ఒడితెల సతీశ్‌కుమార్‌కు కూడా బాధ్యతలు అప్పగించారు. సుమారు 1,200 ఎకరాల్లో బహిరంగ సభ నిర్వహణ ఏర్పాట్లు జరగనుండగా, మైదానం చదును చేయడం, వేదిక నిర్మాణం తదితరాలకు సంబంధించిఏప్రిల్ 2న భూమి పూజ చేస్తారు.
తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమీక్షలు
సభను విజయవంతం చేసేందుకు జిల్లాలవారీగా ఈ నెల 20న సన్నాహక భేటీలకు శ్రీకారం చుట్టిన కేటీఆర్.. ఇప్పటికే సూర్యాపేట, కరీంనగర్ జిల్లాల ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఏప్రిల్ మొదటి వారంలో తెలంగాణ భవన్‌లో కేటీఆర్ అధ్యక్షతన పార్టీ అనుబంధ సంఘాల నాయకులతో వరుస సమావేశాలు జరుగనున్నాయి.
పార్టీ జిల్లా అధ్యక్షులను కూడా ఈ సమావేశాల్లో భాగస్వాములను చేస్తారు. ఈ సమావేశాలు ముగిసిన తర్వాత ఏప్రిల్ రెండో వారంలో కేటీఆర్ జిల్లాలవారీగా రజతోత్సవ సభ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తారు. కేటీఆర్ జిల్లా పర్యటనలకు సంబంధించిన షెడ్యూల్‌ను త్వరలో విడుదల చేస్తామని తెలంగాణ భవన్ వర్గాలు వెల్లడించాయి.